నిరుపేదలకు అండగా న్యాయసేవాధికార సంస్థ

Date:09/11/2018
ఏలూరు ముచ్చట్లు:
పేదలకు ఉచిత న్యాయ సహాయం అందించేందుకు జిల్లా న్యాయసేవాధికార సంస్థ కృషి చేస్తోందని జిల్లా మొదటి అదనపు జడ్జి బి.గోపీ చెప్పారు. స్థానిక జిల్లా కోర్టు ఆవరణలోని న్యాయ సేవా సదన్‌లో శుక్రవారం  జాతీయ న్యాయ సేవా దినోత్సవం సందర్భంగా జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి ఆయన అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా గోపీ మాట్లాడుతూ నిరుపేదలు, మహిళలు, దివ్యాంగులకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ఉచిత న్యాయ సలహాలు అందించడంతోపాటు న్యాయ సహాయం కూడా అందించడం జరుగుతున్నదని, ముఖ్యంగా సమాజంలో అణగారిని వర్గాలకు రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా న్యాయ సహాయాన్ని అందించడం జరుగుతుందన్నారు. రాజ్యాంగం ద్వారా ప్రజలకు సంక్రమించిన హక్కులపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు. ప్రజలకు హక్కులతోపాటు బాధ్యతలు కూడా తెలియజేయాలన్నారు. చట్టాలను ఏ సమయంలో వినియోగించుకోవాలో కూడా తెలియజేయాలన్నారు.
ఏడవ అదనపు జడ్జి యస్.శారదాదేవి మాట్లాడుతూ అందరికీ సమన్యాయం అందించేందుకు 1987వ సంవత్సరంలో న్యాయసేవాధికార సంస్థ రూపొందించేందుకు చట్టం చేశారన్నారు. ఈ చట్టం ద్వారా మహిళలకు, విభిన్నప్రతిభావంతులు, నిరుపేదలు, అణగారిని వర్గాలకు ఉచిత న్యాయ సహాయం అందించడం జరుగుతుందన్నారు. కుటుంబంలో మహిళ విద్యావంతురాలైతే ఆ కుటుంబం మొత్తం విద్యావంతులైనట్లేనన్నారు.
జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కె.శైలజ మాట్లాడుతూ జాతీయన్యాయ సేవా దినోత్సవం సందర్భంగా జిల్లాలో నవంబరు, 9వ తేదీ నుండి 18వ తేదీ వరకు ప్రజలకు ఇంటింటికి వెళ్లి కార్యకర్తల ద్వారా చట్టాలపై అవగాహన కలిగించడంజరుగుతుందన్నారు. చట్టాలపై ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు గ్రామాలలో న్యాయ విజ్ఞాన సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. సమాజంలో నిరుపేదలకు జిల్లా న్యాయసేవాధికార సంస్థ ద్వారా ఉచితంగా న్యాయ సహాయం అందిస్తున్నామన్నారు.
జిల్లా అదనపు పోలీసు సూపరింటెండెంట్ ఈశ్వరరావు మాట్లాడుతూ పోలీసు శాఖకు, న్యాయసహాయం కోసం ఎ దురుచూసే ప్రజలకు జిల్లా న్యాయసేవాధికార సంస్థ అనుసంధానకర్తగా ఉంటూ, పేదలకు ఉచితంగా న్యాయ సహాయం అందిస్తున్నారన్నారు. కార్యక్రమంలో జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు అబ్బినేని విజయకుమార్ ప్రభృతులు ప్రసంగించారు.
కార్యక్రమంలో అదనపు సీనియర్ సివిల్ జడ్జి శ్రీనివాసరావు, ఎ క్సైజ్ కోర్టు న్యాయమూర్తి ప్రసాద్, మొబైల్ కోర్టు న్యాయమూర్తి వెంకటేశ్వరశర్మ, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి బెన్నయ్యనాయుడు, పోలీసు అధికారులు, పారా లీగల్ వాలంటీర్లు, ప్రభృతులు పాల్గోన్నారు.
Tags: Justice Authority for Poor Poverty

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *