రెంటికి చెడ్డ రేవడిలా జగన్ పార్టీ

Date:20/02/2018
హైద్రాబాద్ ముచ్చట్లు:
జగన్మోహన్ రెడ్డి కోటరీ ఇప్పుడు కుతకుత ఉడికిపోతోంది. పవన్ కల్యాణ్ అలా ఆలోచన అందించాడో లేదో.. దాన్ని అందుకుని ‘అవిశ్వాసానికి’ రెడీ అంటూ తమ ప్రత్యర్థులు సాహసించలేని పనికి తాము పూనుకున్నట్లు ఆ రకంగా తాము బ్రహ్మాస్త్రం వేసేసినట్లు వారు మురిసిపోయారు. కానీ దాని వల్ల ఫలం దక్కేలా లేదు సరికదా.. ఇప్పుడు ప్రతి ఒక్క పార్టీ అదే అవిశ్వాసం పెట్టడానికి అనుకూలంగానే ఉండడం వీరికి ఇబ్బందిగా పరిణమించింది. మోడీ అంటే ఇన్నాళ్లూ ప్రదర్శించిన భక్తి.. అవిశ్వాసానికి రెడీ అనడంతోటే.. మంటగలిసిపోయింది. తీరా ఇప్పుడు అవిశ్వాసం తామే కేంద్రబిందువుగా జరిగే అవకాశం లేదు.. అని వారంతా మధనపడిపోతున్నారట. కేంద్రప్రభుత్వంలో భాగస్వామి గనుక.. చంద్రబాబునాయుడు ఎటూ అవిశ్వాసం జోలికి రారు కదా.. కావాలిస్తే మేం పెట్టగలం.. కానీ మాకు బలం లేదు.. తెదేపాను మీరు ఒప్పిస్తారా.. అంటూ ప్రతిపాదించిన పవన్ కల్యాణ్ ముందరి కాళ్లకు బంధం వేయచ్చునని జగన్ తలపోశారు. అయితే అది బెడిసింది. ఎంత దారుణంగా బెడిసికొట్టిందంటే.. పవన్ కల్యాణ్ తెదేపా ను ఒప్పించినా కూడా.. మీ ఇద్దరి బలం చాలదు.. బలం సంగతి నాకు వదిలేయండి.. అవసరాన్ని మించి మద్దతు కూడగడతా! ముందు మీరు అవిశ్వాసం ప్రతిపాదించండి.. అంటూ ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. అప్పటికి గానీ.. జగన్ కు తాము అత్యుత్సాహానికి పోయి ఈ చట్రంలో ఎంతగా ఇరుక్కుపోయామో అర్థం కాలేదు. పైగా తాము ఆశించినట్టుగా క్రెడిట్ తామొక్కరికీ దక్కే అవకాశం కూడా పోయింది. ఇటువైపు చంద్రబాబునాయుడు కూడా.. అన్ని ప్రయత్నాలు చేసి ఆఖరి అవకాశం కింద అవిశ్వాసం పెట్టడానికి రెడీ.. అన్ని పార్టీల మద్దతు కూడా తీసుకుంటాం.. అని అనేశారు. అటువైపు రాహుల్ గాంధీ కూడా కాంగ్రెస్ తరఫునే అవిశ్వాసం పెట్టడానికి ఓకే చెప్పేసినట్లు పీసీసీ చీఫ్ రఘువీరా అంటున్నారు. అందరూ బరిలోకి వచ్చేశాక.. ఇక తన ఘనత ఏముంటుంది. అయ్యో ఇన్నాళ్లూ చేసిన మోడీ వ్రతం మంటగలిసిపోయిందే అని జగన్ కోటరీ మల్లగుల్లాలు పడుతున్నారట. జగన్ దళం.. తొలినుంచి డాంబికంగా మాట చెప్పేయడం.. ఆ తర్వాత దాని ద్వారా రాగల ప్రయోజనం మంటగలిసిపోయేదాకా దాన్ని గురించి పట్టించుకోకుండా ఉండడం ఇదే వ్యూహాన్ని పాటిస్తోంది. ఎంపీల రాజీనామాలు అంటూ రెండేళ్ల కిందట ప్రకటించి.. ఇప్పుడు నిష్ప్రయోజనమైన సమయంలో వాటికి సిద్ధపడడమే నిదర్శనం అని పలువురు అంటున్నారు.
Tags: Jagan’s party as a bad repatriate for both

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *