కోస్తా తీరం.. ఫలహారం!

It companies Coastal Area Municipal Department ViSakhapatnam bandaru

It companies Coastal Area Municipal Department ViSakhapatnam bandaru

సాక్షి

Date :23/01/2018

 200 కి.మీ. తీరప్రాంతం హస్తగతానికి ‘పెద్ద’ ప్రయత్నాలు

సీఆర్‌జెడ్‌–3 ప్రాంతాన్ని సీఆర్‌జెడ్‌–2లో చేర్చే ప్లాన్‌Advertisement Advertisement

మాస్టర్‌ప్లాన్‌లో మార్పులకు సిద్ధమైన ‘వుడా’

అదేదారిలో బందరు, నెల్లూరు పట్టణాభివృద్ధి సంస్థలు

అక్కడ నిర్మాణాలు చేపట్టడం నిబంధనలకు విరుద్ధం

పర్యావరణానికి పెనుముప్పు అంటున్న నిపుణులు

సాక్షి, అమరావతి బ్యూరో: ‘దేశంలో ఏ రాష్ట్రానికీ లేనంత సువిశాల సముద్ర తీర ప్రాంతం మన బలం… దాన్ని ఆలంబనగా చేసుకుని అపార అవకాశాలు సృష్టిస్తాం.. విశాఖ నగరాన్ని ఏపీలో ఐటీ సంస్థలు కొలువుదీరే కేంద్రంగా మారుస్తాం..’ అని తరచూ చెప్పే ప్రభుత్వ పెద్దలు ఇప్పుడా సాగర తీరాన్ని ఫలహారంలా పంచిపెట్టేందుకు ప్రణాళిక రచించారు. విశాఖపట్నం–విజయనగరం, కృష్ణా–గుంటూరు, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లోని దాదాపు 200 కి.మీ. తీరప్రాంతాన్ని తమవారికి కట్టబెట్టేందుకు ముఖ్యనేత రంగంలోకి దిగారు. అందుకు అడ్డుగా ఉన్న కోస్టల్‌ రెగ్యులేషన్‌ జోన్లను (సీఆర్‌జెడ్‌)  మార్చేందుకు సిద్ధమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ భూదాహంతో తీరప్రాంతం విధ్వంసానికి గురై ప్రకృతి విపత్తులకు దారి తీస్తుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తీరంలో మరో ఘోరం.. 
కోస్తా తీరంలో విస్తారంగా ఉన్న భూములపై దృష్టి సారించిన ప్రభుత్వ ముఖ్యనేత పర్యాటకాభివృద్ధి, ఐటీ రంగానికి ప్రోత్సాహం పేరుతో అస్మదీయ సంస్థలకు స్టార్‌హోటళ్లు, రిస్టార్టులు, కార్పొరేట్‌ సంస్థలకు కట్టబెట్టాలని ఎత్తుగడ వేశారు. విశాఖలోని కైలాసగిరి– విజయనగరం జిల్లా పూసపాటిరేగ, కృష్ణా జిల్లా బందరుతోపాటు కావలి నుంచి తడ వరకు అంటే 200 కి.మీ. మేర తీరప్రాంతం అప్పగించేందుకు పథకం వేశారు. వాస్తవానికి ఆ ప్రాంతమంతా సీఆర్‌జెడ్‌–3 కేటగిరీ కిందకు రావటంతో నిబంధనల ప్రకారం అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు.

జోన్లు మార్చేస్తే సరి… 
తీరాన్ని అస్మదీయ సంస్థలకు కట్టబెట్టేందుకు సిద్ధమైన ముఖ్యనేత విశాఖపట్నం–విజయనగరం, కృష్ణా, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ప్రతిపాదించిన తీరప్రాంతాన్ని సీఆర్‌జెడ్‌–2గా మార్చాలని ఆదేశించారు. దీనివల్ల  పరిమితస్థాయిలో నిర్మాణాలకు అవకాశం కలుగుతుంది. దీన్ని ఆసరాగా చేసుకుని 200 కి.మీ. పొడవునా భూములను అస్మదీయ సంస్థలకు కట్టబెట్టేసి పూర్తిస్థాయి నిర్మాణాలు చేపట్టవచ్చనేది ముఖ్యనేత వ్యూహం. అధికారంలో ఉన్నది తమ ప్రభుత్వమే కాబట్టి నిబంధనలకు విరుద్ధంగా ఉన్న నిర్మాణాలపై చూసీచూడనట్టు ఉండాలని  భావిస్తున్నారు. ఇందుకు అనుగుణంగానే విశాఖపట్నం పట్టణాభివృద్ధి సంస్థ (వుడా) మాస్టర్‌ప్లాన్‌లో మార్పులకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. వుడాకు స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబే అధ్యక్షుడిగా ఉండటం గమనార్హం.

వుడా, ముడా, నుడా… సరే 
విశాఖలోని కైలాసగిరి నుంచి విజయనగరం జిల్లా పూసపాటిరేగ వరకు ఉన్న ప్రాంతాన్ని సీఆర్‌జెడ్‌–3 నుంచి సీఆర్‌జెడ్‌–2గా మార్చాలని మాస్టర్‌ప్లాన్‌లో వుడా ప్రతిపాదించింది. మచిలీపట్నం పట్టణాభివృద్ధి సంస్థ (ముడా), నెల్లూరు పట్టణాభివృద్ధి సంస్థ (నుడా)లు కూడా తమ పరిధిలోని సీఆర్‌జెడ్‌–2 ప్రాంతాన్ని సీఆర్‌జెడ్‌–3గా మార్పులు చేయడానికి సన్నాహాలు చేపట్టాయి. పురపాలక శాఖ ఈ మొత్తం వ్యవహారాన్ని పర్యవేక్షిస్తోంది.

నిబంధనలకు విరుద్ధమే.. 
200 కి.మీ. పొడవున తీరప్రాంతాన్ని సీఆర్‌జెడ్‌–2గా మార్చడం నిబంధనలకు విరుద్ధం. కేవలం తీరాన్ని ఆనుకుని నగరాలు, పట్టణాలు ఉన్న ప్రాంతంలో మాత్రమే సీఆర్‌జెడ్‌–2 కేటగిరీ కిందకు చేర్చాలి. భూగర్భ డ్రైనేజీ, నీటిశుద్ధి ప్లాంటు తదితరాల కోసం ఆ వెసులుబాటు కల్పించారు. కానీ ప్రభుత్వం ప్రస్తుతం ప్రతిపాదిస్తున్న చోట అవేవీ లేవు. పైగా విశాఖకు చేరువలో వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన ఎర్రమట్టి దిబ్బలున్నాయి. తీరప్రాంతంలో తుపాన్ల తీవ్రతను తగ్గించే మడ అడవులు కూడా ఉన్నాయి. వీటిని పట్టించుకోకుండా విలువైన తీరప్రాంతాన్ని అప్పనంగా పంచేస్తే తీవ్ర ప్రకృతి వైపరీత్యాలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇదీ ‘సీఆర్‌జెడ్‌’ చట్టం
సముద్ర తీర ప్రాంతాన్ని పరిరక్షించడానికి కేంద్ర ప్రభుత్వం కోస్టల్‌ రెగ్యులేషన్‌ జోన్‌ (సీఆర్‌జెడ్‌) చట్టాన్ని రూపొందించింది. దీనిప్రకారం తీరప్రాంతాన్ని మూడు జోన్లుగా విభజించారు. తీరంలో ఇసుక ప్రాంతాన్ని సీఆర్‌జెడ్‌–1గా ప్రకటించారు. ఈ పరిధిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు. కేవలం జెట్టీలు, పోర్టులు, ఇతర మత్స్యకార సామాజిక కార్యక్రమాలే చేపట్టాలి. సముద్ర కెరటాలు అత్యంత ముందుకు వచ్చే ప్రాంతం (హైటైడ్‌ లైన్‌Œæ) నుంచి 500 అడుగుల వరకు సీఆర్‌జెడ్‌ ప్రాంతంగా ప్రకటించారు. సముద్రతీరంలో ఉండే నగరాలు, పట్టణాల కోసం మాత్రం కొంత వెసులుబాటు ఇచ్చారు. అందుకోసం 500 అడుగుల సీఆర్‌జెడ్‌ ప్రాంతాన్ని మళ్లీ రెండుగా విభజించారు. దీని ప్రకారం నగరాలు, పట్టణాలు ఉన్న చోట హైటైడ్‌ లైన్‌ నుంచి 200 అడుగుల వరకు సీఆర్‌జెడ్‌–2గా ప్రకటించారు. ఆ పరిధిలో నగరాల మురుగునీటి కాలువలు, నీటి శుద్ధి ప్లాంట్లు కోసం పరిమిత స్థాయిలో నిర్మాణాలను  అనుమతించారు. హైటైడ్‌ లైన్‌కు 200 అడుగుల నుంచి 500 అడుగుల వరకు సీఆర్‌జెడ్‌–3గా ప్రకటించారు. అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టడానికి వీల్లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *