టిడిపిలోకి కిశోర్ చంద్రదేవ్

Kishore Chandra Devi in TDP
Date:12/02/2019
న్యూ ఢిల్లీ ముచ్చట్లు:
కాంగ్రెస్ పార్టీ లో ఒకపుడు పేరున్న ఉత్తరాంధ్ర నాయకుడు, పలు మార్లు కేంద్ర మంత్రి మాజీ అరకు ఎంపి కిశోర్ చంద్రదేవ్ రాజకీయ భవితవ్యం మీద సస్పెన్స్ వీడింది. ఆయన టిడిపిలో చేరుతున్నట్లు ప్రకటించారు.కాంగ్రెస్ కు రాజీనామా చేశాక ఆయన ఏ పార్టీలోచేరతారనే దానిమీద చాలా వూహగానాలు వినిపించాయి. సిపిఎం లో చేరతారని కూడా వినిపించింది. ఏ పార్టీలో చేరరు కమ్యూనిస్టుల, జనసేన సహాయం తీసుకుని ఇండిపెండెంటుగా పోటీ చేస్తారని వార్తలొచ్చాయి.అయితే, ఈరోజు సస్పెన్స్ వీడింది. ఆయన ఢిల్లీలో తెలుగుదేశం అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తాను టిడిపిలో చేరుతున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో తెదేపా తప్ప మరో ప్రత్యామ్నాయ పార్టీ ఏముందనన్నారు. అయితే, ఎక్కన్నుంచి పోటీ చేస్తాననే విషయం ప్రస్తావనకు రాలేదన్నారు. 1977లో ఆయన తొలిసారి ఎంపిగా గెలిచారు. పార్వతీపురం లోక్ సభ స్థానానికి నాలుగు సార్లు ప్రాతినిధ్యం వహించాక, 2009 లో అంటే నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ తర్వాత ‘అరకు’ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు.1979లోనే ఇందిరాగాంధీ నాయకత్వంలో బొగ్గు గనులు, ఉక్కు శాఖ సహాయ మంత్రి అయ్యారు.
2011లో యుపిఎ ప్రభుత్వంలో గిరిజన సంక్షేమం, పంచాయతీ రాజ్ శాఖ క్యాబినెట్ మంత్రి అయ్యారు.చాలా పార్లమెంటరీ కమిటీల కు నాయకత్వం వహించి యోగ్యుడని పేరుపొందారు. 2008లో ఓటుకు నోటు కేసు వివాదం మీద వేసిన పార్లమెంటరీ కమిటీకి ఛెయిర్మన్ గా ఉన్నారు. ఒక సారి రాజ్యసభ సభ్యుడు కూడా అయ్యారు. కాంగ్రెస్ లో నిబద్ధత కలిగిన నాయకుడు, అవసరమయినపుడు పార్టీ ని విమర్శించడానికి కూడా వెనకాడరు అని పేరు తెచ్చుకున్నారు.కిరణ్ కుమార్ రెడ్డి హాయంలో రాష్ట్రంలో పాలనా తీరు మీద విమర్శలు చేసి సంచలనం సృష్టించారు. ఎంపి విభజన తర్వాత ఆయన పూర్తిగా క్రియారహితం అయ్యారు. ఒక దశలో పిసిసి అధ్యక్షుడిని మార్చాలని కూడా ఆయన హైకమాండ్ కు సూచించారు.ఇలాంటి వ్యక్తి ఇపుడు కాంగ్రెస్ పార్టీ నుంచి తప్పుకుంటున్నారు. రాహుల్ గాంధీ స్వయంగా పోన్ చేసి పార్టీ నుంచి తప్పుకోవాలన్న ఆలోచన మానుకోవాలని కోరారు. అయితే ఆయన తన నిర్ణయం మార్చుకోలేదు.పదిహేనేళ్ల కిందట ప్రఖ్యాత కమ్యూనిస్టు నేత సిహెచ్ రాజేశ్వరరావు కూడా తెలంగాణలో టిడిపిలో చేరి అసెంబ్లీకి గెలుపొందారు. ఇలాంటి వింతలు టిడిపిలో చరిత్రలో చాలా ఉన్నాయి. ఇపుడు ఇదొకటి.సాధారణంగా ఇలాంటి గత చరిత్ర వదులుకుని ప్రత్యర్థి పార్టీలో చేరిన వాళ్లు చాలా తొందరగా కనుమరుగయిపోతారు.
ఎన్నికల్లో గెలువచ్చేమోగాని, వాళ్లకి పెద్ద గౌరవ మర్యాదలు దక్కకపోవచ్చు.ఎందుకంటే, వీళ్లంతా బాగా వయసు పైబడ్డ వాళ్లు, పైగా నిజాయితీపరులని పేరు. చాలా మంది అప్పటికే పార్టీలో ఉన్న సీనియర్లను కాదని కిశోర్ చంద్రదేవ్ కు చంద్ర బాబు ప్రత్యేక ఇచ్చే గౌరవమేముంటుంది? అందువల్ల ఈ వయసులో ఆయన పార్టీ మారి రాజ్యసభలోనో, లోక్ సభలోనో కాలుమోపవచ్చు. అయితే, వాళ్లకి వాయిస్ లేకుండా పోతుంది. కిశోర్ చంద్రదేవ్ కు సుదీర్ఘ కాంగ్రెస్ రాజకీయ చరిత్ర ఉంది. ఉదాహరణకు తెలంగాణలో కాంగ్రెస్ ను వదలి టిఆర్ ఎస్ లో చేరిన ఇద్దరు సీనియర్ కాంగ్రెస్ నాయకులు కె కేశవరావు, డి శ్రీనివాస్ ఏమయ్యారు?  గొంతును ఆయుధం చేసుకుని రాజకీయాల్లో జీవించిన కెకె గొంతు నొక్కేశారు. ఆయనకు మిగిలింది, రాజ్యసభసీటే. ఇంట్లో మరొకరికి ఎమ్మెల్యే టికెట్ కూడా ఇప్పించుకోలేని పరిస్థితి.డి శ్రీనివాస్ పరిస్థితి ఏంటి?ఆయన ఇపుడు ఏమయ్యాడో, ఎక్కడున్నాడో కూడా తెలియదు. టిఆర్ ఎస్ నూ వదిలేశాడు, సొంతఇంటికొస్తున్నానంటూ మళ్లీ  కాంగ్రెస్ లో చేరేందుకు ప్రయత్నం చేశారు. తర్వాత ఏమయిందో ఏమో ఆయన రాజకీయ రాడార్ లో కనిపించడమే లేదు.కిశోర్ చంద్రదేవ్ వయసు 71 సంవత్సరాలు (జన్మదినం ఫిబ్రవరి 15, 1947).ఇపుడు కాంగ్రెస్ పుచ్చిపోయిందని ఆయన పార్టీ మారి చేసేదేముంటుంది.
Tags:Kishore Chandra Devi in TDP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *