కాంగ్రెస్ గూటికి రాహుల్ సమక్షంలో కాకా బ్రదర్స్  

Kakas Brothers in the presence of Rahul in Congress

Kakas Brothers in the presence of Rahul in Congress

Date:17/10/2018
హైద్రాబాద్ ముచ్చట్లు:
కాంగ్రెస్ పార్టీలో ఒకప్పుడు కీలకనేతగా వెలుగొందారు వెంకటస్వామి. కాంగ్రెస్ కు నమ్మినబంటుగా సుదీర్ఘకాలం కొనసాగారు. కానీ, ఆయన కుమారులు మాత్రం రాజకీయాల్లో అనేక తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటూ పార్టీలు మార్చేస్తున్నారు. వెంకటస్వామి కుమారులు మాజీ మంత్రి జి.వినోద్, పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్ కాంగ్రెస్ లో సుదీర్ఘకాలమే కొనసాగారు. కాంగ్రెస్ లోనే వివిధ హోదాల్లో పనిచేశారు. అయితే, 2013లో తెలంగాణ ఉద్యమ ప్రభావంతో కాంగ్రెస్ వైఖరిని వ్యతిరేకించి టీఆర్ఎస్ గూటికి చేరారు.
ఇక 2014లో తెలంగాణ ఏర్పాటు తర్వాత ఎన్నికలకు 15 రోజుల ముందు టీఆర్ఎస్ ను వీడి మళ్లీ స్వంత గూటికి చేరారు. ఆర్థికంగా బలవంతులు కావడం, కాంగ్రెస్ అధిష్ఠానం వద్ద పలుకుబడితో వివేక్ పెద్దపల్లి ఎంపీ టిక్కెట్ ను, వినోద్ చెన్నూరు అసెంబ్లీ సీటు ను పొందారు. టీఆర్ఎస్ హవాలో ఇద్దరూ ఓడిపోవడంతో 2016లో మళ్లీ టీఆర్ఎస్ లో చేరారు. వివేక్ కు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా పదవిని ఇచ్చారు.
ఇక ఎన్నికల వేళ మళ్లీ వారు పార్టీ మారే యోచనలో ఉన్నారు. అయితే, వివేక్ ఇంకా ఏ నిర్ణయం తీసుకోకున్నా, వినోద్ మాత్రం కాంగ్రెస్ లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.2004లో చెన్నూరు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన వినోద్ కార్మిక శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. తర్వాత జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి నల్లాల ఓదేలు చేతిలో ఓడిపోయారు. అయితే, ఈ ఎన్నికల్లో ఆయన చెన్నూరు స్థానాన్ని ఆశించారు. కానీ, ఎవరూ ఊహించని విధంగా సిట్టింగ్ ఎమ్మెల్యే నల్లాల ఓదేలును తప్పించిన టీఆర్ఎస్ ఆ స్థానాన్ని పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ కు కేటాయించింది. దీంతో నల్లాల ఓదేలు అసమ్మతి వ్యక్తం చేయడం, ఆయన అనుచరుడు గట్టయ్య ఆత్మహత్య చేసుకోవడం వంటి పరిణామాలు తెలిసిందే. తర్వాత పార్టీ పెద్దలు బాల్క సుమన్, ఓదేలును కూర్చోబెట్టి రాజీ కుదిర్చారు.
ఇప్పుడు ఇద్దరు కలిసి ప్రచారం చేసుకుంటున్నారు. దీంతో టిక్కెట్ కోసం వినోద్ సోదరులు పార్టీపై ఒత్తిడి తెచ్చారు. కేటీఆర్ తో పలు దఫాలు చర్చలు జరిపారు. బాల్క సుమన్ కు మద్దతు ఇచ్చేది లేదని తేల్చారు. ఒకవేళ చెన్నూరు కాకున్నా చొప్పదండి లేదా బెల్లంపల్లి స్థానమైనా కేటాయించాలని కోరారు. కానీ, వినోద్ కు టిక్కెట్ ఇవ్వడం కుదరదని, మళ్లీ అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్సీ ఇస్తామని కేటీఆర్ స్పష్టం చేసినట్లు తెలిసింది. ఇక బాల్క సుమన్ ను ఎమ్మెల్యేగా పంపించడం ద్వారా వివేక్ కు పెద్దపల్లి ఎంపీ టిక్కెట్ ఇవ్వడానికి రూట్ క్లియర్ అయ్యిందని కూడా చెప్పారు.ఎట్టి పరిస్థితుల్లో చెన్నూరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావిస్తున్న వినోద్ కాంగ్రెస్ వైపు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.
ఆయన కాంగ్రెస్ పెద్దలతో ఇప్పటికే చర్చలు జరిపారని, 20వ తేదీన భైంసాలో జరగనున్న రాహుల్ గాంధీ సభలో కాంగ్రెస్ లో చేరతారని ప్రచారం జరుగుతోంది. అయితే, ఇప్పటివరకు సోదరులిద్దరూ కలిసే రాజకీయంగా నిర్ణయాలు తీసుకున్నారు. మరి, ఈ సారి అన్న ఒక్కడే కాంగ్రెస్ లో చేరితే వివేక్ టీఆర్ఎస్ లో కొనసాగుతారా అనేది ప్రశ్నార్థకమే. ఒకవేళ కొనసాగినా ఆయనకు ప్రాధాన్యత తగ్గే అవకాశం ఉంది. ఇక కాంగ్రెస్ లోకి వెళ్లినా చెన్నూరు స్థానం వినోద్ కు కచ్చితంగా దక్కే అవకాశం కూడా లేదు. ఆ స్థానాన్ని మాజీ మంత్రి బోడ జనార్ధన్, మాజీ ఎమ్మెల్యే సంజీవరావు ఆశిస్తున్నారు.
తరచూ పార్టీలు మారుతున్న వినోద్ ను చేర్చుకోవద్దని కోందరు కాంగ్రెస్ నేతలు అంటున్నారు. అయితే, మీడియా చేతిలో ఉండటం, అర్థికంగా బలంగా ఉండటం, కాంగ్రెస్ మనుషులే కావడంతో కాంగ్రెస్ వారిని వదులుకునే అవకాశం లేదు. మొత్తానికి ఇంతకాలం కలిసి సాగిన అన్నదమ్ముల రాజకీయ ప్రయాణం ఇప్పుడు వేరయ్యేలా ఉంది. రాజకీయంగా వెలుగు వెలిగిన వీరు పార్టీలు మారడం వల్ల టిక్కెట్ కోసం తిప్పలు పడే పరిస్థితి నెలకొంది.
Tags:Kakas Brothers in the presence of Rahul in Congress

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *