కర్ణాటక కేబినెట్ లో ముసలం

Date:12/10/2018
బెంగళూర్  ముచ్చట్లు:
కర్ణాటక రాజకీయాల్లో మరో కుదుపు. సీఎం కుమారస్వామి మంత్రివర్గంలో బీఎస్‌పీ నుంచి కొనసాగుతున్న ఏకైక మంత్రి కేబినెట్ నుంచి తప్పుకున్నారు. విద్యా శాఖ మంత్రి ఎన్ మహేశ్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. సీఎం కుమారస్వామికి  తన రాజీనామా లేఖను సమర్పించారు. రాజీనామాకు వ్యక్తిగత అంశాలే కారణమని మీడియాకు తెలిపారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీఎస్‌పీ తరఫున శక్తివంచన లేకుండా ప్రచారం చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.‘నా నియోజకవర్గంలో నాపై కొంత మంది దుష్ప్రచారం చేస్తున్నారు.
నేను బెంగళూరుకే పరిమితమయ్యాయని, కొల్లెగల్‌ను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నానని నిందారోపణలు చేస్తున్నారు. ఇలాంటి విమర్శకులకు సరైన సమాధానం ఇవ్వడానికే రాజీనామా నిర్ణయం తీసుకున్నా. అదే సమయంలో లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో నా పార్టీని మరింత బలపర్చాల్సిన అవసరం ఉంది’ అని మహేశ్ పేర్కొన్నారు.మంత్రి పదవికి రాజీనామా చేసినా.. కుమారస్వామి ప్రభుత్వానికే తన మద్దతు ఉంటుందని మహేశ్ స్పష్టం చేశారు. అంతేకాకుండా 2 అసెంబ్లీ స్థానాలు, 3 లోక్‌సభ స్థానాలకు నవంబర్ 3న జరగనున్న ఉపఎన్నికల్లో జేడీఎస్ తరఫున ప్రచారం చేస్తానని తెలిపారు. ప్రభుత్వంలో ఎవరిపైనా తనకు కోపం లేదని వివరించారు.
మంత్రిగా తన పదవీ కాలం సంతృప్తిగా ఉందని, వ్యక్తిగత కారణాలే వల్లే రాజీనామా చేశానని స్పష్టం చేశారు.కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్, బీఎస్‌పీ కలిసి పోటీ చేసిన విషయం తెలిసిందే. ఫలితాల అనంతరం కాంగ్రెస్ మద్దతుతో హెచ్‌డీ కుమారస్వామి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీ అవతరించినా ఆ పార్టీ నేత యడ్యూరప్పకు నిరాశే మిగిలింది. అయితే.. ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజుల నుంచే అది ఎంతో కాలం నిలబడదనే వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్ నేతలు కుమారస్వామిని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని, అసంతృప్త ఎమ్మెల్యేల్లో కొందరు ఇప్పటికే బీజేపీతో చేతులు కలిపారని కొంత మంది అంటున్నారు. కుమారస్వామి ప్రభుత్వం ఎంతో కాలం నిలవదని జోస్యం చెబుతున్నారు.
Tags:Karnataka is in the Cabinet

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *