జగనన్న తోడు – చిరు వ్యాపారుల ఉపాధికి ఊతం
అమరావతి ముచ్చట్లు:
గత ఆరునెలలకు సంబంధించి సకాలంలో రుణాలు చెల్లించిన వారికి రూ.15.96 కోట్ల వడ్డీ రీయింబర్స్మెంట్ను కూడా సీఎం వైయస్.జగన్ మోహన్ రెడ్డి బుధవారం కంప్యూటర్లో బటన్ నొక్కి విడుదలచేసారు.
ఈ సందర్భంగా సీఎం వైయస్.జగన్ మాట్లాడుతూ
దేవుడి దయతో ఈరోజు మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. దాదాపు 15,03,558 మంది కుటుంబాలకు ఈ పథకం ద్వారా మంచి చేస్తున్నాం. ఈరోజు 3.95 లక్షల మంది చిరు వ్యాపారులకు ఒక్కొక్కరికి రూ.10వేలు చొప్పున రూ.395 కోట్లతో వారికి తోడ్పాడు ఇస్తున్నాం. మొత్తంగా 15,03,558 కుటుంబాలకు రూ.2011 కోట్లతో స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తూ, వారు ఇంకొకరిమీద ఆధాపడే పరిస్థితి లేకుండా, వారి కాళ్లమీద వారు నిలబడి, వారి బ్రతుకు వారు బ్రతికేందుకు అవసరమైన గొప్ప కార్యక్రమానికి చేయూతనిస్తున్నాం.
గొప్ప సేవలందించే వర్గం – చిరువ్యాపారులు…
వీరు తమకు తాము ఉపాధి కల్పించుకోవడమే కాకుండా, మరికొంతమందికి కూడా కొద్దోగొప్పో ఏదో రూపంలో ఉపాధినిస్తున్నారు. నామమాత్రపు లాభాలనే సంతోషంగా తీసుకుంటూ… సేవలందించే గొప్ప వర్గం చిరు వ్యాపారులు. నిజానికి ఈ అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మలు చేసేది వ్యాపారం అనేదాని కన్నా గొప్ప సేవ అనడంలో ఏమాత్రం సంకోచం లేదని అన్నారు.

వీరి బాధలు నా కళ్లారా చూశాను…
ఇలాంటి చిరువ్యాపారులతో పాటు సాంప్రదాయ చేతివృత్తుల వారు తమకు బ్యాంకుల నుంచి రుణాలు రాక, వడ్డీ వ్యాపారుల మీద ఆధారపడి అధిక వడ్డీలు, చక్రవడ్డీలు కట్టలేక వీరు పడుతున్న బాధలు నా పాదయాత్రలో నా కళ్లారా చూశాను.
వీళ్లు వడ్డీ వ్యాపారులకు కట్టాల్సిన వడ్డీయే చాలా సందర్భాలలో వేయి రూపాయలకు వంద రూపాయలు కట్టాల్సిన పరిస్థితి. ఉదయాన్నే రూ.1000 ఇస్తే సరుకులు తీసుకుని అవి అమ్ముకుని రూ.100 వీరికి లాభం ఇవ్వాల్సిన పరిస్ధితి. దాదాపు రూ.100కు రూ.10 వడ్డీ కట్టుకోవాల్సిన పరిస్థితి. ఇటువంటి నడ్డి వరిచే ఈ వడ్డీల భారి నుంచి వీరిని తప్పించి, లక్షల కుటంబాలకు అండగా ఉండాలి, ఉంటేనే వీరి జీవితాలు బాగుపడతాయని నా పాదయాత్ర సందర్భంగా నేను చెప్పిన మాటలు నాకు బాగా గుర్తున్నాయని అన్నారు.
చెప్పిన మాటకు కట్టుబడే– జగనన్న తోడు.
చెప్పిన మాటకు కట్టుబడి జగనన్న తోడు అన్న ఈ పథకాన్ని ప్రారంభించి ఇప్పటికే రెండు సంవత్సరాలు గడిచింది. ఈ పథకం ద్వారా నిరుపేదలైన చిరువ్యాపారులు, హస్త కళాకారులు, సాంప్రదాయ చేతివృత్తుల వారిని వారి కాళ్లమీద వాళ్లని నిలబెట్టేలా ఒక్కొక్కరికి రూ.10వేలు చొప్పున వడ్డీలేని రుణం అందిస్తున్నాం. దీని వల్ల రాష్ట్రంలో నా ప్రతి అక్కచెల్లెమ్మకు,అన్నదమ్ములకు ప్రయోజనం కలిగేలా మంచి చేస్తున్నాం.
జగనన్న తోడు – ఇప్పటివరకు రూ.2011 కోట్లు సాయం.
జగనన్న తోడు కార్యక్రమం ద్వారా మరోసారి 3.95 లక్షల మంది చిరువ్యాపారులకు ఒక్కొక్కరికి రూ.10వేలు చొప్పున రూ.395 కోట్ల సాయంతో కలిపితే… ఇప్పటివరకు 15,03,558 మంది కుటుంబాలకు బ్యాంకుల ద్వారా అందించిన వడ్డీ లేని రుణాలు రూ.2011 కోట్లు.
దేశంలోనే అత్యధికంగా….
దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు… 34 లక్షల మందికి ఈ రకంగా తోడ్పాడు ఇచ్చే కార్యక్రమం చేస్తుంటే.. ఒక్క మన రాష్ట్రంలోనే అందులో సగభాగం 15.03 లక్షల మందికి బ్యాంకుల సహకారంతో మంచి చేయగలిగాం. ఇందుకు సహకరించిన ప్రతి బ్యాంకుకు, తోడ్పాటు అందించిన ప్రతి అధికారికీ కృతజ్ఞతలని అన్నారు.
ఈ 15.03 లక్షల మందిలో సకాలంలో చెల్లించి రెండోసారి కూడా రుణం తీసుకున్నవారు 5.08 లక్షల మంది. సకాలంలో వారు రుణాలు చెల్లిస్తే వడ్డీ పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం వారికి తిరిగి ఇవ్వడమే కాకుండా… వారికి మరలా బ్యాంకులు కూడా రుణాలు మంజూరు చేస్తాయి. ఇలా సకాలంలో బ్యాంకులకు చెల్లించినవారికి వారు కట్టిన వడ్డీ మొత్తాన్ని ప్రతి 6 నెలలకొకమారు మన ప్రభుత్వంæ నేరుగా లబ్దిదారుల ఖాతాలకు జమ చేస్తుంది. ఈ రుణం తీరిన తర్వాత లబ్ధిదారులు మరలా వడ్డీలేని రుణం పొందడానికి అర్హులు. వాళ్లకి బ్యాంకులు కూడా మరలా వడ్డీలేనిరుణాలు ఇస్తాయి. ఇలా రుణం పొందేటప్పుడు రుణం మొత్తాన్ని ప్రతి విడతకూ రూ.వేయి చొప్పున పెంచేదిశగా బ్యాంకులతో మాట్లాడుతున్నాను. దానివల్ల చిరువ్యాపారులకు క్రెడిట్ రేటింగ్ పదిశాతం పెరుగుతుందని అన్నారు.
Tags: Jagananna Todu – A boost to the employment of small traders
