ఏప్రిల్ నుంచి 9 జిల్లాల్లో కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకం.
హైదరాబాద్ ముచ్చట్లు:
ఈ ఏడాది ఏప్రిల్ నుంచి 9 జిల్లాల్లో కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకం అమలు చేయబోతున్నామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా కేసీఆర్ కిట్ పథకం అమలుపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి హరీశ్‌రావు సమాధానం ఇచ్చారు.కేసీఆర్ కిట్ పథకం ప్రవేశపెట్టిన తర్వాత ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగిందని మంత్రి తెలిపారు. ఈ పథకం కింద 2017, జూన్ 2వ తేదీ నుంచి ఇప్పటి వరకు 13 లక్షల 29 వేల 951 మందికి లబ్ధి చేకూరింది. ఈ పథకం అమలు కోసం రూ. 1387 కోట్ల 19 లక్షలు ఖర్చు చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో మాతా శిశు ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు, ప్రత్యేక నవజాత శిశు సంరక్షణ కేంద్రాలను పటిష్టం చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో మహిళల సంక్షేమం, అభివృద్ధి కోసం ఈ పథకాన్ని తీసుకొచ్చారు. ఈ పథకం ఫలితాలు అద్భుతంగా ఉన్నాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో 30 శాతం ఉంటే.. ప్రసవాల సంఖ్య 54 శాతానికి పెరిగిందన్నారు.గతంలో ప్రసవాలకు వచ్చిన తల్లుల మరణాలు ప్రతి లక్షకు 94 ఉండేదని తెలిపారు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ కిట్ అమలుతో తల్లుల మరణాలు ఇవాళ 63కు తగ్గించామన్నారు. శిశు మరణాలను కూడా తగ్గించుకున్నామని తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక వసతులను పెద్ద ఎత్తున కల్పించామన్నారు. కొత్తగా 23 మాతా శిశు సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. న్యూట్రిషన్ కిట్ పథకం త్వరలో అమలు చేయబోతున్నామని స్పష్టం చేశారు. గర్భిణీ స్త్రీలు రక్తహీనతతో బాధపడుతున్నారు. ఇలాంటి వారికి న్యూట్రిషన్ కిట్ అందిస్తామన్నారు. కుమ్రం భీం, ఆదిలాబాద్, భూపాలపల్లి, భద్రాద్రి, కామారెడ్డి, వికారాబాద్, గద్వాల్, నాగర్‌కర్నూల్, ములుగు జిల్లాల్లో కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకాన్ని అమలు చేయబోతున్నామని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు.
Tags:KCR Nutrition Kit scheme in 9 districts from April