కాళేశ్వరం…వివాదాల కేంద్రం

కరీంనగర్ ముచ్చట్లు:


ఇంజనీరింగ్ అద్భుతంగా కేసీఆర్ పదే పదే అభివర్ణిస్తున్నకాళేశ్వరం ఇప్పుడు వివాదాల కేంద్రంగా మారింది. రీ డిజైన్ పేరుతో కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును తనకు ఏటీఎంగా మార్చేసుకున్నారన్న విమర్శలు గతం నుంచీ వినిపిస్తున్నా.. ఇటీవలి వరదకు ప్రాజెక్టు పంపులు, మోటార్లు ముంపునకు గురైన నేపథ్యంలో మరో సారి విమర్శల దాడి పెరిగింది. ప్రాజెక్టు ఉనికే ప్రశ్నార్ధకమయ్యివందా అన్న స్థాయిలో సందేహాలు వెల్లువెత్తుతున్నాయి.లక్ష కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో నిర్మితమైన కాళేశ్వరంపై అనుమాన మేఘాలు కమ్ముకున్నాయి. పంపులు, మోటార్లు మునకపై టీఆర్ఎస్ ప్రభుత్వం స్పందించకపోవడం, విమర్శలకు సమాధానం చెప్పకపోవడంతో అనుమానాలు మరింత పెరుగుతున్నాయి. కాళేశ్వరం మోటార్లు, పంపుల మునకతో  అవి మళ్లీ పని చేస్తాయా, వాటి పునరుద్ధరణ ఎప్పటికి పూర్తవుతుంది వంటి ప్రశ్నలకు ప్రభుత్వం నుంచి, నీటి పారుదల శాఖ నుంచి మౌనమే సమాధానం కావడం మరిన్ని అనుమానాలకు తావిస్తుంది. చిన్న పాటి విమర్శకే భారీ స్థాయిలో స్పందించి ఎదురుదాడికి దిగే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన మంత్రివర్గ సహచరులు పన్నెత్తి మాట్లాడడానికి కూడా ముందుకు రాకపోవడంతోనే కాళేశ్వరం ఎత్తిపోయిందా అన్న సందేహాలకు కారణమౌతున్నది.కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన అన్నారం, కన్నెపల్లి పంపుహౌస్‌‌‌‌‌‌‌‌లను గోదావరి వరదలు ముంచెత్తాయి. మొత్తం 29 మోటార్లు మునిగిపోయాయి.

 

 

అయినా  అక్కడేం జరగనట్లుగానే రాష్ట్ర్ర ప్రభుత్వ వైఖరి ఉంది.   కాళేశ్వరం ఉనికిపై ముసురుకున్న సందేహాలకు వివరణ ఇస్తే చర్చ విస్తృతంగా జరిగి లోపాలు మరంతగా బయటపడతాయన్న భయంతోనే ప్రభుత్వం మౌనం వహించిందని పరిశీలకులు అంటున్నారు. ఇక వరదల వల్ల కాళేశ్వరం ప్రాజెక్టుకు జరిగిన నష్టంపై ఇప్పటి వరకూ ఇరిగేషన్ శాఖ నుంచి అధికారికంగా ఎటువంటి ప్రకటనా రాలేదు.  దానికి తోడు అన్నారం, కన్నెపల్లి పంపుహౌస్‌‌‌‌‌‌‌‌ల పరిసరాల్లో పోలీస్‌‌‌‌‌‌‌‌ పహారా ఏర్పాటు చేశారు.పంపుహౌస్‌‌‌‌‌‌‌‌ల వైపునకు ఎవరినీ, కనీసం మీడియాను  కూడా అనుమతించడం లేదు.  కాళేశ్వరం నిర్మాణంలో ఇంజనీరింగ్ లోపం లేదని చెబుతూ భారీ వరదల వల్లే ఈ పరిస్థితి తలెత్తిందంటున్నారు. కానీ ఆ వాదనలో పస లేదనడానికి   దేవాదుల ప్రాజెక్టు ముంపునకు గురి కాకపోవడమే తార్కనమని పరిశీలకులు ఎత్తి చూపుతున్నారు. కాళేశ్వరం విషయంలో ప్రభుత్వం గోప్యత పాటిస్తోందనీ, వైఫల్యాలను బయటకు పొక్కనీయకుండా జాగ్రత్త పడుతోందనీ విమర్శకలు అంటున్నారు,  దేవాదులలో వరద ఉధృతి ఇంకా ఉన్నప్పటికీ మోటార్లు, పంపులు మునగకపోవడం.. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో సర్కారు చెబుతున్నవి అబద్దాలన్న వాదనకు కారణం అవుతోంది. కాళేశ్వరంపై విమర్శల దాడిని, చర్చకు పక్కదారి పట్టించడానికే సీఎం కేసీఆర్   క్లౌడ్ బరస్ట్, అంతర్జాతీయ కుట్ర, పోలవరంతో భద్రాచలానికి ముప్పు వంటి అంశాలను వ్యూహాత్మకంగా తెరపైకి తీసుకువచ్చారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

 

Tags; Kaleswaram…center of controversy

Leave A Reply

Your email address will not be published.