నిరాధారమైన ఆరోపణలతో భక్తులను రెచ్చగొట్టడం సరికాదు : టిటిడి
తిరుమల ముచ్చట్లు:
మహారాష్ట్రీయులకు గర్వకారణమైన ఛత్రపతి శివాజీ మహరాజ్‌కు అవమానం జరిగినట్లు ఓ భక్తుడు వీడియో క్లిప్ ద్వారా ఆరోపించడాన్ని టిటిడి శనివారం ఒక ప్రకటనలో ఖండించింది. శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తులు తమ వాహనాలకు వ్యక్తుల విగ్రహాలు, ఫొటోలు, రాజకీయ పార్టీల జెండాలు, చిహ్నాలు, అన్యమత ప్రచారానికి సంబంధించిన ప్రచార సామగ్రి తిరుమలకు తీసుకువెళ్లడాన్ని టిటిడి కొన్ని దశాబ్దాల క్రితమే నిషేధించింది.
ఈ మేరకు రెండు రోజుల క్రితం మహారాష్ట్రకు చెందిన వాహనాన్ని అలిపిరి చెక్‌పాయింట్ వద్ద భద్రతా సిబ్బంది నిలిపి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా భద్రతా సిబ్బంది నల్లటి రంగులో ఉన్న ఒక ప్రతిమను గుర్తించారు. ఆ ప్రతిమ ఛత్రపతి శివాజీదని తెలుసుకుని తిరుమలకు అనుమతించారు. దేవతామూర్తుల చిత్రాలు తప్ప, వ్యక్తుల విగ్రహాలు, రాజకీయ పార్టీల జెండాలు, ఇతర చిహ్నాలను ప్రదర్శించరాదని సదరు భక్తుడిని కోరారు. అయితే ఆ భక్తుడు శివాజీ మహారాజ్‌ను టిటిడి అవమానించిందని ఆరోపిస్తూ తీవ్ర పదజాలంతో వీడియో రూపొందించి, ఇతరులను రెచ్చగొట్టేలా సోషల్ మీడియాలో వైరల్ చేశారు. సోషల్ మీడియాలో ఉన్న వీడియోలోని విషయాలను టిటిడి తీవ్రంగా ఖండించింది.
Tags: It is not right to provoke devotees with baseless allegations: TTD