Natyam ad

కారు పార్టీలో కిరికిరి

వరంగల్ ముచ్చట్లు:


కారు పార్టీలో మరో కిరికిరి షురూ అయింది. కొత్త, పాత నేతలతో ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో పరిస్థితి హాట్‌హాట్‌గా తయారైంది. ఎన్నికల సంవత్సరం దగ్గర పడుతుండడంతో నేతలు కయ్యానికి కాలుదువ్వుతున్నారు. నువ్వెంతంటే నువ్వెంత అంటూ రెచ్చిపోతున్నారు. కాకలు తీరిన సీనియర్ నేతలు సైతం సై అంటే సై అంటూ ముందుకు దూసుకొస్తున్నారు. అటు టీడీపీ.. ఇటు కాంగ్రెస్ నుంచి వచ్చిన నేతలతో కారు పార్టీ కితకితలాడుతుండడంతో వచ్చే ఎన్నికల్లో సీటు ఎవరికి దక్కుతుందో తేల్చుకునేందుకు ఇప్పటి నుంచే ఎన్నికల రణరంగంలోకి దూకుతున్నారు. పదునైన మాటల తూటాలతో విరుచుకుపడుతున్నారు. తాజాగా జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్‌లోనూ అదే సీన్ రిపీట్ అయ్యింది. మాజీ డిప్యూటీ సీఎంలుగా పనిచేసిన సీనియర్ నేతలు ఎమ్మెల్యే సున్నం రాజయ్య.. మాజీ మంత్రి కడియం శ్రీహరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. నువ్వెంతంటే నువ్వెంతంటూ ఈ మాజీ డిప్యూటీ ముఖ్యమంత్రులు మాటల దాడికి దిగడం హాట్ టాపిక్‌గా మారింది.. ఎన్నికలకు కేవలం ఏడాదే ఉండటంతో ఎమ్మెల్యే సీటు కోసం బహిరంగంగానే విమర్శలకు దిగుతున్నారు. స్టేషన్ ఘన్‌పూర్ కడియం అడ్డానా..? లేక రాజయ్య అడ్డానా..? తేల్చుకుందామంటూ సవాళ్లు విసురుకుంటున్నారు. 2023 ఎన్నికల్లో స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే టికెట్ తమదంటే తమదంటూ ఇరువురు నేతలు మైకుల ముందుకొచ్చి మాట్లాడటమే ఇప్పుడు తాజా వివాదానికి కారణమైనట్లు తెలుస్తోంది.

 

 

 

సోమవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కడియం శ్రీహరిపై ఎమ్మెల్యే రాజయ్య చేసిన ఘాటు వ్యాఖ్యలు హీట్ రాజేశాయి. భార్యతో తన్నులు తిన్నోడివి నీకు భయపడేది ఏంటంటూ రాజయ్య ఎద్దేవా చేశారు. అంతటితో ఆగని ఆయన వందల మంది నక్సలైట్లను చంపించాడంటూ ఘాటు వ్యాఖ్యలు చేయడంతో వివాదం మరింత ముదిరింది. రాజయ్య చేసిన వ్యాఖ్యలపై తొలుత మంగళవారం ఉదయం ప్రెస్‌మీట్ పెట్టిన కడియం శ్రీహరి ‘మొన్నటి ఎన్నికల్లో రాజయ్య గెలుపు కోసం తామంతా ఎంతో కష్టపడ్డాం. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రాజయ్య నియోజకవర్గ ప్రజలకు ఏం చేశారో చెప్పాలి. రాజయ్యకు పార్టీలో ఏదైనా సమస్య ఉంటే అధిష్టానానికి చెప్పుకోవాలి. నాపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని బేషరతుగా క్షమాపణలు చెప్పాలి. రాజయ్య చేసిన వాటికి నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. వాటన్నింటిని బయటపెడితే తిరగలేడు’ అని హెచ్చరించారు కడియం శ్రీహరి తనను హెచ్చరించడంతో రెచ్చిపోయిన రాజయ్య కౌంటర్ ఇచ్చేందుకు విలేకర్ల సమావేశం నిర్వహించారు. ‘కడియం శ్రీహరి టీడీపీ హయాంలో మంత్రిగా చేసి వందల మంది నక్సలైట్లను పొట్టనపెట్టుకున్నాడు. ఎస్.ఘన్‌పూర్ నా గడ్డ.. నా అడ్డా. నేను పుట్టింది ఘన్‌పూర్‌లోనే రేపు చచ్చినా అక్కడే అంతిమ సంస్కారం జరుగుతుంది. 1994 ముందు ఆ తర్వాత కడియం శ్రీహరి ఆస్తులు ఏంటి.. కడియం చీకటి బతుకులు టీడీపీ నాయకులను అడిగితే చెబుతారు. ఆయనంత సమర్థుడు అయితే ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకోవాలి’ అంటూ సవాల్ విసిరారు. స్టేషన్ ఘన్‌పూర్‌లో సర్వే మనం చేయాల్సిన అవసరం లేదని, ముఖ్యమంత్రే సర్వే చేసి ఎవరికి సీటు ఇవ్వాలో ఆయనే నిర్ణయిస్తారని రాజయ్య ధీమా వ్యక్తం చేశారు. మొత్తానికి ఇద్దరు సీనియర్ నేతల మధ్య మాటల యుద్ధంతో కారు పార్టీలో లుకలుకలు మొదలయ్యాయంటూ జోరుగా చర్చ నడుస్తోంది.

 

Post Midle

Tags: Kirikiri at the car party

Post Midle

Leave A Reply

Your email address will not be published.