జల విలయంలో అల్లాడుతున్న కేరళ ప్రజలు

Kerala people fluttering in water

Kerala people fluttering in water

 Date:18/08/2018
తిరువనంతపురం ముచ్చట్లు:
కేరళపై ప్రకృతి కన్నెరజేసింది. గత వందేళ్లలో ఎన్నడూ లేనంతగా వరదలు రాష్ట్రాన్ని ముంచెత్తాయి. ఈ విపత్తుతో కేరళ పరిస్థితి అత్యంత దారుణంగా మారిపోయింది.  భారీ వర్షాలు, వరదలతో రాష్ట్రం జల విలయంలో చిక్కుకుని అల్లాడుతోంది. చాలా చోట్ల ప్రజలు వరదల్లో చిక్కుకుపోయి ఆహారం, నీరు లేక సహాయం కోసం దీనంగా ఎదురుచూస్తున్నారు.
ఇప్పటికే దాదాపు 324 మంది ప్రాణాలు కోల్పోయారు. 3.14లక్షల మంది పునరావాస శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్నారు. రవాణా వ్యవస్థలన్నీ నాశనమైపోయాయి. ఇంతటి దీనావస్థలో ఉన్న కేరళకు పలు రాష్ట్రాలు, ప్రముఖులు చేయూత ఇస్తున్నారు. త్రివిధ దళాలు ప్రజలను కాపాడేందుకు ముమ్మర సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి.
రాష్ట్రానికి సుమారు రూ.25వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని కేరళ సీఎం పినరయి విజయన్‌ తెలిపారు.రాష్ట్రంలో వర్షాలు ఇంకా కురుస్తూనే ఉన్నాయి. 14 జిల్లాల్లోని 11 జిల్లాల్లో మళ్లీ రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించడంతో కేరళ వాసులు ఆందోళన పడుతున్నారు.కాగా నేడు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కేరళ పరిస్థితిపై సమీక్షించారు.
వరద ప్రభావిత ప్రాంతాలపై ఏరియల్‌ సర్వే చేశారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌, కేంద్ర మంత్రి కేజే ఆల్ఫోన్స్‌ తదితర నేతలతో సమావేశమై చర్చించిన అనంతరం మోదీ రూ.500కోట్ల సాయం ప్రకటించారు. కేరళలో సహాయక చర్యలు అందిస్తున్న సిబ్బందిని మోదీ ప్రశంసించారు. రాష్ట్ర ప్రజలు వరదలకు ఎదురీది పోరాడుతున్న స్ఫూర్తిని మెచ్చుకున్నారు. అయితే కేరళ ప్రభుత్వం కేంద్రాన్ని రూ.2వేల కోట్లు సాయం చేయాలని డిమాండ్‌ చేస్తోంది.
* కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ కేరళ వరదలను తక్షణమే జాతీయ విపత్తుగా ప్రకటించాలని ప్రధాని మోదీని కోరారు. ‘డియర్‌ పీఎం, దయచేసి కేరళ వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించండి. ఎంతో మంది ప్రజల జీవితాలు, జీవనాధారాలు, లక్షల మంది భవిష్యత్తు ప్రమాదంలో ఉంది’ అని రాహుల్‌ ట్వీట్‌ చేశారు.
* కేరళ వరద బాధితుల కోసం ఆహారం, మంచి నీరు సరఫరా చేసేందుకు ప్రత్యేక రైలు ఈరోజు మహారాష్ట్రలోని పుణె నుంచి బయలుదేరుతోంది. కేరళలోని చిన్నారుల కోసం.. వంద టన్నుల ఆహార పొట్లాలను పంపిస్తున్నట్లు కేంద్ర మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనక గాంధీ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం వంద మెట్రిక్‌ టన్నుల బాలామృతాన్ని కేరళకు పంపిస్తోంది.
* బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ కేరళకు రూ.10కోట్ల సహాయం ప్రకటించారు. హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టార్‌ రూ.10కోట్ల సాయం ప్రకటించారు. కేరళకు తెలంగాణ సర్కారు రూ.25కోట్లు, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రూ.10కోట్ల విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే. దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ రూ.10కోట్ల సాయం ప్రకటించారు. ఆమ్‌ ఆద్మీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఒక నెల జీతాన్ని కేరళ సహాయ నిధికి ఇవ్వనున్నారు. అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌ కేరళ బాధితుల కోసం రూ.కోటి విరాళంగా ప్రకటించారు. స్టేట్‌ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా రూ.2కోట్ల సాయం ప్రకటించింది.
* గుజరాత్‌ ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీ రూ.10కోట్లు ఆర్థికసాయం అందజేయనున్నట్లు తెలిపారు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ రూ.5కోట్ల సాయం ప్రకటించారు. అలాగే సహాయక చర్యలు అందించేందుకు 245మంది అగ్నిమాపక సిబ్బందిని పంపిస్తున్నట్లు తెలిపారు. వీరంతా వరదల సమయంలో సహాయక చర్యలు చేపట్టడానికి శిక్షణ పొందిన వారని, అనుభవం ఉన్నవారని చెప్పారు. ఈ బృందం 75బోట్లను కూడా తీసుకెళ్తోంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవిస్‌ రూ.20కోట్ల సాయం ప్రకటించారు. ఇక కాంగ్రెస్‌ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఒక రోజు జీతాన్ని కేరళకు సాయంగా ఇవ్వనున్నారని ఏఐసీసీ తెలిపింది.
* సహాయక చర్యల్లో ఆర్మీ, నావికా దళం, వైమానిక దళాలతో పాటు ఎన్డీఆర్ఎఫ్‌ బృందాలు, స్థానిక యువకులు పాల్గొంటున్నారు. కేరళలో 58 ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయని ఎన్డీఆర్‌ఎఫ్‌ డీజీ సంజయ్‌ కుమార్‌ తెలిపారు. సహాయక సామాగ్రిని అన్ని జిల్లాలకు తరలిస్తున్నారని చెప్పారు. ఎన్డీఆర్ఎఫ్‌ ఏడు వేల మందిని కాపాడిందని, అత్యవసర సహాయం కావాల్సి ఉన్న 150 మందిని సురక్షితంగా రక్షించిందని తెలిపారు.
* ఆర్మీ, నేవీ, కోస్ట్‌గార్డుల కోసం ఈరోజు అదనంగా 75 మోటరైజ్డ్‌ పడవలను, సాధారణ పడవలను, మరో 8 హెలికాప్టర్లను పంపించారు. ఆహార ప్యాకెట్లు కూడా సరఫరా చేశారు. కొచ్చిలో మూడు వేల మంది కోసం కమ్యూనిటీ కిచెన్‌ను నడిపిస్తున్నారు. నావికా దళానికి చెందిన 42 బృందాలు, కోస్ట్‌గార్డు 28 బృందాలను పంపించింది. వీరు మోటారు పడవలతో సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. వాయుసేన 23 హెలికాప్టర్లు, 11 సరకు రవాణా విమానాలతో సేవలు అందిస్తోంది.
Tags:Kerala people fluttering in water

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *