తిరుపతిలో కార్తీక దీపోత్సవం ఏర్పాట్లను పరిశీలించిన జేఈవో సదా భార్గవి
తిరుపతి ముచ్చట్లు:
తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం మైదానంలో నవంబరు
20 వ తేదీ సోమవారం కార్తీక దీపోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించాలని జేఈవో శ్రీమతి సదా భార్గవి అధికారులను ఆదేశించారు. దీపోత్సవం ఏర్పాట్లను ఆమె ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా జేఈవో సదా భార్గవి మీడియాతో మాట్లాడారు . పవిత్రమైన కార్తీక మాసంలో నవంబరు 20న తిరుపతిలో, నవంబరు 27న కర్నూలులో, డిసెంబరు 11న వైజాగ్ లో దీపోత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేపడుతున్నామన్నారు. ధర్మప్రచారంలో భాగంగా శివకేశవుల వైశిష్ట్యం, మహిళలకు దీపం ప్రాశస్త్యాన్ని తెలిపేందుకు 2021వ సంవత్సరం నుండి టీటీడీ ఆధ్వర్యంలో కార్తీక దీపోత్సవాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. టీటీడీ పరిపాలనా భవనంలోని మైదానంలో ఏర్పాట్లు పూర్తి కావచ్చాయన్నారు . సోమవారం సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుందని ఆమె తెలిపారు .ఈ కార్యక్రమాన్ని ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం చేస్తుందని జేఈవో చెప్పారు .

మైదానంలో దాదాపు 2 వేల మంది కూర్చునేందుకు వీలుగా ఏర్పాట్లు చేశామన్నారు. ఈ సందర్భంగా టీటీడీ విద్యార్థులతో విష్ణుసహస్రనామ పారాయణం నిర్వహిస్తామన్నారు. అనంతరం జేఈవో అధికారులతో సమీక్ష నిర్వహించారు. కార్యక్రమ సరళికి సంబంధించి పలు సూచనలు చేశారు. వేదికపై సుందరంగా పుష్పాలంకరణలు, విద్యుత్ దీపాలంకరణలు చేయాలన్నారు. పారిశుధ్య నిర్వహణకు అదనపు సిబ్బందిని ఏర్పాటు చేయాలని ఆదేశించారు.కార్యక్రమంలో భాగంగా యతివందనం, సందర్భ పరిచయం, వేద స్వస్తి తరువాత దీప ప్రాశస్త్యాన్ని వివరిస్తారు. అనంతరం విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, విష్ణుసహస్రనామ స్తోత్ర పారాయణం, శ్రీ మహాలక్ష్మీ పూజ, ఎస్వీ సంగీత కళాశాల ఆధ్వర్యంలో హరిహరుల నృత్య రూపకం ప్రదర్శిస్తారు. ఆ తరువాత సామూహిక లక్ష్మీ నీరాజనం, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులతో గోవిందనామాలు, మంగళాచరణం ఆలపిస్తారు. చివరగా నైవేద్యం, నక్షత్ర హారతి, కుంభహారతి ఇస్తారు.
Tags:JEO Sada Bhargavi inspected the Kartika Dipotsavam arrangements in Tirupati.
