కొండా దంపతులకు కేసీఆర్ హామీ

KCR for Konda couple

KCR for Konda couple

Date:17/09/2018
వరంగల్ ముచ్చట్లు:
వరంగల్‌ జిల్లాలో కీలకనేతలైన కొండా దంపతులు టీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతారా.. పార్టీ అధిష్టానం ఆ మేరకు త్వరగా నిర్ణయం తీసుకోనుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇటీవల అభ్యర్థులకు పార్టీ టికెట్లు కేటాయించడంలో భాగంగా వారికి జరిగిన అవమానాన్ని సరిదిద్దేందుకు టీఆర్ఎస్ అధ్యక్షుడు, అపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ రంగంలోకి దిగినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం అవుతోంది. గణపతి నవరాత్రుల అనంతరం కొండా దంపతులు కేసీఆర్‌ను కలుసుకోనున్నారు.
అసెంబ్లీని రద్దు చేసుకున్న కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు కసరత్తులు మొదలుపెట్టారు. ఇందులో భాగంగా 105 మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు టికెట్లు ఖరారు చేసి, వరంగల్‌ తూర్పు నియోజకవర్గంలో సురేఖ అభ్యర్థిత్వాన్ని పెండింగ్‌లో పెట్టిన విషయం తెలిసిందే. పార్టీ అధిష్టానం నుంచి దీనిపై వివరణ రాకపోవడాన్ని కొండా సురేఖ, కొండా మురళీ దంపతులు అవమానంగా భావించారు.
విలేకరుల సమావేశంలో పాల్గొన్న కొండా దంపతులు తమ తప్పు ఏంటో చెప్పాలని, తన టికెట్‌ పెండింగ్‌ పెట్టడానికి కారణాలు ఏమిటో చెప్పాలని, లేదంటే బహిరంగ లేఖ రాసి టీఆర్‌ఎస్‌ను వీడుతానని అల్టిమేటం జారీ చేశారు. పార్టీకి చెందిన కీలకనేత వీరికి ఫోన్ తొందరపాటు నిర్ణయాలు వద్దని సూచించినట్లు సమాచాం. దీంతో కొండా దంపతులు కాస్త వెనక్కి తగ్గారు.
మరోవైపు ప్రతి జిల్లాలోనూ కీలకనేతల అవసరం పార్టీకి ఉందని భావించిన అధిష్టానం కొండా కుటుంబం సీట్లను కోల్పోవద్దని పునరాలోచించింది. చిన్న కారణాలతో జిల్లా జిల్లాలో ఇలా ఒకటి, రెండు సీట్లు కోల్పోవడం పార్టీకి మంచిది కాదని నేతలు కేసీఆర్‌కు సూచించినట్లు సమాచారం.
కొండా దంపతులకు టికెట్లు ఇవ్వకపోవడం కారణంగా ప్రత్యక్షంగా వరంగల్‌ తూర్పు, పశ్చిమతో పాటు పరకాల, భూపాలపల్లి నియోజకవర్గాలను, పరోక్షంగా జిల్లాలోని మరిన్ని నియోజకవర్గాలపై ప్రభావం పడవచ్చునని ఇంటెలిజెన్సీ వర్గాలు హెచ్చరించాయి.  కొండా దంపతులను కేసీఆర్ ఫోన్లో సంప్రదించారని, రాజకీయ భవిష్యత్తుపై బెంగ అక్కర్లేదని భరోసా కల్పించారట.
వరంగల్‌ తూర్పు నియోజకవర్గం కేటాయిస్తామని, మరో టికెట్ మీద కచ్చితమైన హామీ ఇవ్వలేమని చెప్పినట్లు తెలుస్తోంది. రెండో టికెట్ రాలేదని బాధపడొద్దని, అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైనా పదవి ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నారు. అయితే వినాయక చవితి నవరాత్రులను తమకు కీడు దినాలుగా భావించే కొండా దంపతులు ఏ కార్యక్రమాల్లో పాల్గొనరు. నవరాత్రుల తర్వాత కేసీఆర్‌తో భేటీతో కొండా దంపతులు తమ నిర్ణయాన్ని ప్రకటించనున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
Tags:KCR for Konda couple

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *