అర్హులైనవారందరికి నూతన రేషన్ కార్డుల జారీ

– రాష్ట్ర బీసీ , పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్

 

హైదరాబాద్ ముచ్చట్లు:

 

రాష్ట్రంలో అర్హులైన వారందరికి  పారదర్శకంగా నూతన రేషన్ కార్డులను జారీ చేయాలని రాష్ట్ర బీసి మరియు పౌరసరఫరాల శాఖ మంత్రి  గంగుల కమలాకర్  సంబంధిత అధికారులను ఆదేశించారు.  నూతన రేషన్ కార్డుల జారీ , ధాన్యం కోనుగొలు సంబంధిత అంశాల పై
మంత్రి శుక్రవారం సంబంధిత ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో  కాన్పరెన్సు నిర్వహించారు. రాష్ట్ర కాబినెట్ సబ్ కమిటీ సూచించిన విధంగా పెండింగులో ఉన్న అప్లికేషన్ లు త్వరితగతిన వెరిఫికేషన్ చేసి జాబితాను వారం రోజుల్లో పంపాలని మంత్రి ఆదేశించారు. రాష్ట్రంలో ఏ ఒక్కరూ ఆకలితో అలమటించకుండా ఉండకూడదనే ముఖ్యమంత్రి  సంకల్పాన్ని అధికారులకు మంత్రి వివరించారు. కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తుల వివరాలను క్షేత్రస్థాయిలో  రెవెన్యూ, మున్సిపల్ సిబ్బంది ద్వారా క్షేత్రస్థాయిలో వారం రోజుల్లో వెరిఫికేషన్ జరిపించి, అర్హులైన వారి జాబితాను పంపించాలని జిల్లా కలెక్టర్లకు మంత్రి సూచించారు. కొంతమంది కిరాయి ఇండ్లల్లో ఉన్న వారు రేషన్ కార్డుకు ధరఖాస్తు చేసుకున్నారని, ప్రస్తుతం వారు ఇండ్లు మారిన గుర్తించి ఉన్న చోటు నుండి రేషన్ కార్డు మంజూరు చేయుటకు తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.
రాష్ట్రంలోని రేషన్ కార్డులకు త్వరలోనే స్మార్ట్ కార్డులను జారీ చేయాలని ప్రభుత్వం పరిశీలిస్తుందని మంత్రి అధికారులకు తెలిపారు.   రాష్ట్రంలో 1,454 చౌక ధరల దుకాణ డీలర్లు ఖాళీగా ఉన్నాయని, త్వరలో భర్తీ చేయుటకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు.

 

 

 

జిల్లాలో కొన్ని తండాలు గ్రామ పంచాయితీలుగా మారాయని, ఉన్న చౌక ధరల దుకాణాలు ప్రజలకు దూరం అయినచో  అవసరాన్ని బట్టి వారికి సబ్ సెంటర్ డీలర్ ను ఏర్పాటు చేయుటకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు.  జిల్లాల నుండి అర్హులైన రేషన్ కార్డుల లబ్ధిదారుల జాబితా అందిన వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి తో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని మంత్రి  తెలిపారు.నూతన   రేషన్  కార్డులు జారీ చేసిన తరువాత అదనంగా అవసరమైన చోట నూతన రేషన్ షాపులు  ఏర్పాటు చేయాలని  మంత్రి ఆదేశించారు.
ధాన్యం కొనుగోళ్లల్లో తెలంగాణ రాష్ట్రం సరికొత్త రికార్డులు సృష్టించిందని మంత్రి తెలిపారు.  ఈ రబీ సీజన్ లో 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయుటకు ప్రభుత్వం లక్ష్యం కాగా ఇంతవరకు అంచనాలకు మించి 90 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యాన్ని కొనుగోలు చేశామని మంత్రి తెలిపారు. 17 వేల కోట్లకు పైగా విలువ గల ధాన్యాన్ని సేకరించామని కొనుగోలు చేసిన ధాన్యానికి మూడు రోజుల్లోనే రైతుల ఖాతాలో నగదు జమ చేస్తున్నామని మంత్రి తెలిపారు.  కొన్ని జిల్లాలలో ఆలస్యంగా వరి సాగు అయినందున వరి కోతలు కూడా ఆలస్యం అయినాయని, అట్టి రైతులు ధాన్యాన్ని సెంటర్లకు ఆలస్యంగా తెచ్చారని, అట్టి ధాన్యాన్ని కూడా మొత్తం కొనుగోలు చేస్తామని మంత్రి తెలిపారు.  రాష్ట్రంలో వరి ధాన్యం ఉత్పత్తి ఘణనీయంగా పెరిగిందని మంత్రి తెలిపారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ లను ఏర్పాటు చేయుటకు చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఈ ప్రాసెసింగ్ జోన్ లలో ధాన్యం మిల్లింగ్ వ్యవస్థ కూడా ఏర్పాటు చేయబడుతుందని తెలిపారు. రైతుల నుండి సేకరించిన ధాన్యానికి వెంటనే డబ్బులు చెల్లించాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

 

 

 

దేశంలో ఏ రాష్ట్రంలో కూడా వరి ధాన్యానికి కనీస మద్ధతు ధర చెల్లించలేదని ఒక తెలంగాణ రాష్ట్రంలోనే రైతులు పండించిన మొత్తం ధాన్యాన్ని ఎలాంటి ఇబ్బందులు లేకుండా కనీస మద్ధతు ధర పై కొనుగోలు చేసినట్లు మంత్రి తెలిపారు. ధాన్యం సేకరణకు తగినన్ని గన్నీ బ్యాగులను కూడా సమకూర్చామని మంత్రి తెలిపారు.  కొన్ని కొనుగోలు కెంద్రాలలో చిన్న చిన్న సమస్యలు వచ్చిన వెంటనే అధికారులు పరిష్కరించారని అన్నారు.  కరోనా క్లిష్ట సమయంలోను కూలీల కొరత, మిల్లింగ్ కొరత, ట్రాన్స్ ఫోర్ట్ కొరత, అకాల వర్షాల వంటి ఇబ్బందులను అధిగమించి రికార్డు స్థాయిలో ధాన్యం సేకరణలో సహకరించిన జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, పౌర సరఫరాల శాఖ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది, సహకార సోసైటీలకు, మహిళ సంఘాలకు, కూలీలకు, హమాలీలకు మంత్రి గంగుల కమలాకర్ ప్రత్యేక ధన్యవాధాలు తెలిపారు. వానాకాలం సీఎంఆర్ రైస్  డెలీవరి త్వరగా అయ్యే విధంగా పౌరసరఫరాల సంస్థ అధికారులు పర్యవేక్షించాలని  మంత్రి సూచించారు.

 

పుంగనూరు ఎస్‌ఈబి సీఐగా సీతారామిరెడ్డి

 

Tags: Issuance of new ration cards to all those eligible

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *