ప్రజలను దోచుకుంటున్న జియో, ఎయిర్‌టెల్‌ కంపెనీలు– అభిమన్యు

అమరావతీ ముచ్చట్లు:

 

జియో, ఎయిర్‌టెల్‌ కంపెనీలు సెల్‌ రీచార్జీలను భారీగా పెంచాయి. జియో 12 నుంచి 25 శాతానికి పెంచితే, ఎయిర్‌ టెల్‌ 11 నుంచి 21 శాతానికి పెంచింది. ఈ పెంపుదలతో జియో, ఎయిర్‌ టెల్‌ కంపెనీల లాభాలు రూ. 20 వేల కోట్లకు పెరుగుతాయని మీడియా చెపుతున్నది. మరోవైపు, ఈ చార్జీల పెంపుదల ఇప్పటికే నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటటంతో కుదేలైన తక్కువ ఆదాయం గల ప్రజలను, ముఖ్యంగా శ్రామిక వర్గాన్ని బాగాదెబ్బతీస్తుంటే ఈ చార్జీల పెరుగుదల పిడుగుపాటు అయింది.ఒక్కొక్క వినియోగదారుడి నుంచి వచ్చే సగటు ఆదాయం పెరుగుదల (యావరేజి రెవిన్యూ పర్‌ యూజర్‌) కోసం ఈ పెంపుదలను చేశామని టెలికం కంపెనీలు సమర్ధించుకుంటున్నాయి.ఇది పూర్తిగా తప్పుదోవ పట్టించే ప్రకటన. ప్రయివేటు టెలికం కంపెనీలు ఇంత భారీగా చార్జీల ధరలు పెంచటానికి గల కారణం కనపడటం లేదు. జియో, ఎయిర్‌టెల్‌ కంపెనీలు ఇప్పటికే అత్యధిక లాభాలు దండుకున్నాయనేది కాదనలేని సత్యం.
2023-24 ఆర్ధికసంవత్సరంలో జియో రూ. 20,607కోట్లు నికర లాభం సంపాదించింది. ఇదే ఆర్థిక సంవత్సరంలో ఎయిర్‌ టెల్‌ రూ.7467 కోట్లు నికరలాభం సంపాదించింది. అందుచేత, సామాన్య ప్రజలను పిండి వసూలు చేసే ఈ చార్జీల పెంపుదల బొత్తిగా అనవసరమైనది. టెలికం రంగంలో ట్రారు (TRAI) నియంత్రణాసంస్థ ఉంది. లాభ దాహార్తితో పనిచేసే ప్రయివేట్‌ టెలికం కంపెనీలు ప్రజలను దోచుకోకుండా చూడటం కూడా ఈ ట్రారు విధుల్లో ఒకటి. అయితే, ఆచరణలో ఈ ట్రారు ప్రయివేట్‌ టెలికం కంపెనీల ప్రయోజనాల కోసమే పని చేస్తున్నది. 2016లో జియో తన సేవలను ప్రారంభించి నప్పుడు నియంత్రణా సంస్థ నిబంధనలన్నిటినీ జియో అతిక్రమిం చింది. అప్పుడు ట్రారు మూగజీవిలా చూస్తూ ఉండి పోయింది. ఆ సమయంలో జె.ఎస్‌ దీపక్‌ అనే సీనియర్‌ అధికారి టెలికం డిపార్ట్మెంట్‌కి కార్యదర్శిగా ఉన్నారు.

 

 

 

ఇతను జియో చేసిన తీవ్ర ఉల్లంఘ నలపట్ల అభ్యంతరాలు లేవనెత్తుతూ, జియోపై చర్య తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ ట్రారుకి లేఖ రాశారు. ట్రారు ఎటువంటి చర్యను తీసుకోలేదు సరికదా, మోడీ ప్రభుత్వం టెలికం డిపార్ట్మెంట్‌ నుంచి జెఎస్‌ దీపక్‌ని రాత్రికి రాత్రే బయటకు నెట్టింది. ఇటువంటి పరిస్థితుల్లో, బిఎస్‌ఎన్‌ఎల్‌ మాత్రమే టెలికం రంగంలో నిజమైన నియంత్రణా సంస్థగా పనిచేసింది. బిఎస్‌ఎన్‌ఎల్‌ నుంచి ఉన్న తీవ్ర పోటీ కారణంగా తమ ఇష్టానుసారం టారిఫ్‌ చార్జీలను పెంచలేకపోయినాయి. ఈ పరిస్థితి ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. ఏమైనా, ఈరోజు దాకా బిఎస్‌ఎన్‌ఎల్‌ 4జి, 5జి సేవలను ప్రారంభించలేకపోయింది. దీని ఫలితంగా ప్రవేటు కంపెనీలతో సమాన స్థాయిలో పోటీ పడటానికి అవరోధం ఏర్పడింది.బిఎస్‌ఎన్‌ఎల్‌లో 4జి, 5జి సేవలు అందుబాటులో లేనందువల్ల బిఎస్‌ఎన్‌ఎల్‌ వినియోగ దారులు హై స్పీడ్‌ డాటా సేవలు పొందే అవకాశం కోల్పోతున్నారు. దీనితో తప్పనిసరై, వినియోగ దారులు పెద్ద సంఖ్యలో బిఎస్‌ఎన్‌ఎల్‌ను వదిలి, జియో, ఎయిర్‌ టెల్‌ వైపు మరలుతున్నారు. ట్రారు విడుదల చేసిన లెక్కల ప్రకారం, 2023-24 ఒక ఏడాదిలోనే బిఎస్‌ఎన్‌ఎల్‌ భారీస్థాయిలో 1.8 కోట్ల మంది వినియోగదారులను పోగొట్టుకుంది. 2024 మార్చి ఒక్క నెలలోనే 23.54 లక్షల మంది వినియోగదారులు బిఎస్‌ఎన్‌ఎల్‌ వదిలి వెళ్లారు. అదే నెలలో రిలయన్స్‌ జియో 21.43 లక్షల మంది కొత్త వినియోగ దారులను, ఎయిర్‌ టెల్‌ 17.5 లక్షలమంది కొత్త వినియోగదారులను పొందగలిగాయి. ఈ పరిణామాలన్నీ జియో, ఎయిర్‌ టెల్‌ భారీగా టారిఫ్‌ చార్జీలు పెంచడానికి ప్రోత్సహించాయి. ఎందువలన ఇప్పటిదాకా బిఎస్‌ఎన్‌ఎల్‌ తన 4జి, 5జి సేవలను ప్రారంభించలేక పోయింది? ఎందువలనంటే మోడీ ప్రభుత్వం బిఎస్‌ ఎన్‌ఎల్‌కు రెండు ప్రతిబంధకాలు కల్పించింది. ఒకటి: 2019లో బిఎస్‌ఎన్‌ఎల్‌కు అప్పుడున్న 3జి నెట్వర్క్‌ ను 4జి నెట్వర్క్‌గా అప్‌ గ్రేడ్‌ చేయడానికి అనుమతించలేదు. రెండు: తిరిగి 2020లో రిలయన్స్‌ జియో, ఎయిర్‌టెల్‌లతో విదేశీ అమ్మకందారుల నుంచి ప్రామాణికమైన 4జి పరికరాలను బిఎస్‌ఎన్‌ఎల్‌ కొనుగోలు చేయటాన్ని నిషేధించారు. భారతదేశ పరికరాల తయారీదారుల నుంచి మాత్రమే 4జి పరికరాలు బిఎస్‌ఎన్‌ఎల్‌ కొనవలసిన తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది.

 

 

2023 మే నెలలో, మాజీ సమాచార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌, ఇక కొద్ది వారాలలో బిఎస్‌ఎన్‌ఎల్‌ 4జి సేవలు ప్రారంభిస్తుందని, అదే ఏడాది నవంబరు లేక డిసెంబర్‌ నాటికల్లా ఈ సేవలనే 5జికి అప్‌గ్రేడ్‌ చేస్తామని గొప్పలు చెప్పారు. అయితే, బిఎస్‌ఎన్‌ఎల్‌ కనీసం 4జి సేవలను సైతం ఈనాటికి కూడా ప్రారంభించలేకపోయింది ఈ కారణాలన్నిటిని దృష్టిలో పెట్టుకొని బిఎస్‌ఎన్‌ఎల్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ (BSNLEU), బిఎస్‌ ఎన్‌ఎల్‌ తన కస్టమర్లకు 4జి సేవలు అందించడానికి వోడాఫోన్‌ ఐడియానెట్వర్క్‌ను వాడుకోవడానికి అనుమతివ్వ మని డిమాండ్‌ చేసింది. వోడాఫోన్‌ ఐడియాలో ప్రభుత్వమే అతిపెద్ద వాటాదారిగా ఉన్నప్పుడు, ఈ ప్రతిపాదనను తేలికగా అమలులో పెట్టవచ్చు. కానీ అలా జరగలేదు. బిఎస్‌ఎన్‌ఎల్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ ఈ డిమాండ్‌ను అమలులో పెట్టమని దేశవ్యాప్తంగా ప్రదర్శనలు నిర్వహించింది.జియో, ఎయిర్‌ టెల్‌ తమ చార్జీలను భారీగా పెంచిన సందర్భంలో బిఎస్‌ఎన్‌ఎల్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌, బిఎస్‌ఎన్‌ఎల్‌ తక్షణమే 4జిసేవలు ప్రారంభించ టానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని, దానిని త్వరగా 5జిగా అప్‌గ్రేడ్‌ చేయాలని సమాచార శాఖ మంత్రికి మరోసారి లేఖ రాసింది. 4జి, 5జి సేవలు ప్రారంభిస్తే సామాన్య ప్రజానీకానికి హైస్పీడ్‌ డాటా సేవలను, తక్కువ టారిఫ్‌ చార్జీలతో బిఎస్‌ఎన్‌ఎల్‌ అందించ గలుగుతుంది.

 

Tags: Jio and Airtel companies are robbing people – Abhimanyu

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *