ముఖ్యనేతల సీట్లపై కమలం పార్టీ గురిపెట్టింది

Date:23/03/2019
బెంగళూరు ముచ్చట్లు:
కన్నడ రాజకీయం వేడెక్కుతుంది. ముఖ్యంగా ముఖ్యనేతల సీట్లపై కమలం పార్టీ గురిపెట్టింది. ప్రధాన పార్టీలకు చెందిన నేతలను, ప్రత్యర్థులను ఓడించడమే లక్ష్యంగా పావులు కదుపుతుంది. ముఖ్యంగా ఈ ఎన్నికలు దళపతి దేవెగౌడకు సవాల్ అనే చెప్పాలి. ఆయన ఈ ఎన్నికల్లో తన మనవళ్లను ఇద్దరినీ బరిలోకి దించుతున్నారు. హాసన్ నుంచి మంత్రి రేవణ్ణ కుమారుడు ప్రజ్వల్, మాండ్య నుంచి ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు నిఖిల్ బరిలోకి నిలిచారు. దీంతో వీరిద్దరిని గెలిపించుకోవడం దళపతికి నిజంగా కత్తిమీద సాము లాంటిదే.హాసన్ నియోజకవర్గం జనతాదళ్ ఎస్ కు పట్టుంది. దేవెగౌడ ఇక్కడి నుంచే కొన్ని దఫాలుగా పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికవుతూ వస్తున్నారు. ఇక్కడ పార్టీకి క్యాడర్ తో పాటు ఓటు బ్యాంకు కూడా అధికంగా ఉండటంతో ప్రజ్వల్ విజయానికి ఢోకా లేదన్నది వాస్తవం.
కానీ హాసన్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కలసి పనిచేస్తుందా? లేదా? అన్నది అనుమానంగానే ఉంది. ఇప్పటికే కొందరు కాంగ్రెస్ నేతలు పొత్తులో భాగంగా హాసన్ ను వదిలిపెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఏది ఏమైనా కాంగ్రెస్ నేతలతో కొంత సర్దుబాటు కుదిరితే ఇక్కడ ప్రజ్వల్ విజయం నల్లేరు మీద నడకే అవుతుందని చెప్పక తప్పదు.ఇక మాండ్య నియోజకవర్గానికి వస్తే తొలుత ఈ సీటు కొంత సులువుగానే కన్పించింది. కాంగ్రెస్, జేడీఎస్ లు ఇక్కడ బలంగా ఉండటంతో హాసన్ లాగే ఉంటుందని దేవెగౌడ భావించి మనవడు నిఖిల్ ను బరిలోకి దించారు. అయితే ఇక్కడ సుమలత రూపంలో ప్రమాదం పొంచి ఉంది. సుమలత ఇప్పటికే స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.
ఆమె నామినేషన్ కార్యక్రమానికి పెద్దసంఖ్యలో కాంగ్రెస్ క్యాడర్ హాజరు కావడం కొంత అయోమయంలోకి నెట్టింది. మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య, మంత్రి డీకే శివకుమార్ లు కాంగ్రెస్ నేతలను సముదాయించినా వీలు కాలేదు. దివంగత సినీనటుడు అంబరీష్ అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తల బలమే సుమలతకు కొండంత అండగా కన్పిస్తుంది.మాండ్య నియోజకవర్గం విషయంలో భారతీయ జనతా పార్టీ పక్కా వ్యూహంతో వెళుతుంది. సుమలతను తొలుత పార్టీలోకి రమ్మని ఆహ్వానించింది.
ఆమె సున్నితంగా తిరస్కరించడంతో దేవెగౌడ మనవడిని ఓడించే లక్ష్యంతో యడ్యూరప్ప పార్టీ సుమలతకు పరోక్ష మద్దతు ఇచ్చే అవకాశముంది. బీజేపీ అధినాయకత్వం నుంచి ఇప్పటికే అక్కడి క్యాడర్ కు సంకేతాలు అందినట్లుంది. బీజేపీ క్యాడర్ కూడా సుమలత నామినేషన్ కు హాజరు కావడం విశేషం. మొత్తం మీద నిఖిల్ గౌడ గెలుపు మాండ్యలో అంత ఈజీ కాదన్నదిన స్పష్టంగా తెలుస్తోంది. మనవడి గెలుపు కోసం పెద్దాయన ఇక్కడ తిష్టవేయాల్సిన పరిస్థితి తప్పేలా లేదు.
Tags:Kamalam Party aimed at the seat of Chief Ministers

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *