ఇలా అయితే కష్టం

Date:14/09/2018
నిజామాబాద్ ముచ్చట్లు:
జడ్పీ, మండల పరిషత్‌ కార్యాలయాలకు నిధులు సక్రమంగా విడుదల  కావడం లేదు. గడిచిన నాలుగేళ్ల కాలంలో అరకొరగానే వచ్చాయి. నిధులు లేని కారణంగా కార్యాలయాల నిర్వహణ భారం కాగా, పలు అభివృద్ధి పనులకు ఆటంకం కలుగుతోంది. జిల్లాలో 27 మండలాలు, 19 మండల పరిషత్‌ కార్యాలయాలు..కామారెడ్డి జిల్లాలో 22 మండలాలు, 17 మండల పరిషత్‌ కార్యాలయాలు ఉన్నాయి. ఏటా నిర్వహణ కోసం తలసరి పద్దు, సీనరేజీ, ఎస్‌ఎఫ్‌సీ ద్వారా నిధులు కేటాయించాల్సి ఉంది. ఈ నిధులు నేరుగా జిల్లాపరిషత్‌ కార్యాలయానికి పంపితే..అక్కడి అధికారులు జనాభా ప్రాతిపదికన మండల పరిషత్‌ కార్యాలయాలకు పంపిస్తుంటారు.
ఏటా మూడు విడతల్లో అంటే నాలుగు నెలలకు ఒకసారి నిధులు విడుదల చేయాల్సి ఉంది. కానీ అరకొరగానే విడుదల చేస్తున్నారు. తలసరి పద్దు, సీనరేజీ కింద ఏటా రూ.80 లక్షలు, ఎస్‌ఎఫ్‌సీ కింద రూ.40 లక్షల వరకు మొత్తం రెండు జిల్లాలకు రూ.1.20 కోట్లు రావల్సి ఉంది. గత నాలుగేళ్లుగా ఏటా సగం నిధులు కూడా విడుదల చేయడం లేదు. మూడు విడతల్లో అందించాల్సి ఉంటే.. ఆర్థిక సంవత్సరం చివరన ఒక విడతలో కొంత మొత్తం  ఇచ్చి మమ అనిపిస్తున్నారు.
మండల పరిషత్‌కు వచ్చే సాధారణ పద్దు నిధుల్లో 35 శాతం అభివృద్ధి పనులకు ఖర్చు చేయాలి. 9 శాతం నీటి నిర్వహణకు, 15 శాతం ఎస్సీ కాలనీల్లో పనులు, 6 శాతం ఎస్టీలకు, 16 శాతం మండల పరిషత్‌ కార్యాలయ నిర్వహణకు, 15 శాతం మహిళా శిశు సంక్షేమం, 4 శాతం విపత్తు సంభవిస్తే ఖర్చు చేసుకునే వీలుంది. పూర్తి మొత్తంలో నిధులు రాక పోవడంతో వచ్చిన కొద్దిపాటి మొత్తాన్ని దేనికి ఖర్చు చేయాలో తెలియని పరిస్థితి కొనసాగుతోంది. కేంద్రం నుంచి ఏటా 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.5 కోట్లు వచ్చేవి. వీటిని ఇది వరకు మండల పరిషత్‌ కార్యాలయాలకు కేటాయించే వారు. అక్కడ భాజపా సర్కార్‌ అధికారంలోకి వచ్చాక మండల పరిషత్‌లకు కేటాయించడం నిలిపివేసి నేరుగా పంచాయతీలకు పంపిస్తున్నారు. దీంతో మండల పరిషత్‌, జిల్లా పరిషత్‌లో పాలన నిర్వీర్యమైంది.
నిధులు రాకపోవడంతో మండల పరిషత్‌ కార్యాలయాల నిర్వహణ భారంగా మారింది. కార్యాలయ ఆవరణను శుభ్రం చేసేందుకు తాత్కాలింగా ఏర్పాటు చేసుకున్న స్వీపర్లకు సైతం జీతాలు ఇవ్వలేని దుస్థితి నెలకొంది. ఒకో కార్యాలయానికి ఇప్పటి వరకు రూ.2 లక్షల వరకు రావల్సి ఉంది. కరెంటు బిల్లులు చెల్లించకపోవడంతో ట్రాన్స్‌కో అధికారులు  విద్యుత్తు సరఫరా నిలిపివేస్తామని హెచ్చరిస్తున్నారు. వారికి రోజూ బుజ్జగించాల్సిన పరిస్థితి అధికారులను వేదనకు గురిచేస్తోంది. టెలిఫోన్‌లు మూగబోయి, అంతర్జాల సౌకర్యం లేక పోవడంతో కొన్ని కార్యాలయాల్లో ఉద్యోగులు తమ చరవాణిలను ఉపయోగించి పని చేసుకొంటున్నారు. పేపర్‌ బిల్లులు, స్టేషనరీ కొనుగోలు కోసం ఎంపీడీవో, ఈవోపీఆర్డీలు వారి సొంత డబ్బులను ఖర్చు చేసుకొంటున్నారు. అభివృద్ధి పనులకు నిధులు లేక ప్రజాప్రతినిధులు గ్రామాల్లోకి తిరిగే పరిస్థితి లేకుండా పోయింది.
Tags:It’s hard though

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *