మోహినీ అలంకారంలో జగన్మోహనుడు

Date:17/04/2019
ఒంటిమిట్ట ముచ్చట్లు :

ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు బుధ‌వారం ఉదయం మోహినీ అలంకారంలో రాములవారు జగన్మోహనాకారుడిగా దర్శనమిచ్చారు. ఉదయం 8 నుండి 10 గంటల వరకు స్వామివారి ఊరేగింపు వైభవంగా జరిగింది. భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఊరేగింపు కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

Jaganmohan in Mohini decoration
 

మోహినీ అవతార వృత్తాంతం భాగవతంలో రమణీయంగా వర్ణింపబడింది. దేవతలు, రాక్షసులు అమృతం కోసం క్షీరసాగరాన్ని మథిస్తారు. చివరికి వారు కోరుకున్న అమృతం లభిస్తుంది. దానిని పంచుకోవడంలో కలహం ఏర్పడుతుంది. ఆ కలహాన్ని నివారించి, దేవతలకు అమృతాన్ని పంచడానికి శ్రీహరి మోహినీ రూపంతో సాక్షాత్కరిస్తాడు. తనకు భక్తులు కానివారు ఆ మాయాధీసులు కాక తప్పదనీ, తనకు ప్రసన్నులైనవారు మాయను సులభంగా దాటగలరనీ ఈ మోహినీ రూపంలో రాములవారు ప్రకటిస్తున్నాడు.

 

 

 

 

 

 

అనంతరం ఉదయం 11 నుండి 12 గంటల వరకు ఆలయంలో స్నపనతిరుమంజనం వేడుకగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనంతో స్వామి, అమ్మవారికి వేడుకగా అభిషేకం చేశారు. సాయంత్రం 5.00 గంటల నుండి 6.00 గంటల వరకు ఊంజల్‌సేవ వైభవంగా జరగనుంది.

గరుడసేవ :

శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు బుధ‌వారం రాత్రి 8 నుండి 9.30 గంటల వరకు గరుడ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. గరుత్మంతుడు శ్రీమహావిష్ణువుకు నిత్యవాహనం. దాసుడుగా, సఖుడుగా, విసనకఱ్ఱగా, చాందినిగా, ఆసనంగా, ఆవాసంగా, వాహనంగా ధ్వజంగా అనేక విధాల సేవలందిస్తున్న నిత్యసూరులలో అగ్రగణ్యుడైన వైనతేయుడు కోదండరామస్వామిని వహించి కదిలే తీరు సందర్శనీయమైనది. 108 దివ్య దేశాలలోనూ గరుడ సేవ విశిష్టమైనది.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో  నటేష్‌బాబు, ఏఈవో రామరాజు, ఇతర అధికార ప్రముఖులు, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

భక్తిభావాన్ని పంచిన ధార్మిక కార్యక్రమాలు

ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన బుధ‌వారం టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన ధార్మిక, సంగీత కార్యక్రమాలు భక్తిభావాన్ని పంచాయి.

 

 

 

 

 

 

 

ఉదయం 7 నుంచి 8 గంటల వరకు ఎస్వీ సంగీత, నృత్య కళాశాల ఆధ్వర్యంలో మంగళధ్వని, ఉదయం 10 నుంచి 11 గంటల వరకు శ్రీ స్వామి విర‌జానంద రూపుదిద్దుకున్న‌ ధ‌ర్మ‌మే రాముడు అనే అంశంపై ధార్మికోపన్యాసం చేశారు. సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు ఊంజల్‌సేవలో క‌డ‌ప‌కు చెందిన ఎల్‌.వాణిశ్రీ‌  బృందం భక్తి సంకీర్తనలు ఆలపించనున్నారు. రాత్రి 7 నుండి 8 గంటల వరకు  వ‌ర‌ల‌క్ష్మీ భాగవతార్‌ హరికథ వినిపిస్తారు.

శ్రీవారి అలిపిరి టోల్ గేట్ వివరాలు

Tags:Jaganmohan in Mohini decoration

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *