దేశాన్ని వణికిస్తున్న జికా వైరస్

-29 మందికి పాజిటివ్ కేసులు
Date:09/10/2018
న్యూఢిల్లీ ముచ్చట్లు:
దేశాన్ని జికా వైరస్‌ వణికిస్తోంది. రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఏకంగా 29 జికా వైరస్‌ కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. బిహార్‌లోనూ పలువురు ఈ ప్రాణాంతక వ్యాధి బారిన పడినట్లు తెలుస్తోంది. వ్యాధి లక్షణాలతో బాధ పడుతున్నవారందరూ భయంతో ఆస్పత్రుల బాటపట్టారు. ఇప్పటికే 500 మందికి పైగా అనుమానితుల రక్తనమూనాలను పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపించారు. వీరిలో గర్భిణులు అధిక సంఖ్యలో ఉన్నారు. జికా వైరస్‌ సోకినట్లు వార్తలు రావడంతో దేశ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ దీనికి సంబంధించి సమగ్ర నివేదిక ఇవ్వాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖను కోరారు.
ప్రధాని ఆదేశాల మేరకు కేంద్ర మంత్రిత్వ బృందం జైపూర్‌కు వెళ్లి పరిస్థితి సమీక్షిస్తోంది. జైపూర్‌లో తొలిసారిగా సెప్టెంబరు 23న ఓ మహిళకు జికా వైరస్‌ లక్షణాలు బయటపడ్డాయి. సదరు మహిళలో జికా వైరస్ వ్యాధిని నిర్ధారించిన తర్వాత అధికారులు అప్రమత్తమయ్యారు. వ్యాధి లక్షణాలతో బాధపడుతున్నవారి బ్లడ్ శాంపూల్స్ పరీక్షలకు పంపించారు. దీంతో ఆ తర్వాత 22 మందికి ఈ జికా సోకినట్లు తేలింది. మంగళవారం  నాటికి మొత్తం 29 మందికి ఈ వ్యాధి సోకినట్లు అధికారులు వెల్లడించారు. రాజస్థాన్‌లోని అన్ని జిల్లాల్లో అధికారులను అప్రమత్తం చేశారు.
జైపూర్‌లో జికా వైరస్‌ బారిన పడిన ఓ విద్యార్థి బిహార్‌కు చెందిన వ్యక్తి కావడంతో బిహార్‌లోనూ ఆందోళన మొదలైంది. సదరు యువకుడు ఆగస్టు 28 నుంచి సెప్టెంబరు 12 వరకు తన స్వస్థలమైన బిహార్‌లోని సివాన్‌కు వెళ్లాడు. దీంతో అతడి కుటుంబసభ్యులను కూడా వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారులు మార్గదర్శకాలు జారీ చేశారు.
ఆందోళన అవసరం లేదు: కేంద్ర మంత్రి జేపీ నడ్డా
ప్రజలు ఆందోళన పడాల్సిన అవసరం లేదని కేంద్ర మంత్రి జేపీ నడ్డా అన్నారు. పరిస్థితిని సమీక్షిస్తున్నామని, అన్ని కేసులనూ గుర్తిస్తామని వెల్లడించారు. జికా వైరస్‌ వ్యాప్తిపై సమగ్ర నివేదిక అందించాలని ప్రధాని కార్యాలయం కోరిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖకు చెందిన సీనియర్‌ అధికారి తెలిపారు. ఏడుగురు సభ్యులతో కూడిన ఉన్నత స్థాయి బృందం జైపూర్‌లో పరిస్థితిని సమీక్షిస్తోంది.
రాజస్థాన్‌లో జికా వైరస్‌ సోకిన వారిని ప్రస్తుతం జైపూర్‌లోని ఎస్‌ఎంఎస్‌ ఆస్పత్రిలో ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఐసీఎంఆర్‌, నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌, డీజీహెచ్‌ఎస్‌ పర్యవేక్షిస్తున్నాయి. దీని కోసం ప్రత్యేకంగా కంట్రోల్‌ రూంను ఏర్పాటు చేశారు.
Tags: Jika virus breaking the country

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed