కరుణానిధి కుమార్తె కనిమొళి ప్రత్యక్ష ఎన్నికల బరిలో….

Karunanidhi's daughter Kanimozhi in direct election
Date:19/03/2019
చెన్నై ముచ్చట్లు:
తమిళనాడు లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్న 20 మంది అభ్యర్థుల జాబితాను డీఎంకే ప్రకటించింది. పార్టీలో నవతరానికి పెద్దపీట వేస్తూ కొత్త ముఖాలను బరిలో నిలిపింది డీఎంకే. ఈ జాబితాలో పలువురు డీఎంకే సీనియర్ నేతల వారసులు చోటు దక్కించుకున్నారు. ధివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి కుమార్తె కనిమొళి ప్రత్యక్ష ఎన్నికల బరిలో నిలవనున్నారు. రాజ్యసభలో ప్రాతినిధ్యంవహిస్తూ వచ్చిన కనిమొళి తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. కనిమొళి రాజ్యసభ సభ్యత్వం జులై నెలాఖరుతో ముగియనుంది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఆమె డీఎంకే నేతృత్వంలోని లౌకిక ప్రగతిశీల కూటమి(ఎస్‌పీఏ) అభ్యర్థిగా ట్యూటికోరిన్ నుంచి పోటీ చేయనున్నారు. అన్నాడీఎంకే కూటమి తరఫున ఈ సీటును బీజేపీ దక్కించుకోగా…అక్కడి నుంచి ఆ పార్టీ తమిళనాడు రాష్ట్రాధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్ బరిలో నిలుస్తారు.ట్యూటికోరిన్ నియోజకవర్గంలో నాడార్ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉండడంతో కనిమొళిని వ్యూహాత్మకంగానే అక్కడి నుంచి బరిలోకి దించినట్లు తెలుస్తోంది. కనిమొళి తల్లి అదే సామాజికవర్గానికి చెందడంతో అక్కడ కనిమొళి పోటీ చేస్తుండడం కలిసొస్తుందని డీఎంకే నేతలు అంచనావేస్తున్నారు.డీఎంకే సీనియర్ నేతలు, మాజీ మంత్రులైన దురైమురుగన్ తనయుడు కదిర్ ఆనంద్, ఆర్కాట్ వీరా స్వామి తనయయుడు కళానిధి వీరాస్వామి, ధివంగత తంగపాండ్యన్ కుమార్తె సుమతి అలియాస్ తమిళచ్చి తంగపాండ్యన్, పొన్ముడి తనయుడు గౌతమ సింగనేని డీఎంకే అభ్యర్థుల జాబితాలో చోటు దక్కించుకున్నారు. మొత్తం 20 మంది ఎంపీల్లో ఇద్దరు మహిళలు కనిమొళి, తమిళచ్చి తంగపాండ్యన్ చోటు దక్కించుకున్నారు. 13 మంది కొత్త వారికి సీట్లు కేటాయించగా…పలువురు మాజీ ఎంపీలకు టిక్కెట్ నిరాకరించారు. అయితే పార్టీకి చెందిన మాజీ కేంద్ర మంత్రులందరికీ తిరిగి అవకాశం కల్పించారు.
మాజీ కేంద్ర మంత్రులు టీఆర్ బాలు, దయానిధి మారన్, ఏ.రాజా, జగద్రక్షకన్‌లు సీటు దక్కించుకున్నారు.గత ఏడాది ఆగస్టులో కరుణానిధి మరణం తర్వాత ఆయన తనయుడు ఎంకే స్టాలిన్ నాయకత్వంలో డీఎంకే ఎదుర్కోనున్న తొలి ఎన్నికలు ఇవి. పార్టీ లోక్‌సభ అభ్యర్థులను ప్రకటించడానికి ముందు కరణానిధి సమాధి వద్ద స్టాలిన్ నివాళులర్పించారు. అలాగే అనారోగ్యంతో బాధపడుతున్న పార్టీ వయోవృద్ధుడు కే.అన్బళగన్‌ను స్టాలిన్ మర్యాదపూర్వకంగా ఆయన నివాసంలో కలిశారు. కోటీశ్వరులకే పార్టీ సీట్లు కేటాయించారన్న విమర్శలపై స్పందించిన ఎంకే స్టాలిన్…విజయమే లక్ష్యంగా అభ్యర్థులను ఎంపిక చేసినట్లు చెప్పుకొచ్చారు. ఈ సారి తమిళనాడు, పుదుచ్చేరిలోని మొత్తం 40 స్థానాల్లో 20 స్థానాల్లో డీఎంకే పోటీ చేస్తుండగా…దాని మిత్రపక్షం కాంగ్రెస్ 10 స్థానాల్లో పోటీ చేయనుంది. ఎండీఎంకే తదితర మిగిలిన చిన్నా చితక పార్టీలు మిగిలిన 10 స్థానాల్లో బరిలో నిలుస్తున్నాయి.2014 ఎన్నికల్లో తమిళనాడులోని మొత్తం 39 లోక్‌సభ నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికల్లో జయలలిత నేతృత్వంలోని అన్నాడీఎంకే 37 స్థానాల్లో విజయం సాధించింది. 2004 లోక్‌సభ ఎన్నికల్లో తమిళనాడు, పాండిచ్చేరిలోని మొత్తం 40 స్థానాలను డీఎంకే-కాంగ్రెస్ కూటమి క్లీన్ స్వీప్ చేయగా…ఈసారి కూడా అదే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు ఆ పార్టీల నేతలు చెబుతున్నారు. తమిళనాడు, పాండిచ్చేరిలోని 40 లోక్‌సభ నియోజకవర్గాలతో పాటు తమిళనాడులోని 18 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికల పోలింగ్ వచ్చే నెల 18న జరగనుంది. మే 23న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
Tags:Karunanidhi’s daughter Kanimozhi in direct election

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *