కవితమ్మకు…ఇందూరుకే పరిమితం

-ఫ్యామలీ ఫైట్ నుంచి బయిటపడే ప్రయత్నం
Date:21/11/2018
నిజామాబాద్ ముచ్చట్లు:
ప్రచారానికి సొబగులు అద్దితేనే ఆదరణ. పార్టీల ఎన్నికల గోదాలో ప్రజలను ఆకర్షించాలంటే ప్రాముఖ్యం , ప్రాచుర్యం ఉన్నవారిని పోటీలోకి దింపాలి. లేకపోతే వారి సేవలను ప్రచారంలో వినియోగించుకోవాలి. నెగ్గడం సంగతి పక్కనపెట్టినా పాప్యులారిటీ కారణంగా పార్టీకి కొంత క్రేజ్ తీసుకురావచ్చు. మీడియా కవరేజీ కూడా బాగుంటుంది. అదే ఉద్దేశంతో వ్యూహాత్మకంగా కదులుతున్నాయి ముఖ్యపార్టీలు. అధికార తెలంగాణ రాష్ట్రసమితి మాత్రం పెద్దగా నటీనటులపై దృష్టి పెట్టడం లేదనే చెప్పాలి.
పిలిస్తే వచ్చేందుకు చాలామంది సిద్దంగానే ఉన్నప్పటికీ తమ పొలిటికల్ స్టార్లు చాలనుకుంటోంది. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ జనాదరణ కలిగిన నేతలే. సినిమా వాళ్లను తీసుకుని వస్తే డామినేషన్ తప్ప పెద్దగా ప్రయోజనం లేదనేది అధికార పార్టీ భావన. దీంతో టీఆర్ఎస్ కరుణాకటాక్షణల కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్న టాలీవుడ్ తారలకు పిలుపు రావడం లేదు. తమ పని తాము చేసుకుంటున్నారు.
ఇతర పార్టీలు పిలిచినా అధికారపార్టీతో వైరం తెచ్చుకోవాల్సి వస్తుందని దూరంగా ఉంటున్నారు.అధికార తెలంగాణ రాష్ట్రసమితి ఆలోచన మరో విధంగా ఉంది. సినీ తారలను ప్రచారంలోకి దింపితే సంక్షేమ పథకాలు , ఇతర విషయాల్లో పార్టీ చెప్పే విషయాలకు పెద్దగా ప్రాధాన్యం లభించే అవకాశం తక్కువగా ఉంటుందని భావించారు. అందులోనూ పాప్యులర్ నటుల్లో ఎక్కువ మంది ఆంధ్రప్రాంతానికి చెందినవారే. వారితో ప్రచారం చేయిస్తే తాము చెప్పే ప్రాంతీయ సిద్ధాంతాలకు భిన్నంగా ఉంటుందనే ఆలోచన కూడా ఉంది.
ముఖ్యంగా కేటీఆర్, హరీశ్ వంటి వారు పార్టీ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సమర్థులు. జనాల్ని ఆకర్షించగలుగుతారు. వారితోనే రాష్ట్రస్థాయి ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. కేసీఆర్ సుడిగాలి పర్యటనలు ఎలాగూ ఉండనే ఉన్నాయి. రాహుల్, చంద్రబాబు వంటి రాజకీయ అగ్రనేతలు పర్యటనలు జరిపే ప్రాంతాల్లో సైతం కేటీఆర్, హరీశ్ లే రోడ్డు షోలు, బహిరంగ సభలతో హడావిడి చేసేలా వ్యూహం సిద్దం చేశారు. ఈసారి రాష్ట్రస్థాయి ప్రచారానికి సొంతింటి ఆడపడుచు కవితను సైతం దూరంగా ఉంచడం విశేషం.
కేసీఆర్ కేబినెట్ లో మహిళల ప్రాతినిధ్యం లేకపోవడం, మొత్తం కుటుంబమే రాష్ట్రాన్ని పాలిస్తోందన్న విమర్శల నేపథ్యంలో కవితను నిజామాబాద్ జిల్లాకే పరిమితం చేసినట్లు పార్టీ వర్గాల సమాచారం. మొత్తమ్మీద సినీ ఆకర్షణను పార్టీ నేతలతోనే తిప్పికొట్టించాలని చూడటం విశేషమే.కాంగ్రెసు పార్టీ తమ ప్రధాన ఆకర్షణగా , ప్రచారకర్తగా విజయశాంతిని ఎంపిక చేసుకుంది. సినిమా రంగానికి దాదాపు గుడ్ బై చెప్పిన విజయశాంతి పూర్తికాలపు పొలిటీషియన్ కిందే లెక్క. కాంగ్రెసు పార్టీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యే కావాలనుకున్నారు. రేపొద్దున్న కాలం కలిసివస్తే మంత్రి పదవి వరించే వారిలో ఆమె కూడా ఒకరు. అదే ఉద్దేశంతో రంగంలోకి దిగారు.
తాను శాసనసభకు పోటీ చేస్తానని కూడా ప్రకటించారు. అయితే అధిష్టానం ఆలోచన మరొక విధంగా ఉంది. ప్రచార సభల్లో పాల్గొని పార్టీ మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆమెకు సూచించారు. పార్టీ నెగ్గితే కీలకమైన పదవి ఇవ్వడానికి అభ్యంతరం లేదని అధిష్టానం స్థాయిలోనే హామీ ఇచ్చారు. విజయశాంతిని మాత్రమే నమ్ముకోకుండా తెలుగు ఓటరు ప్రేక్షకులకు బాగా పరిచయమున్న మరో ఇద్దరు తారలను రంగంలోకి దింపుతోంది కాంగ్రెసు. ఇప్పటికే ఖుష్బూ ప్రచారానికి శ్రీకారం చుట్టారు. అధికార పార్టీపై విమర్శలు గుప్పించడంతోపాటు హస్తం పార్టీకి ఆకర్షణను తెచ్చిపెడుతున్నారామె.
ఒకనాటి గ్లామర్ తార నగ్మాను రెండో విడత ప్రచారంలో రంగంలోకి తెచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు.భారతీయ జనతాపార్టీ సంప్రదాయానికి విరుద్దంగా ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తవారికి పెద్ద పీట వేసింది. పార్టీతో సంబంధం లేని వారిని వెతికిపట్టుకుని మరీ టిక్కెట్లు ఇచ్చారు. మొత్తం సీట్లలో పోటీ చేయడమే లక్ష్యంగా బీజేపీ ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. 2014 ఎన్నికల్లో టీడీపీతో పొత్తు కారణంగా అన్నిచోట్ల కాషాయజెండా ఎగరవేయడం సాధ్యం కాలేదు. పార్టీని రాష్ట్ర వ్యాప్తంగా ప్రాచుర్యంలోకి తీసుకెళ్లే అవకాశం లభించలేదు. రాష్ట్ర అవతరణ తర్వాత తొలిసారిగా రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ తనదైన శైలిలో ప్రచార కార్యక్రమాలను తీసుకుంటూ ముందుకు వెళుతోంది.
టీఆర్ఎస్, మహాకూటమి దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ ముఖాముఖి తలపడుతున్నాయి. రాష్ట్రంలో పది పన్నెండు నియోజకవర్గాలను మినహాయిస్తే మిగిలిన చోట్ల టీఆర్ఎస్, కూటములదే పోటాపోటీ. అయితే బీజేపీ , బీఎల్ఎఫ్ వంటి పార్టీలూ తమ ఉనికిని చాటుకునే అవకాశం ఉంది. కనీసం పది స్థానాల్లో గెలుపు సాధించాలనే లక్ష్యంతో బీజేపీ ప్రచార వ్యూహం సిద్ధం చేసుకుంది.
దాంతోపాటు పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ డిపాజిట్లు సాధించాలనే ప్రయత్నం చేస్తోంది. హేమమాలిని, స్మృతి ఇరాని వంటి రాజకీయ సినీ తారలతోపాటు సాయి కుమార్ ను వినియోగించుకోవాలని భావిస్తోంది. ప్రజల్లో విస్తృత ప్రచారానికి ఇది దోహదపడుతుందని బీజేపీ నాయకులు గట్టిగా నమ్ముతున్నారు.
Tags; Kavithamma … is limited to that

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *