ఏపీ సర్కార్ తో కియా ఒప్పందం

Kia deal with AP Sarkar

Kia deal with AP Sarkar

Date:06/12/2018
విజయవాడ ముచ్చట్లు:
ప్రముఖ కార్ల తయారీ సంస్థ కియా ఏపీ సర్కార్‌తో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. ఫ్యూచర్ మొబిలిటీ పార్టనర్‌షిప్‌‌ ‘భవిష్యత్ తరం పర్యావరణ రవాణా’పై ఎంవోయూ చేసుకుంది. ఈ అవగాహన ఒప్పందంపై ఏపీఐఐసీ ఎండీ ఎ. బాబు.. కియా మోటర్స్ సీఈవో షిమ్ సంతకాలు చేశారు. గురువారం అమరావతిలో జరిగిన కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రులు, అధికారులు.. కియా మోటార్స్ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం సచివాలయంలో ఎలక్ట్రిక్‌ ఛార్జింగ్‌ స్టేషన్‌, ఎలక్ట్రిక్‌ కార్లను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. కియా సంస్థ ఏపీ సర్కార్‌కు మూడు రకాల కార్లను  బహుమతిగా ఇచ్చింది. కారు తాళాలు ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందజేశారు. ఈ కార్లను సీఎం టెస్ట్ డ్రైవ్ చేశారు. కియా ఎలిక్ట్రిక్ కార్లకు ఒక్కసారి ఛార్జింగ్‌ చేసుకుంటే 455 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేసే వీలుంటుంది. త్వరలో విజయవాడలో వెహికల్‌ ఛార్జింగ్‌ స్టేషన్లను కియా మోటార్స్‌ ఏర్పాటు చేయనుంది. పరిశ్రమలను ప్రోత్సహించడానికి కియా ఏపీకి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉపయోగపడుతోందని వ్యాఖ్యానించారు సీఎం. వెనుకబడిన అనంతపురం జిల్లా జాతకం కియా రాకతో పూర్తిగా మారిపోయిందన్నారు. ఇసుజు, హీరో, భారత్ ఫోర్జ్, అశోక్ లేల్యాండ్, అమర్‌రాజా వంటి ఆటో రంగ సంస్థలతో ఏపీ ఆటోమొబైల్ హబ్‌గా మారిందన్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్రానికి పెట్టుబడులు భారీగా వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపీని పర్యావరణహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామన్నారు సీఎం చంద్రబాబు. కాలుష్యాన్ని తగ్గించేందుకు ఎలక్ట్రానిక్ కార్లు ఎంతో దోహదపడతాయన్నారు. భవిష్యత్‌లో యూనిట్‌ సౌర విద్యుత్ రూపాయిన్నరకే లభిస్తుందని.. ఆ దిశగా ఏపీ ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు.
Tags:Kia deal with AP Sarkar

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *