ఎవరో ఒకరు బెట్టు దిగితే మంచిది

Date:27/01/2021

న్యూఢిల్లీ ముచ్చట్లు:

మూడు నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా కర్షకులు చేస్తున్న ధర్నా నెలన్నర రోజులైనా ఒక కొలిక్కి రాకపోవడం ఆందోళన కలిగిస్తోంది. పంజాబ్, హర్యానా తదితర రాష్రాల నుంచి వేలాదిగా తరలివస్తున్న రైతులు దేశ రాజధాని దిల్లీ సరిహద్దుల్లో ఎండ, వానా, చలిని లెక్కచేయకుండా ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతున్నారు. చట్టలాను రద్దు చేసేవరకు, కనీస మద్దతు ధరకు లిఖిత పూర్వకమైన హామీ ఇచ్చేవరకు తమ ఆందోళనను విరమించేది లేదని రైతు నేతలు తేల్చి చెబుతున్నారు. ఈ రెండు డిమాండ్ల విషయంలో ఎలాంటి రాజీలేదని స్పష్టం చేస్తున్నారు. ఇప్పటివరకు 11 సార్లు జరిగిన చర్చలు విఫలమయ్యాయి. మళ్లీ చర్చలు జరపాలని, సుప్రీంకోర్టు ప్రమేయం లేకుండా సమస్యను పరిష్కరించుకోవాలని అటు ప్రభుత్వం ఇటు రైతులు అంగీకారానికి రావడం ఆశావాహ పరిణామం.జై జవాన్, జై కిసాన్ అని 60ల్లో నాటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి పిలుపునిచ్చారు. అన్నంపెట్టే అన్నదాత అంటే అందరికీ గౌరవమే. వారి సమస్యల పట్ల ప్రతి ఒక్కరికీ సానుభూతి ఉంది. ఈ విషయంలో ప్రభుత్వం ఎంతోకొంత దిగిరావాలని అందరూ కోరుకుంటున్నారు. ఆఖరికి సర్వోన్నత న్యాయస్థానం సైతం సానుకూలంగా స్పందించింది.

 

 

 

నలుగురు సభ్యులతో కమిటీని నియమించింది. వీరిలో ఒక సభ్యుడు భూపేందర్ సింగ్ మాన్ కమిటీ నుంచి తప్పుకున్నారు. అశోక్ గులాటీ, అనిల్ ఘన్వాత్, ప్రమోద్ కుమార్ జోషీ మిగిలిన సభ్యులు. రెండునెలల్లో సమస్య పరిష్కారానికి బాటలు వేయాలని ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బోబ్డే సారథ్యంలోని సుప్రీంకోర్టు దర్మాసనం ఆదేశించింది. అంతేకాక సాగు చట్టాలపై స్టే విధించింది.ఆందోళన చేస్తున్న రైతుల్లో ఎక్కువమంది పంజాబ్ కు చెందిన వారని, వారిలో సిక్కులే ఎక్కువ మందన్న వాదన వినపడతోంది.దీనిని కాదన డం కూడా కష్టమే. దేశంలోని ఇతర ప్రాంతాల రైతులు ఉద్యమం పట్ల పెద్దగా స్పందించడం లేదు. దక్షిణాదిని పక్కనపెడితే ఉత్తరాదికి చెందిన రాజస్థాన్, యూపీ, మధ్యప్రదేశ్, తదితర రాష్రాల రైతులు ఉద్యమంలో పెద్దయెత్తున పాల్గొన్న దాఖలాలు లేవు. పంజాబ్, హర్యానాల్లో వరి, గోధుమ ఎక్కువగా పండిస్తారు. ప్రభుత్వం ప్రకటించిన 23 మద్దతు ధరల పంటల జాబితాలో ఈ రెండు పంటలున్నాయి. కనీస మద్దతు ధరకు హామీ లేకపోవడం వల్ల వరి, గోధుమ రైతులు ఎక్కువగా నష్టపోతారు. పంజాబ్ లో చాలా మంది రైతులు సంపన్నులు. రాజకీయాలను ప్రభావితం చేసే శక్తి అక్కడి రైతులకు ఉంది. అఅకాలీదళ్ కు సంపన్న జాట్ సిక్కు రైతుల మద్దతు ఉంది. సాగు చట్టాలకు వ్యతిరేకంగా అకాలీదళ్ కేంద్ర మంత్రివర్గం నుంచి వైదొలగింది.

 

 

 

భాజపాతో పొత్తునూ వదలుకుంది. కాంగ్రెస్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ కూడా పరోక్షంగా రాజకీయ కారణాలతో ఉద్యమానికి మద్దతు పలుకుతున్నారు.అన్నింటికీ మించి విదేశాల్లో ఉన్న సిక్కులు అక్కడి ప్రభుత్వాల ద్వారా భారత్ పై ఒత్తిడి తెస్తున్నారు. కెనడా లో పెద్దసంఖ్యలో స్థిరపడిన సిక్కులు అక్కడి ప్రధాని జస్టిన్ ట్రూడో ద్వారా భారత్ పై ఒత్తిడి తెచ్చారు. ఆయన కూడా అనాలోచితంగా మాట్లాడారు. కెనడాలో లో 17 మంది సిక్కు ఎంపీలున్నారు. నలుగురు సిక్క మంత్రులున్నారు. భారత్ లో కూడా ఇంతమంది సిక్కు ఎంపీలు, మంత్రులు లేరు. బ్రిటన్, ఆస్రేలియాల్లోని సిక్కులు కూడా అక్కడి రాయబార కార్యాలయాల ద్వారా ఒత్తిడి తెస్తున్నారు. రెండువైపులా కొంతమందికి ఉద్యమానికి ఖలిస్థాన్ రంగు పులుముతున్నారు. సుప్రీంకోర్టు నియమించిన కమిటీతో చర్చించబోమని కొంతమంది రైతునేతలు ప్రకటిస్తున్నారు. ఈ పరిణామాలు ఎంత మాత్రం వాంఛనీయం కావు. ఇవి సమస్యను పక్కదోవ పట్టిస్తాయి.

 

 

యావత్ జాతి అన్నదాతలకు అండగా ఉంది. వారి సమస్యలు పరిష్కారం కావాలని మనసావాచా కర్మణా కోరుకుంటోంది. ఇది నిజం కావాలంటే ఇరు పక్షాలూ చెరో మెట్టుదిగాలి.ఢిల్లీలో  జరిగిన సంఘటనలు దురదృష్టకరం. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రైతులు ఎర్రకోటపై జెండా ఎగురవేశారు. ఢిల్లీపై దండెత్తారు. ఒకరు మరణించారు. ప్రభుత్వ నిబందనలను పక్కన పెట్టి, ఢిల్లీ నగరంలోకి చొచ్చుకురావడంతోనే ఈ పరిస్థితి ఏర్పడింది. అధికారపక్షం రైతు ఉద్యమంపై చేస్తున్న విమర్శలకు రైతులు ఈ ఘటనలతో తావిచ్చినట్లయింది. ఇప్పటికైనా సంయమనంతో వ్యవహరించి తమ డిమాండ్లను పరిష్కరించుకుంటేనే మంచిది.

విశిష్ట సేవలందించిన ఎంవిఐ సుబ్రమణ్యంకు కలెక్టర్‌ చే ప్రశంసాపత్రం

Tags:It would be nice if someone could point the finger

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *