ఖమ్మంలో మార్చి 25న కేసీఆర్ పర్యటన

KCR tour in Khammam on March 25

KCR tour in Khammam on March 25

Date:14/03/2019
ఖమ్మం ముచ్చట్లు:
లోక్సభ ఎన్నికల దృష్ట్యా సీఎం కేసీఆర్ ఈనెల 25, 26 తేదీల్లో ఖమ్మం లోక్ సభ నియోజకవర్గంలో పర్యటించనున్నట్లు సమాచారం.  ఈ మేరకు సమాచారం అందుకున్న పార్టీ నేతలు ప్రచార సభలకు ఏయే ప్రాంతాలను ఎంపిక చేయాలనే అంశంపై కసరత్తు చేస్తున్నారు. తొలుత క్షేత్రస్థాయి ఎన్నికల ప్రచారంపై దృష్టి సారించిన టీఆర్ఎస్.. లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఈనెల 16వ తేదీన ఖమ్మంలో టీఆర్ఎస్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ నేతృత్వంలో జరగాల్సిన ఎన్నికల సన్నాహక సమావేశాన్ని సైతం రద్దు చేసుకుంది.
ఎన్నికలకు సమయం సమీపించడం.. ప్రవర్తనా నియమావళి అమలులోకి రావడం.. జిల్లావ్యాప్తంగా పలుచోట్ల బహిరంగ సభలు నిర్వహించాల్సిన అవసరాన్ని గుర్తించిన పార్టీ నేతలు 16న జరగాల్సిన సమావేశాన్ని రద్దు చేసినట్లు తెలుస్తోంది. అదేరోజు ఉదయం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మూడు నియోజకవర్గాల పరిధిలో ఉన్న మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గ సన్నాహక సమావేశం సైతం రద్దయింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 నియోజకవర్గాల పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేసేందుకు కేటీఆర్ సభ ఉపయోగపడుతుందని నేతలు భావించారు.
అయితే ఎన్నికల సమయం ముంచుకురావడంతో ఖమ్మం, మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గాలపై టీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ దృష్టి సారించినట్లు ప్రచారం జరుగుతోంది.
ఈనెల 25, 26 తేదీల్లో సీఎం కేసీఆర్ ఖమ్మం లోక్ సభ నియోజకవర్గంలోని ఒకటి, రెండు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు అవకాశం ఉందని సమాచారం. జిల్లా కేంద్రమైన ఖమ్మంతోపాటు ఖమ్మం లోక్సభ పరిధిలో ఉన్న కొత్తగూడెం లేదా అశ్వారావుపేటలో కేసీఆర్ ఎన్నికల ప్రచార సభ నిర్వహించేందుకు గల అవకాశాలను పార్టీ నేతలు పరిశీలిస్తున్నట్లు తెలిసింది.
వేడెక్కిన రాజకీయ వాతావరణం  ఎన్నికల షెడ్యూల్ విడుదలైన వెంటనే జిల్లాలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఆయా రాజకీయ పక్షాలు ఈ ఎన్నికల్లో తమ గెలుపు గుర్రాలను ఎంచుకునే పనిలో నిమగ్నం కాగా.. ఆయా పార్టీలకు చెందిన పలువురు నేతలు ఎంపీగా ఖమ్మం లోక్ సభ నుంచి బరిలోకి దిగేందుకు పార్టీల నుంచి గ్రీన్ సిగ్నల్ పొందేందుకు తమవంతు ప్రయత్నాలను ముమ్మరం చేశారు.
ఈనెల 16న కేటీఆర్ ఖమ్మం జిల్లా కేంద్రంలో పర్యటించి.. పెవిలియన్ గ్రౌండ్లో జరిగే ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారని తొలుత కార్యక్రమం ఖరారైంది. ఆదివారం ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో స్వల్ప వ్యవధిలోనే బహిరంగ సభలు, సన్నాహక సభలు వేర్వేరుగా నిర్వహించడం వల్ల ఎదురయ్యే ఇబ్బందులు, క్షేత్రస్థాయిలో ప్రచారానికి కలిగే ఆటంకాలను పరిగణనలోకి తీసుకున్న టీఆర్ఎస్ నేతలు ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభకే మొగ్గు చూపినట్లు ప్రచారం జరుగుతోంది.
Tags:KCR tour in Khammam on March 25

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *