Natyam ad

మండలి ఎన్నికలకు వేళాయెరా

విజయవాడ ముచ్చట్లు:

ఆంధ్రప్రదేశ్‌లోని కడప-కర్నూలు-అనంతపురం, చిత్తూరు-నెల్లూరు-ప్రకాశం, విశాఖపట్నం-విజయనగరం-శ్రీకాకుళం జిల్లాల గ్రాడ్యుయేట్, ఉపాధ్యాయ నియోజకవర్గాలకు చెందిన ఐదుగురు ఎమ్మెల్సీల పదవీకాలం 2023 మార్చి 29న ముగియనుంది. గ్రాడ్యుయేట్ నియోజకవర్గాల నుంచి పశ్చిమ రాయలసీమకు చెందిన వెన్నుపూస గోపాల్‌రెడ్డి, తూర్పు రాయలసీమకు చెందిన యండపల్లి శ్రీనివాస రెడ్డి, ఉత్తరాంధ్ర నుంచి పీవీఎన్ మాధవ్, ఉపాధ్యాయ నియోజకవర్గాల నుంచి పశ్చిమ రాయలసీమకు చెందిన కత్తి నరసింహారెడ్డి, తూర్పు రాయలసీమకు చెందిన విఠపు బాలసుబ్రహ్మణ్యం పదవీ విరమణ చేయనున్నారు. వెన్నుపూస గోపాల్‌రెడ్డి వై‌ఎస్ఆర్ సీపీ నుంచి, పీవీఎన్ మాధవ్ బీజేపీ నుంచి, కత్తి నరసింహా‌రెడ్డి ఇండిపెండెంట్‌గా, యండవల్లి శ్రీనివాస‌రెడ్డి, విఠపు బాలసుబ్రహ్మణ్యం ప్రోగ్రెసివ్ డెమొక్రిటిక్ ఫ్రంట్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ నియోజకవర్గాలలో ఎన్నికల ప్రక్రియను కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే చేపట్టింది.ఓటర్ల నమోదు కొనసాగుతోంది.శాసనసభకు జరగబోయే సాధారణ ఎన్నికలకు 18 నెలల సమయం మాత్రమే ఉంది. అందువలన మండలి ఎన్నికలు అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి.పట్టభద్రుల స్థానాలకు వై‌ఎస్ఆర్ సీపీ, టీడీపీ ఇప్పటికే తమ అభ్యర్థులను ప్రకటించాయి. ఈ ఎన్నికలలో అత్యధిక మెజారిటీతో గెలుపొంది తమ ప్రాభవం ఇంకా పెరిగిందననే విషయాన్ని నిరూపించుకోవాలని వై‌ఎస్ఆర్ సీపీ ఉవ్విళ్లూరుతోంది. టీడీపీ కూడా ఈ ఎన్నికలలో ఎలాగైనా గెలిచి పూర్వ వైభవం పొందేందుకు సర్వశక్తులు ఒడ్డుతోంది. ఉపాధ్యాయ నియోజకవర్గాల నుంచి సహజంగా వామపక్ష పార్టీల మద్దతు ఉన్న ప్రోగ్రెసివ్ డెమొక్రటిక్ ఫ్రంట్ అభ్యర్థులు లేదా ఇండిపెండెంట్ అభ్యర్థులు విజయం సాధిస్తుంటారు.

 

 

 

Post Midle

ఈసారి మాత్రం తాము మద్దతు ఇచ్చే అభ్యర్థులను గెలిపించుకోవాలని ప్రధాన రాజకీయ పార్టీలు పావులు కదుపుతున్నాయి.పట్టభద్రుల నియోజకవర్గాలలో పశ్చిమ రాయలసీమ నుంచి వై‌ఎస్ఆర్ సీపీ తరపున సిట్టింగ్ ఎమ్మెల్సీ వెన్నుపూస గోపాల్‌రెడ్డి తనయుడు వెన్నుపూస రవీంద్ర రెడ్డి, టీడీపీ నుంచి భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్జి, తూర్పు రాయలసీమ నుంచి వై‌ఎస్ఆర్ సీపీ తరపున గూడూరు పట్టణానికి చెందిన శ్యామ్‌ప్రసాద్ రెడ్డి, టీడీపీ తరపున కంచర్ల శ్రీకాంత్, ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి వై‌ఎస్ఆర్ సీపీ తరపున బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ ఎస్. సుధాకర్, టీడీపీ తరపున గాడు చిన్ని కుమారి లక్ష్మి బరిలోకి దిగనున్నారు. తమ అభ్యర్థులను త్వరలో ప్రకటిస్తామంది బీజేపీ. జనసేన మాత్రం మౌనంగా ఉంది. ప్రచారంలో టీడీపీ ముందంజలో ఉంది. ఓటర్ల నమోదు ప్రక్రియకు మునుపే టీడీపీ అభ్యర్థులు నియోజక వర్గాలలో విస్తృతంగా పర్యటించారు. పశ్చిమ రాయలసీమ టీడీపీ అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి విన్నూత ప్రచారానికి శ్రీకారం చుట్టారు. నియోజకవర్గంలోని మూడు జిల్లాల టీడీపీ ప్రజాప్రతినిధులు, ఇన్‌చార్జుల సహకారంతో పట్టభద్రులతో సమావేశమవుతున్నారు.నవంబర్ ఏడు లోగా ఓటర్లుగా నమోదు చేసుకుని తనను గెలిపించాలని కోరుతున్నారు. ఇదే పంథాను టీడీపీ మిగతా అభ్యర్థులు కూడా అనుసరిస్తున్నారు. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పాలనపై యువత, ఉద్యోగులు, ఉఫాధ్యాయులలో తీవ్ర అసంతృప్తి నెలకొని ఉందని, అందుకే తమ విజయం ‘నల్లేరు మీద నడకే’ అని వారు నమ్ముతున్నారు. 2024లో తమదే అధికారం

 

 

 

 

అనే భావనతో టీడీపీ ప్రజాప్రతినిధులు, ఇన్‌చార్జులు వీరికి సహకరిస్తున్నారు. అదే సమయంలో యువతను ఆకర్షించే నాయకత్వం లేకపోవడం, అధికార పార్టీ అభ్యర్థులను ఢీకొనే అర్థ బలం లేకపోవడం టీడీపీ బలహీనత అని చెప్పవచ్చు. వీరి గెలుపు ప్రభుత్వ వ్యతిరేకత ఓటు పైనే ఆధారపడి ఉంది.ఓటర్ల నమోదు మీద బీజేపీ కూడా దృష్టి సారించింది. ప్రస్తుత పరిస్థితులలో ఇక్కడ బీజేపీ ప్రభావం నామమాత్రంగా కూడా ఉండదనేది నిర్వివాదాంశం. జనసేనతో కలిసి పోటీ చేస్తే కొద్దిగా ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. కానీ, జనసేన వ్యూహం అంతుచిక్కడం లేదు. పార్టీ అధిష్టానం ఈ ఎన్నికల గురించి మాట్లాడిన సందర్భం కూడా లేదు. పశ్చిమ రాయలసీమకు చెందిన మాజీ మంత్రి పసుపులేటి బ్రహ్మయ్య మేనల్లుడు, జనసేన రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర, తూర్పు రాయలసీమకు చెందిన తిరుపతి జనసేన ఇన్‌చార్జీ కిరణ్ రాయల్, జనసేన అధికార ప్రతినిధి రాయపాటి అరుణ, ఉత్తరాంధ్రకు చెందిన భీమిలి ఇన్‌చార్జి పంచకర్ల సందీప్, రాష్ట్ర పార్టీ వైద్య సంఘం అధ్యక్షుడు డాక్టర్ బొడ్డేపల్లి రఘు లాంటి సమర్థ యువకులు జనసేనలో అనేక మంది ఉన్నారు. అయినా, పట్టభద్రుల ఎన్నిక పట్ల జనసేన నోరు తెరవకపోవడం ఆశ్చర్యకరం. ఈ ఎన్నికలలో పోటీ చేయకుంటే పవన్ అనేక విమర్శలు ఎదుర్కోవలసి రావచ్చుతొమ్మిది జిల్లాల పరిధిలో జరగబోయే శాసనమండలి ఎన్నికలు అధికార వై‌ఎస్ఆర్ సీపీకి జీవన్మరణ సమస్య.

 

 

 

 

మూడున్నర సంవత్సరాల జగన్ పాలనకు, ముఖ్యమంత్రి తీసుకుంటున్న మూడు రాజధానుల లాంటి నిర్ణయాలకు ఈ ఎన్నికలు రెఫరెండంగా భావింపవచ్చు. 2019లో 151 సీట్లు సాధించడంలో యువత, ఉపాధ్యాయులు, ఉద్యోగులు ముఖ్య పాత్ర వహించారు. ప్రస్తుతం ఆ మూడు వర్గాలలోనే జగన్ పాలనపై తీవ్ర వ్యతిరేక ఉందని అంటున్నారు. పూర్వ ఎన్‌జీఓ నేత, సిట్టింగ్ ఎమ్మెల్సీ వెన్నుపూస గోపాల్‌రెడ్డిపై కూడా అసంతృప్తి అధికంగా ఉంది. గోపాల్‌రెడ్డి కుమారుడు రవీంద్రారెడ్డికే వై‌ఎస్ఆర్ సీపీ టికెట్ కేటాయించిందిరాజధానుల అంశం ఈ ఎన్నికలలో ఏ విధంగా ప్రభావం చూపుతుందో తెలియదు. ఇటువంటి ప్రతికూల పరిణామాల మధ్య వై‌ఎస్ఆర్ సీపీకి ఈ ఎన్నికలు ‘కత్తిమీద సాముగా’ మారాయి. ఆ పార్టీకున్న అధికార, అర్థ, అంగ బలాలతో వాటిని అధిగమించడం కష్టం కాకపోవచ్చు. టీడీపీ ప్రభుత్వం హయాంలో కడప స్థానిక సంస్థల శాసన మండలి ఎన్నికలలో నామమాత్రపు బలం కూడా లేని బీటెక్ రవి గెలిచిన వైనమే దీనికి నిదర్శనంగా చెప్పవచ్చు. పట్టభద్రులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, మేధావులు ఈ ఎన్నికలలో స్పందించే తీరే 2024 సాధారణ ఎన్నికలలో పునరావృతం అవుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు.

 

Tags: It’s time for council elections

Post Midle

Leave A Reply

Your email address will not be published.