మళ్లీ తెరపైకి జూనీయర్‌ ఎన్టీఆర్

Junior NTR again on the screen

Junior NTR again on the screen

Date:20/03/2018
హైద్రాబాద్  ముచ్చట్లు:
ఇప్ప‌టికే అనేక స‌మ‌స్య‌ల‌తో, ఊపిరి స‌ల‌ప‌ని సంక్లిష్ట ప‌రిస్థితుల్లో ఉన్న ఏపీ సీఎం చంద్ర‌బాబుకు ఇప్పుడు మ‌రో సమ‌స్య వ‌చ్చిప‌డింది. ప్ర‌త్యేక హోదా విష‌యంలో టీడీపీ ప్ర‌భుత్వం ఎన్నో పిల్లిమొగ్గ‌లు వేస్తోంది. ప్ర‌జ‌ల్లో పెరుగు తున్న హోదా పోరుకు అనుగుణంగా కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటోంది. ఇదే స‌మ‌యంలో తెలంగాణ‌లో పార్టీ ప‌రిస్థితిని పూర్తిగా ప‌ట్టించుకునే నాథుడే క‌రువ‌య్యాడు. ఈ నేప‌థ్యంలో ప్ర‌త్యేక హోదాతో పాటు తెలంగాణ‌లో పార్టీని బ‌తికించు కోవాలంటే జూనియ‌ర్ ఎన్టీఆర్ అవ‌స‌రం ఇప్పుడు పార్టీకి త‌ప్ప‌నిస‌రి అని తెలంగాణ నేత‌లు, విశ్లేష‌కులు స్ప‌ష్టంచే స్తున్నారు. జూనియ‌ర్‌తో విభేదాలు ప‌క్క‌న పెట్టి.. శాంతియుతంగా స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించుకోవాల‌ని సూచిస్తున్నారు. అప్పుడే అటు రాష్ట్రానికీ, ఇటు టీడీపీకి మంచిదనే ఒత్తిడి నానాటికీ పెరుగుతోంది.ప్ర‌త్యేక హోదా విష‌యంలో ఏపీకి, ఢిల్లీకి పెద్ద యుద్ధ‌మే జ‌రుగుతోంది. మొన్న‌టివ‌ర‌కూ ప్యాకేజీనే బెట‌ర్ అంటూ చెప్పిన టీడీపీ అధినేత చంద్ర‌బాబు.. ఇప్పుడు హోదా కోసం ప‌ట్టుబ‌డుతున్నారు. ఎన్డీఏ నుంచి బ‌య‌టికొచ్చి పోరాటం చేస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఇప్పుడు హోదా కోసం జూనియ‌ర్ ఎన్టీఆర్‌ను తెర‌పైకి తీసుకురావాల‌ని ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ.. చంద్ర‌బాబుకు సూచించడం రాజ‌కీయ వ‌ర్గాల్లో స‌రికొత్త చ‌ర్చ‌కు దారితీసింది. దీని వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుందని, ఎన్టీఆర్ క‌చ్చితంగా రాష్ట్రానికి ఉపయోగపడతాడ‌ని పేర్కొన్నారు. చంద్రబాబు, ఎన్టీఆర్ ల మధ్య విభేదాలు ఏమిటో తనకు తెలియవని, నెగిటివ్ అంశాలు వదిలేసి.. ఎన్టీఆర్ ను ఉపయోగించుకుంటే ఎంతో బాగుంటుందని సూచించారు. పాజిటివ్ గా వెళ్లాలని సలహా ఇచ్చారు.ఎన్టీఆర్ రాష్ట్రంలో మంచి నాయకుడిగా కూడా ఉద్భవిస్తాడని అభిప్రాయ‌ప‌డ్డారు. `అతను మీకేమి నష్టం చేయడు. అంత భయం ఏమీ అక్కర్లేదు. భయం వల్లే అతన్ని బయటకు పంపారనే అనుమానాలు చాలా మందిలో ఉన్నాయి.` అంటూ వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ కు రాజకీయాల్లోకి వచ్చే అర్హతలు ఉన్నాయని, మాట్లాడే సామర్థ్యం ఉందన్నారు. గ‌తంలోనూ ఎన్టీఆర్‌కు పార్టీలో కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గించాల‌నే డిమాండ్లు తెర‌పైకి వచ్చాయి. గ‌తంలో తెలంగాణ‌లో స‌మావేశం నిర్వ‌హించిన స‌మ‌యంలో.. ఆ పార్టీ నేత‌లు జూనియ‌ర్ ఎన్టీఆర్‌కు తెలంగాణ బాధ్య‌త‌లు అప్ప‌గించాల‌ని డిమాండ్ చేసిన విష‌యం తెలిసిందే! అయితే త‌ర్వాత కూడా కొంద‌రు సీనియ‌ర్లు చంద్ర‌బాబు ముందు ఇదే ప్ర‌తిపాద‌న ఉంచినా.. వాటిని ఆయ‌న కొట్టిపారేశారు.కాగా గ‌తంలో టీడీపీ త‌ర‌ఫున జూనియ‌ర్‌ ఎన్టీఆర్ ప్ర‌చారం చేశారు. ప్ర‌మాదంలో గాయ‌ప‌డినా స్ట్రెచ‌ర్ మీద ఉంటూనే టీడీపీకి మ‌ద్ద‌తు తెలిపారు. త‌ర్వాత నంద‌మూరి-నారా కుటుంబాల మ‌ధ్య విభేదాలు పొడ‌చూపాయి. అప్ప‌టి నుంచి జూనియ‌ర్ ఎన్టీఆర్ పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు మిత్రుడ‌నుకున్న ప‌వ‌న్ క‌ల్యాణ్ దూర‌మ‌వ‌డం, త‌ర్వాత ఎన్టీఏ నుంచి బ‌య‌టికి రావ‌డంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ ఒంట‌రిగా పోటీచేసే ప‌రిస్థితి. వీటికి తోడు ప్ర‌భుత్వంపై అవినీతి విమ‌ర్శ‌లు చంద్ర‌బాబును మ‌రింత ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో జూనియ‌ర్ ఎన్టీఆర్ పేరు మ‌రోసారి తెర‌పైకి వ‌స్తోంది. మ‌రి విభేదాలు ప‌క్క‌న‌పెట్టి ఎన్టీఆర్‌ను మ‌ళ్లీ రాజ‌కీయ తెర‌పైకి తీసుకొస్తారో ఏమో వేచిచూడాల్సిందే!
Tags: Junior NTR again on the screen

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *