కనీస ఆదాయ పథకం సాధ్యమేనా

Date:26/03/2019
న్యూఢిల్లీ ముచ్చట్లు:
కాంగ్రెస్ వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలో రావాలని సర్వశక్తుల ఒడ్డుతోంది. ఎన్నికల అస్త్రాలను ఒక్కొక్కటిగా బయటకు తీస్తోంది. అందులో భాగంగానే పేదలను ప్రసన్నం చేసుకోవడానికి, వారికి భరోసా కల్పించేందుకు కనీస ఆదాయ పథకాన్ని ప్రకటించింది. తాము అధికారంలోకి వస్తే దేశంలోని ప్రతి పేద కుటుంబానికి ఈ పథకాన్ని వర్తింప జేస్తామని పేర్కొంది. నెలకు రూ.12,000 కన్నా తక్కువ ఆదాయం కలిగి ఉన్న కుటుంబాలకు నెలకు రూ.6,000 అందిస్తామని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సోమవారం ప్రకటించారు. ప్రజలు గత ఐదేళ్లలో చాలా ఇబ్బందులకు గురయ్యారని, వారిని ఆదుకుంటామని తెలిపారు. కనీస ఆదాయ పథకం వల్ల ఐదు కోట్ల కుటుంబాలు లబ్ది పొందనున్నాయని పేర్కొన్నారు. దాదాపు 25 కోట్ల మందికి ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. పేదరికంపై పోరాటానికి ఇది తుది అస్త్రమని పేర్కొన్నారు.
కనీస ఆదాయ పథకం ఆలోచన ఎప్పటిది?
1938లోనే కనీస ఆదాయ పథకం గురించి చర్చ జరిగింది. 1964లో దీన్ని అమలు చేయాలని నిర్ణయించుకున్నారు. 2011-12లో మధ్యప్రదేశ్‌లోని 8 గ్రామాల్లో పైలెట్ ప్రాజెక్ట్ కింద దీన్ని అమలు చేశారు. 2022లో కనీస ఆదాయ పథకాన్ని అమలు చేస్తామని సిక్కిం ప్రభుత్వం కూడా ప్రకటించింది. అలాగే అమెరికా, కెన్యా, బ్రెజిల్, యూకే, స్విట్జర్లాండ్ వంటి పలు దేశాల్లో ఈ పథకాన్ని పరీక్షించారు. అయితే ఎక్కడ కూడా ఇది విజయవంతం కాలేదు. ఒక వ్యక్తి పేదరికం నుంచి బయలకు వచ్చి ఒకరకమైన జీవనం సాగించాలంటే సంవత్సరానికి రూ.7,620 అవసరమని 2009లో సురేశ్ టెండూల్కర్ పావర్టీ లైన్ పేర్కొంది.
డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి?
పథకం విజయవంతమౌతుందా? లేదా? అనే అంశం లబ్దిదారుల ఎంపికపై ఆధారపడి ఉంటుంది. ఐదు కోట్ల కుటుంబాలకు ఏడాదికి రూ.72,000 కోట్లు వ్యయం అవుతుంది. అంటే ఐదేళ్ల కాలానికి రూ.3.6 లక్షల కోట్లు కావాలి. దేశ బడ్జెట్‌లో ఇది 13 శాతానికి సమానం. 2018-19 అంచనా గణాంకాల ప్రకారం ప్రస్తుత ధరలు ఆధారంగా చూస్తే జీడీపీ విలువ రూ.188 లక్షల కోట్లు. కనీస ఆదాయ పథకపు వ్యయం ఇందులో 2 శాతానికి సమానం. ప్రస్తుత సబ్సిడీలను ఉపసంహరించుకోవడం ద్వారా ఏ స్థాయిలో నిధులు సమీకురుతాయనే అంశం కూడా ఇక్కడ కీలకమే. ఆహారం, ఎరువుల సబ్సిడీ, వ్యవసాయ వడ్డీ రేట్ల ప్రయోజనాలు వెనక్కు తీసుకుంటే రూ.2.5 లక్షల కోట్లు మిగులుతాయి. అలాగే కేంద్రం ఎంప్లాయ్‌మెంట్ గ్యారంటీ స్కీమ్ కోసం ప్రతి ఏడాది రూ.50,000 కోట్లు ఖర్చు పెడుతోంది. అలాగే ఇతర సబ్సిడీలను (ఇంధన సబ్సిడీలు కాకుండా) ఉపసంహరించుకుంటే అప్పుడు కనీస ఆదాయ పథకానికి నిధులు సమకూరే అవకాశముంది. పథకాలను ప్రవేశపెట్టేందుకు నిధులను సమకూర్చుకుంటే సరిపోతుంది. అయితే వాటిని వెనక్కు తీసుకోవడం మాత్రం కష్టం. ఎందుకంటే దాని చుట్టూ చాలా రాజకీయ అంశాలు చేరుతాయి. అందువల్ల ఇప్పటికే ఉన్న స్కీమ్స్‌ను ఉపసంహరించడం కష్టతరం కావొచ్చు.
Tags:Is the minimum income scheme possible?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *