యువనాయకులకు జై కొడతారా

Date:04/04/2019
నెల్లూరు ముచ్చట్లు:
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అభ్యర్థుల ఎంపికలో ముందుచూపుతో వ్యవహరించినట్లు కన్పిస్తుంది. వచ్చే ఎన్నికల్లో గెలిచినా, ఓడినా రానున్న ఐదేళ్లలో పార్టీలో యువనేత నారా లోకేష్ నాయకత్వం మరింత బలోపేతం చేయాలన్నది ఆయన ఉద్దేశ్యంగా కన్పిస్తోంది. టీడీపీ వచ్చే ఎన్నికల్లో గెలిస్తే కొద్ది రోజుల పాటు తాను ముఖ్యమంత్రిగా ఉండి తర్వాత జాతీయరాజకీయాల్లోకి వెళ్దామన్నది ఆయన ఆలోచనగా తెలుస్తోంది. అందుకే తనకు నమ్మకమైన నేతలతో పాటు యువ నాయకులకు అవకాశం కల్పించారంటున్నారు.అందుకే సీనియర్ నేతలు కొందరు కోరినట్లుగా, మరికొందరు అడగకపోయినా వారి వారసులకే అవకాశం కల్పించారు. యువకులయితే ఎమ్మెల్యేగా గెలిచినా పార్టీకి అండగా ఉంటారని, లోకేష్ నాయకత్వంతో పనిచేసేందుకు సుముఖంగా ఉంటారన్నది ఆయన దూరాలోచనగా పార్టీ వర్గాలే చెబుతున్నాయి. కొందరు సీనియర్ నేతలు తమంతట తామే స్వచ్ఛందంగా రాజకీయాల నుంచి తప్పుకోగా, మరికొందరికి మాత్రం వారి మీద ఉన్న వ్యతిరేకతతో వారి వారసులకు టిక్కెట్లు కేటాయించారు. ఇదే ఇప్పుడు ఈ పార్టీలో హాట్ టాపిక్ గా మారింది మొత్తం 125 మంది సిట్టింగ్ లకు టిక్కెట్ దక్కింది. మిగిలిన 73 మంది అభ్యర్థుల్లో కొత్తవారు, పాత వారు ఉన్నారు.
ఈ అసెంబ్లీ ఎన్నికల్లో యువకుల ఉత్సాహమే టీడీపీలో ఎక్కువగా కన్పిస్తుంది. ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి కుమారుడు కేఈ శ్యాంబాబు కు పత్తికొండ స్థానాన్ని కేటాయించారు. అలాగే మంత్రి పరిటాల సునీత కుమారుడు పరిటాల శ్రీరామ్ కు రాప్తాడు నియోజకవర్గాన్ని చంద్రబాబు ఇచ్చారు. పరిటాల పోటీకి విముఖత చేయడంతోనే శ్రీరామ్ కు టిక్కెట్ ఇచ్చారు. ఇక శ్రీకాళహస్తిలో సీనియర్ నేత, మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డికి టిక్కెట్ ఇచ్చారు.ఇక సీనియర్ నేత గౌతు శ్యాంసుందర శివాజీ పోటీ నుంచి తప్పుకోవడంతో ఆయన కుమార్తె గౌతు శిరీషకు పలాస టిక్కెట్ ను ఖరారు చేశారు. విజయనగరం జిల్లాలో మాజీ మంత్రి కిమిడి మృణాళినిపై తీవ్ర అసంతృప్తులు చెలరేగడంతో ఆమె కుమారుడు కిమిడి నాగార్జునను అభ్యర్థిగా ఎంపిక చేశారు. ఇక అరకు నియోజకవర్గానికి ప్రస్తుత మంత్రి కిడారి శ్రావణ్ కు ఇచ్చారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో జలీల్ ఖాన్ కూతురు షబానా ఖాతూన్ కు ఆయన కోరిక మేరకే ఇచ్చారు. ఇక నగరి నియోజకవర్గం చివర వరకూ ఉత్కంఠ రేపినా గాలి ముద్దు కృష్ణమనాయుడు కుమారుడు గాలి భాను ప్రకాష్ ను అభ్యర్థిగా నిర్ణయించారు. ఎర్రన్నాయుడు కుమార్తె భవానికి రాజమండ్రి అర్బన్ టిక్కెట్ ఇచ్చారు. దేవినేని నెహ్రూ కుమారుడు అవినాష్ ను గుడివాడ నుంచి పోటీ చేయమని ఆదేశించారు. ఇలా అనేక చోట్ల యువతరానికే చంద్రబాబు పెద్దపీట వేసినట్లు కన్పిస్తోంది. యువకులు ఎమ్మెల్యేగా ఎన్నికైనా అధికారంలోకి వచ్చినా మంత్రి పదవుల కోసం వెంపర్లాడదన్న ఆలోచన కూడా చంద్రబాబు ఎంపికకు ఒక కారణంగాచెబుతున్నారు.
Tags: Jai to the young people

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *