సోమేష్ కు కీలక పదవి
విజయవాడ ముచ్చట్లు:
సోమేష్ కుమార్ నిన్న మొన్నటి వరకూ తెలంగాణ ప్రభుత్వ సీఎస్. విభజన సమయంలో ఆయనను ఆంధ్రాకు కేటాయించినా సోమేష్ కుమార్ మాత్రం ససేమిరా ఏపీకి వెళ్లేది లేదంటూ క్యాట్ ను ఆశ్రయించి తెలంగాణలోనే కొనసాగుతూ వచ్చారు. అయితే చివరాఖరకు కోర్టు తీర్పుతో ఆయన అనివార్యంగా ఏపీకి వెళ్లాల్సి వచ్చింది. అప్పుడు కూడా ఆయన ఏపీలో రిపోర్ట్ చేసి ఆ తరువాత పదవీ విరమణ చేస్తారనీ, బీఆర్ఎస్ లో చేరుతారనీ, లేదా తెలంగాణ ప్రభుత్వమే ఆయనను ఏదో ఒక సలహాదారు పదవిలో అకామిడేట్ చేస్తుందంటూ వార్తలు వచ్చాయి.అయితే అందరి అంచనాలు, ఊహలకు భిన్నంగా సోమేష్ కుమార్ ఏపీలో సెటిల్ అవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఒక విధంగా ఇది ఆశ్చర్యకర పరిణామమే. ఏపీలో పని చేయనని భీష్మించుకు కూర్చున్న సోమేష్ కుమార్ కోర్టు తీర్పుతో అనివార్యంగా ఏపీ వెళ్లినా అక్కడి జగన్ ప్రభుత్వం ఆయనను కీలక పోస్టులోనే నియమించడానికి సుముఖత వ్యక్తం చేయడం కూడా ఆశ్చర్యమే. ఏది ఏమైనా సోమేష్ కుమార్ ఏపీలోన సెటిల్ కావడానికే నిర్ణయించుకున్నారు.ఏపీ సర్కార్ కూడా ఆయనకు పోస్టింగ్ ఇచ్చేందుకు నిర్ణయించుకుంది. అయితే ఈ మొత్తం వ్యవహారం వెనుక బీఆర్ఎస్ ఏపీలో కాలూనడం ప్రధాన కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
పైకి ఎలా ఉన్నా ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రుల మధ్య ఉన్న స్నేహ సంబంధాలు అందరికీ తెలిసిందే. కేసీఆర్ బీఆర్ ప్రకటించగానే.. వైసీపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు ఆ పార్టీకి ఏపీలో రెడ్ కార్పెట్ అంటూ ఆహ్వానం పలికారు.ఆ తరువాతే.. జాయినై కోర్టు తీర్పును సుప్రీంలో సవాల్ చేసే అవకాశం ఉన్నా సోమేష్ ఆ ఆప్షన్ ఎంచుకోకుండా ఏపీలో తన కంటే జూనియర్ అయిన అధికారికి రిపోర్టు చేయడమే కాకుండా పోస్టు చిన్నాదా పెద్దదా అనే ఆలోచన లేకుండా ఏ పొజిషిన్ ఇచ్చినా అభ్యంతరం లేదని చెప్పడంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ ఏడాది డిసెంబర్ లో సోమేష్ కుమార్ పదవీ విరమణ చేయనున్నారు. ఇప్పటి వరకూ సోమేష్ కుమార్ కు ఫలానా పోస్టు అంటూ ఏపీ సర్కార్ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయకపోయినా.. నేడో రేపో ఏదో ఒక కీలక పోస్టింగ్ ఇవ్వనున్నట్లు ఏపీ అధికార వర్గాలు చెబుతున్నాయి.

Tags: Key position for Somesh
