కబ్జా కోరుల అడ్డా.. 

Date:25/05/2018
కాకినాడ ముచ్చట్లు:
కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో భూ ఆక్రమణలకు కొందరు నేతలు బరి తెగిస్తున్నారు. ప్రజాప్రతినిధుల అండ చూసుకుని ప్రభుత్వ స్థలాల్లో పాగా వేస్తున్నారు. కాకినాడ గ్రామీణం పరిధిలోకి వచ్చే 49వ డివిజన్‌ విద్యుత్తు నగర్‌ పరిధిలో కాలువ పొరంబోకు, రహదారులు,  పార్కు స్థలాలు దేన్నీ వదలకుండా కబ్జాలకు పాల్పడుతున్నారు. ఈ వ్యవహారాలపై స్థానికులు ఫిర్యాదు చేసినా ప్రజాప్రతినిధుల అండ ఉండటంతో వారి ఆగడాలకు అడ్డు లేకుండా పోయింది. నిక్కర్‌ మేస్త్రిగా పిలుచుకునే ఓ నేత కనుసన్నల్లో ఈ ప్రాంతంలో ఆక్రమణలు యథేచ్ఛగా సాగిపోతున్నాయి. రియల్‌ ఎస్టేట్‌ ముసుగులో అక్రమ లేఅవుట్లు వేయడం, రహదారులు ఆక్రమించి ఇళ్ల నిర్మాణాలు చేయడం, పార్కులుంటే అక్కడ కూడా ఇళ్లు కట్టడం, పంటకాలువ పొరంబోకు స్థలాలను స్వాధీనం చేసుకోవడం పరిపాటిగా మారింది.తిమ్మాపురం నుంచి ఇంద్రపాలెం వైపునకు వెళ్లే పంటకాలువ ఇప్పుడు కాకినాడ నగరానికి ప్రధాన మురుగు కాలువగా మిగిలిపోయింది. ఈ కాలువ గట్టుపై విద్యుత్తు నగర పరిధిలో కొంత మందికి పట్టాలిచ్చినా మరికొంత మంది అనధికారికంగా కాలువ గట్టును ఆక్రమించారు.  గట్టుపైనే ప్రహరీలు నిర్మించారు. గజాల కింద ప్లాట్లుగా మార్చివేశారు. ఇక్కడున్న 80 అడుగులు రోడ్డు సైతం ఆక్రమణలతో నిండిపోయింది. కాలువ మీద ఉన్న ఇటుకల వంతెన ఆనుకుని గట్టుతో కలిపి ఇంటి నిర్మాణానికి మట్టితో కప్పేశారు. కాలువకు 30 అడుగుల మేర బఫర్‌ జోన్‌ కింద ఉంటుంది. ఆ స్థలాన్నీ వదలడం లేదు. ఇంత జరుగుతున్నా జలవనరుల శాఖ అధికారులు పట్టించుకుంటున్న దాఖలాలు లేవు. కాలువ స్థలం ఆక్రమించుకున్న వ్యవహారంలో నిక్కర్‌ మేస్త్రి ప్రమేయం ఉండటంతో నీటిపారుదల శాఖ అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని విద్యుత్తునగర్‌ కాలనీ వాసులు చెబుతున్నారు. భవిషత్తులో కాకినాడకు ఇదే ప్రధాన మురుగు కాలువ అయినా దాని సంరక్షణ విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వాపోయారు. ఈ ప్రాంతంలో ఉన్న భూములను ఆక్రమించుకున్న వారికి డాక్యుమెంట్లు ఎక్కడినుంచి వచ్చాయే తెలియడం లేదని అక్కడి కార్పొరేటర్‌ ప్రకాష్‌ తెలిపారు.విద్యుత్తునగర్‌ పరిధిలో ఒక పార్కు స్థలం ఉంది. దీన్ని ఆక్రమించి ఇళ్లు కట్టేశారని 49వ డివిజన్‌ కార్పొరేటర్‌ ప్రకాష్‌ నగరపాలక సంస్థ టౌన్‌ప్లానింగ్‌ అధికారులకు ఫిర్యాదు చేశారు. కార్పొరేటర్‌ ప్రకాష్‌ మాట్లాడుతూ పార్కు స్థలం ఎక్కడుందో సర్వే చేసి తమకు చూపించాలని అధికారులను అడుగుతున్నా వారి నుంచి సరైన స్పందన ఉండటం లేదన్నారు. ఎల్‌.పి. నంబరు 20/2006/ఆర్‌లో పార్కు స్థలం స్పష్టంగా కేటాయించి ఉన్నా దీన్ని సంరక్షించే విషయంలో నగరపాలక సంస్థ అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారన్నారు. తమ వద్ద ఉన్న లేఅవుట్‌ ఎల్‌.పి. నంబరు ప్రకారం పార్కు కోసం కేటాయించిన ఖాళీ స్థలంలోనే ఇళ్లు నిర్మాణం చేసి, మిగిలిన స్థలాన్ని కూడా కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారన్నారు. సర్వే చేసి ఖాళీ స్థలం చూపమంటే ఇవాళా, రేపు అంటూ అధికారులు వాయిదా వేస్తున్నారన్నారు.
Tags: Kabza korala adha ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *