గుంటూరు Come for hearing on 10…
కన్నా లక్ష్మీనారాయణ. టిడిపిలో కొత్తగా చేరిన మాజీ మంత్రి. ప్రస్తుతానికి టీడీపీకి జిల్లాలో ట్రబుల్ షూటర్‌గా వినిపిస్తున్న పేరు. గ్రూపుల పేరుతో పార్టీలో ఎవరన్నా సమస్యలు సృష్టిస్తే కన్నా పేరు చెప్పి షాక్ ఇస్తున్నారట. ముఖ్యంగా గుంటూరు పశ్చిమ, సత్తెనపల్లి, పెదకూరపాడు నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి టిడిపి నుంచి ఆశావాహులు ఎక్కువగా ఉన్నారు. ఈ మూడు నియోజకవర్గాల్లో టికెట్స్ కోసం టీడీపీలోని కమ్మసామాజికవర్గ నేతలు పోటీ పడుతున్నారు. దీంతో ఈ మూడు చోట్లా నాయకులు తమకు సీటు కావాలని అడిగితే.. ఆ సీటు మీకు కాదు.. కన్నా పోటీ చేయొచ్చు అని చెబుతున్నారట. వాస్తవానికి ఎక్కడ పోటీ చేయాలో కన్నాకే క్లారిటీ లేదట. ఎవరు ప్రశ్నించినా పార్టీ ఎక్కడ నిర్ణయిస్తే అక్కడ పోటీ చేస్తా అని కన్నా బదులిస్తున్నారు. ఈ సందర్భంగా కన్నా పేరు సత్తెనపల్లిలో కాస్త గట్టిగానే వినిపిస్తోందట. ఇందుకు టీడీపీ లెక్కలు టీడీపీ దగ్గర ఉన్నాయట. సత్తెనపల్లిలో వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు మంత్రి అంబటి రాంబాబు. ఇక్కడ మంత్రిని ఓడించాలంటే.. కన్నానే సరైన క్యాండిడేట్‌గా టీడీపీ పెద్దలు భావిస్తున్నారట.
గుంటూరు పశ్చిమ.. పెదకూరపాడు నియోజకవర్గాలతో పోల్చితే సత్తెనపల్లిలో కాపు సామాజికవర్గం ఓట్లు కొంచెం ఎక్కువ. అంబటికి కాపు ఓట్లు మళ్లకుండా కన్నాను పోటీ చేయిస్తే ప్లాన్ వర్కవుట్ అవుతుందనే ఆలోచనలో టీడీపీ అధిష్ఠానం ఉందట. ఇటీవల కాలంలో కన్నా సైతం సత్తెనపల్లిలో ఎక్కువగా పర్యటించడం ఈ వాదనకు బలం చేకూరుస్తోంది. అలా అని కన్నా మిగతా నియోజకవర్గాల్లో తిరగడం లేదా అంటే.. వెళ్తున్నారు. కానీ సత్తెనపల్లిలో కొంచెం ఎక్కువుగా తిరుగుతున్నారు. సత్తెనపల్లి టీడీపీలో నాయకులు మూడు గ్రూపులుగా విడిపోయి కొట్టుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఈ ముగ్గురికీ కాకుండా కన్నాకు సీటు ఇస్తే.. వాళ్లంతా పార్టీ విజయం కోసం కచ్చితంగా కలిసి పనిచేస్తారని..

అలా కాదని ఆ ముగ్గురిలో ఎవరికి టికెట్ ఇచ్చినా మిగతా వారు గోతులు తవ్వేస్తారనే అభిప్రాయంలో హైకమాండ్ ఉందట. సత్తెనపల్లిలో కన్నాను పోటీ చేయిస్తే.. మంత్రి అంబటికి చెక్ పెట్టినట్టు అవుతుంది.. ఇటు టీడీపీలో వర్గపోరుకు ఫుల్ స్టాప్ పడుతుందనే లెక్కలు వేస్తున్నారట పసుపు పార్టీ పెద్దలు.మొత్తానికి టీడీపీలో కన్నా చేరిక ఓ సంచలనం అయితే.. ఆయన వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అనేది మరో ఆసక్తికర అంశం. పనిలో పనిగా మంత్రి అంబటిని లక్ష్యంగా చేసుకుంటారనే ప్రచారం ఇంకా ఉత్కంఠ రేకెత్తిస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే వచ్చే ఎన్నికలలో అంబటి, కన్నా మధ్య ఫైట్ బిగ్‌ఫైటేనని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Tags; Kanna vs. Ambati
