ఒంటరి పోరులో జనసేన

విజయవాడ ముచ్చట్లు:


జనసేన ఒంటరిగా పోటీ చేయాల్సిన పరిస్థితి వస్తుందా? ఇటు టీడీపీ, అటు బీజేపీ పవన్ ను లెక్క చేయడం లేదా? అంటే అవుననే అనిపిస్తుంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ఇప్పుడు రాజకీయాల్లో ఏ పార్టీ లెక్క చేసే పరిస్థిితి లేదు. పటిష్టమైన ఓటు బ్యాంకు లేకుండా, క్షేత్రస్థాయిలో బలం, బలగం లేని జనసేనను కావలించుకుని ఏం చేసుకోవాలన్న స్థితికి పార్టీలు వచ్చాయి. బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు ఎల్లకాలం పనిచేయవని సీనియర్ నేతలు సయితం సూచిస్తున్నారు. పవన్ కల్యాణ్ తన బలం ఏంటో ఒకసారి చూసుకుంటే మంచిదన్న సూచనలు వినపడుతున్నాయి. బీజేపీకి ఏపీలో ఎటూ హోప్స్ లేవు. అది ఒంటిరిగా పోటీ చేసినా, జనసేనతో కలసి బరిలోకి దిగినా పెద్దగా ప్రభావం ఉండదు. ఆ సంగతి ఆ పార్టీలో కింది స్థాయి నాయకుడికి తెలుసు. అయితే జనసేనాని పవన్ కల్యాణ్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని ఆ పార్టీ నేతలు డిమాండ్ చేస్తూ వస్తున్నారు. రాష్ట్రానికి వచ్చిన బీజేపీ జాతీయ పార్టీ అధ్యక్షుడు నడ్డా దీనిపై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ కూడా చేశారు. కానీ నడ్డా రెండు మీటింగ్ లలో పాల్గొన్నప్పటికీ జనసేన గురించి, పవన్ ప్రస్తావన కాని తేలేదు. అసలు జనసేనతో పొత్తు ఉన్న విషయాన్ని బీజేపీ అగ్రనేతలు మర్చిపోయినట్లు వ్యవహరించడం ఇప్పుడు రాజకీయంగా చర్చకు దారితీసింది. జేపీ నడ్డా రెండు రోజుల పర్యటనలో పవన్ ను కనీసం ప్రశంసించలేదు. జనసేన గురించి మాట్లాడకపోవడాన్ని ఆ పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు.

 

 

బీజేపీ అధికారంలోకి వస్తుందని నడ్డా అన్నారే తప్పించి, బీజేపీ, జనసేన అధికారంలోకి వస్తుందని అనకపోవడాన్ని కూడా కొందరు ఈ సందర్భంగా ప్రస్తావనకు తీసుకువస్తున్నారు. బీజేపీ కనీసం తమ అధినేతను పట్టించుకోకపోవడాన్ని వారు సీరియస్ గా తీసుకుంటున్నారు. మరోవైపు తెలుగుదేశం పార్టీ కూడా జనసేన డిమాండ్లను సీరియస్ గా తీసుకోవడం లేదు. టీడీపీ తగ్గితే భవిష్యత్ ఉండదని వారికి తెలుసు. కాపు ఓటు బ్యాంకు మినహా పవన్ కు పెద్దగా బలం లేదని టీడీపీ భావిస్తుంది. అందుకే పవన్ ను లైట్ గా తీసుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం. తనంతట తానుగా పొత్తుకు వస్తే కొన్ని సీట్లు సర్దుబాటు చేస్తామని, ముఖ్యమంత్రి పదవి అంటే పొత్తు అవసరం లేదని చెప్పాలని నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. మహానాడు తర్వాత టీడీపీ పుంజుకుందని చంద్రబాబు నుంచి నేతలు సయితం అభిప్రాయపడుతున్నారు. ప్రజలు ప్రత్యమ్నాయంగా చంద్రబాబును ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారని చెబుతోంది. అందుకే పవన్ డిమాండ్ ను పెద్దగా పట్టించుకునే పరిస్థితి లేదన్నది వాస్తవం. టీడీపీది అతి విశ్వాసం అని కొందరు అనుకున్నా వారు మాత్రం జనసేన అలివి కాని డిమాండ్ ను అంగీకరించే పరిస్థితి లేదు.

 

Tags: Janasena in a lone battle