కోడెల కుటుంబానికి కష్టమేనా.

గుంటూరు ముచ్చట్లు:
ఒక్క నియోజకవర్గం ఇన్ ఛార్జిని నియమించడానికి చంద్రబాబుకు మూడేళ్లు సమయం కూడా సరిపోవడం లేదు. 2019 ఎన్నికల ఫలితాల తర్వాత ఆ నియోజకవర్గానికి ఇన్ ఛార్జిలేరు. పార్టీలో నేతలు ఐదు గ్రూపులుగా విడిపోయి ఇన్ ఛార్జి పదవి కావాలని గట్టిగా పట్టుబడుతుండటంతో చంద్రబాబు కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో టీడీపీకి ఇప్పుడు ఒక్క ఇన్ ఛార్జి అంటూ లేకపోయారు. నేతలు మాత్రం తామే ఇన్ ఛార్జి అవుతామంటూ చెప్పుకుని తిరిగేస్తున్నారు.మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ 2014 లో ఈ నియోజకవర్గం నుంచి గెలిచారు. 2019లో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత కోడెల ఆత్మహత్య చేసుకున్నారు. కోడెల శివప్రసాద్ మరణం తర్వాత అక్కడ ఇన్ ఛార్జి లేకుండా పోయారు. నిజానికి కోడెల వారసుడు శివరామకృష్ణకు ఇన్ ఛార్జి పదవిని అప్పగించాల్సి ఉంటుంది. కోడెల కుటుంబంతో చంద్రబాబుకు ఉన్న అనుబంధం, ఆయన పార్టీ కోసం చేసిన సేవను దృష్టిలో పెట్టుకుని కళ్లుమూసుకుని ఇన్ ఛార్జిగా కోడెల శివరామ్ ను నియమించాల్సి ఉంది. కానీ కుదరదు. ఎందుకంటే కోడెల శివరామ్ ను ఆయన సొంత నియోజకవర్గంలోని నేతలే వ్యతిరేకిస్తున్నారు. అధికారంలో ఉండగా తమను ఇబ్బంది పెట్టిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. తమను ఆర్థికంగా కోలుకోలేని దెబ్బతీశారని కొందరు నేరుగా చంద్రబాబుకు కోడెల శివరామ్ పై ఫిర్యాదు చేశారు. కోడెల శివరామ్ కు ఇన్ ఛార్జి పదవి ఇస్తే తాము పార్టీకి రాజీనామా చేస్తామని హెచ్చరికలు కూడా పంపారు. అందువల్లనే కోడెల శివరామ్ పేరు చంద్రబాబు పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. ఆయనను ఇన్ ఛార్జిని చేస్తే లేనిపోని తలనొప్పులు వస్తాయని భావిస్తున్నారు. మరోవైపు సత్తెనపల్లి ఇన్ ఛార్జి పదవి కోసం ఐదుగురు పోటీ పడుతున్నారు. నరసరావుపేట పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు బంధువు నాగబోతు శౌరయ్య తనకు ఇన్ ఛార్జి పదవి కావాలంటున్నారు. అలాగే మాజీ ఎమ్మెల్యే ఆంజనేయులు కూడా తనను ఇన్ ఛార్జిని చేయాలని చంద్రబాబును ఇప్పటికి మూడు సార్లు కలిశారు. రాయపాటి సాంబశివరావు కుమారుడు రంగారావు కూడా ఆశిస్తున్నారు. వీరితో పాటు గతంలో గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షుడుా పనిచేసిన అబ్బూరి మల్లి కూడా ఇన్ ఛార్జి పదవి తనకే నంటున్నారు. తనకు లోకేష్ ఆశీస్సులున్నాయని చెబుతున్నారు. మొత్తం మీద ఎటు చూసినా కోడెల శివరామ్ కు సత్తెనపల్లి ఇన్ ఛార్జి పదవి దక్కడం కష్టమేనని అంటున్నారు.
 
Tags:Is it difficult for the Kodela family

Leave A Reply

Your email address will not be published.