బిజెపి లోకి జానారెడ్డి ?

–  కేసీఆర్ కు మాస్టర్ స్ట్రోక్ ఇవ్వనున్న కమలనాథులు

Date:05/12/2020

హైదరాబాద్ ముచ్చట్లు:

;రాజకీయాల్లో కొన్ని అంశాలు ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి. జానారెడ్డిని పార్టీలోకి తీసుకొచ్చేందుకు కమలనాథులు సీరియస్ గా ప్రయత్నించటం.. అందుకు ఆయన కూడా సానుకూలంగా స్పందించినట్లుగా తెలుస్తోంది.అన్ని అనుకున్నట్లు జరిగితే.. కేసీఆర్ సార్ కు.. జానారెడ్డి రూపంలో బీజేపీ మాస్టర్ స్ట్రోక్ ఇచ్చినట్లు అవుతుందని చెప్పక తప్పదు. రాజకీయంగా తిరుగులేని నేతగా.. తెలంగాణలో శక్తివంతమైన అధినేతగా కేసీఆర్ మారారంటే కారణం.. ఎన్నికలు. ఇప్పుడు అవే ఎన్నికలు ఆయన్ను తెగ ఇబ్బంది పెడుతున్నాయి. మరింత లోతుల్లోకి వెళ్లాలంటే.. తెలంగాణ ఉద్యమానికి కొత్త ఊపిరిని ఇవ్వటంతో పాటు.. కేసీఆర్ కు పునర్జన్మను ఇచ్చింది ఏమైనా ఉన్నాయంటే.. ఉప ఎన్నికలే. ప్రత్యర్థులు చేసిన వ్యాఖ్యల్ని తనకు అనుకూలంగా మార్చుకొని.. సాహసోపేతమైన నిర్ణయాలతో ఉప ఎన్నిక జూదం ఆడిన కేసీఆర్.. ఎక్కడి నుంచి ఎక్కడవరకు వచ్చారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ ఎన్నికలైతే ఆయన్ను అధికారపక్ష నేతగా మార్చాయో.. ఇప్పుడు అవే ఎన్నికలు ఆయనకు పరీక్షగా మారాయి. ఒకటి తర్వాత ఒకటిగా ముంచుకొస్తున్న ఎన్నికల్ని చూస్తుంటే.. రానున్న రోజులు కేసీఆర్ కు అంత సానుకూలంగా ఉన్నట్లుగా కనిపించటం లేదనే చెప్పాలి.

 

 

గ్రేటర్ ఎన్నికల వేళలోనే.. పార్టీకి చెందిన సీనియర్ నేత నోముల నర్సయ్య అనారోగ్యంగా మరణించటం తెలిసిందే. గ్రేటర్ పరీక్ష నుంచి కేసీఆర్ ఎలా గట్టెక్కుతారో అన్న సందేహాలు ఉన్న వేళలోనే.. నాగార్జునసాగర్ రూపంలో మరో టాస్కు ఆయన ముందుకురావటం చూసినోళ్లకు.. ఏదో అపశకునం ధ్వనించింది. దుబ్బాక ఓటమి షాక్ నుంచి తేరుకోకముందే.. తనకు అలవాటైన దూకుడుతనంతో గ్రేటర్ ఎన్నికల్ని తెచ్చుకున్న కేసీఆర్ కు.. మళ్లీ ఇక్కడా ఎదురుదెబ్బే ఎదురైంది. మరో ఆర్నెల్ల లోపు మరో ఉప ఎన్నికకు ఆయన సిద్దం కావాల్సిన అవసరం వచ్చింది.
అయితే.. దుబ్బాక మాదిరి నాగార్జున సాగర్ సీన్ ఉండదని.. బీజేపీకి అక్కడ ఏ మాత్రం బలం లేదని.. ఎట్టి పరిస్థితుల్లో ఆ ఎన్నికల్లో ఆ పార్టీ చేయగలిగింది లేదన్న మాట వినిపించింది. రాజకీయంలో ఒకసారి పట్టు దొరికితే.. అవకాశాలు వాటంతట అవే వచ్చేస్తాయి. ఈ వాదనకు తగ్గట్లే.. తాజాగా చోటు చేసుకున్న పరిణామాల్ని చూస్తే.. టీఆర్ఎస్ కు బీజేపీ మాస్టర్ స్ట్రోక్ ఇవ్వనుందని చెప్పాలి. ఎందుకంటే.. కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డిని బీజేపీలోకి తీసుకెళ్లేందుకు కమలనాథులు ప్లాన్ చేస్తున్నట్లు చెబుతున్నారు.

 

 

సుదీర్ఘకాలంగా కాంగ్రెస్ లో కొనసాగుతున్న ఆయన..నాగార్జునసాగర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించేవారు. 2018లో జరిగిన ఎన్నికల్లో ఆయన అనూహ్యంగా ఓడిపోవటంతో కామ్ గా ఉంటున్నారు. ప్రస్తుతం కేరళలో ఉన్న ఆయనకు బీజేపీ టచ్ లోకి వెళ్లినట్లుగా చెబుతోంది. ఆయన ఉన్న కాంగ్రెస్ లో ఎలాంటి గుర్తింపు లేకపోవటం.. త్వరలో వెలువడే టీపీసీసీ అధ్యక్ష పదవిని రేవంత్ కు అప్పజెబుతున్న నేపథ్యంలో ఆయన ఆ పార్టీ నుంచి ఎగ్జిట్ కావటానికి అవకాశం ఉంది.
రేవంత్ తో దూరపు చుట్టం ఉన్నప్పటికి.. తనకొచ్చే రాజకీయ అవకాశాన్ని జానారెడ్డి లాంటి వారు వదులుకుంటారని చెప్పలేం. ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణలో కాంగ్రెస్ ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. ఇలాంటివేళ.. ఆ పార్టీని వేలాడటం ద్వారా వచ్చే ప్రయోజనం శూన్యం. వరుస విజయాలతో ఉరుకులు పరుగులు తీయటంతో పాటు.. కేంద్రంలో అధికారంలో ఉందన్న ఒక భరోసా.. గులాబీ బాస్ ను అంతో ఇంతో కట్టడి చేస్తుందన్న భరోసా ఉంటుంది. అందుకే.. జానారెడ్డికి బీజేపీలోకి వెళ్లటానికి ఎలాంటి అభ్యంతరాలు ఉండకపోవచ్చు. అదే సమయంలో.. జానారెడ్డిని పార్టీలోకి తీసుకురావటం ద్వారా.. పార్టీని మరింత బలోపేతం చేసుకోవటంతో పాటు.. పలువురు కాంగ్రెస్ నేతలకు బీజేపీ ద్వారాలు తెరిచినట్లు అవుతుందని చెబుతున్నారు.

పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటాం- మంత్రి పెద్దిరెడ్డి

Tags: Janareddy joins BJP?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *