కిట్లు కనికట్లు (నెల్లూరు జిల్లా)

Date:22/09/2018
నెల్లూరు ముచ్చట్లు:
భూసార పరీక్షలు చేసి, ఫలితాలు వెల్లడించేందుకు ప్రభుతం పంపిణీ చేసిన ఐకార్‌ కిట్లు  వ్యవసాయ శాఖ కార్యాలయాలకే పరిమితమయ్యాయి. దరిమిలా రూ.63 లక్షలు బూడిదలో పోసిన పన్నీరులా తయారైంది. కొంతకాలం కిందట దేశ వ్యాప్తంగా వ్యవసాయ శాస్త్రవేత్తలు భూసార పరీక్షలపై ఓ సర్వేను చేపట్టారు. ఈ సర్వేలో అధికసంఖ్య భూముల్లో సూక్ష్మ పోషకాల లోపం తీవ్రంగా ఉన్నట్లు గుర్తించారు.
ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో భూములన్నీ నిస్సారంగా మారి ఆహార భద్రత సమస్య  తలెత్తే అవకాశం ఉందని తెలుసుకున్నారు. అన్నదాతలకు భూసార పరీక్షల ఫలితాలను అందజేయాలని సంకల్పించారు. అన్నదాతలు అధిక దిగుబడులు సాధించాలన్న లక్ష్యంతో ప్రభుత్వాలు పలు చర్యలు చేపట్టాయి. ఇందులో భాగంగా భూసార పరీక్షలు నిర్వహించి, అందులో పోషక లోపాలను గుర్తించి, అందుకు తగ్గట్లు చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వాలు ప్రణాళికలు రూపొందించాయి.
ఇందులో భాగంగా వ్యవసాయాధికారులు తరచూ క్షేత్రస్థాయిలో పొలాలకెళ్లి రైతుల వెంట పెట్టుకుని మట్టి నమూనాలు సేకరిస్తున్నారు. వీటిని మండల కేంద్రానికి తీసుకొచ్చి జిల్లా కేంద్రంలోగాని, రాష్ట్రస్థాయిలో ఉన్న ల్యాబ్‌లకు   గానీ పంపుతుంటారు. అక్కడి నుంచి వాటి ఫలితాలు వచ్చేందుకు  కొంతకాలం పడుతోంది. ఈలోగా పంట సీజన్‌ ప్రారంభమై రైతులు సాగు చేసి దిగుబడి లేక అప్పుల పాలవుతున్నారు. దీనిని గుర్తించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పొల్లాలోనే అరగంటలో భూసార పరీక్షలు నిర్వహించి, వెంటనే దాని ఫలితాలను వెల్లడించేందుకు వీలుగా శ్రీకారం చుట్టారు.
ఇందుకోసం రూ.లక్షల విలువ చేసే మినీ భూసార పరీక్ష(మినీ సాయిల్‌ టెస్టింగ్‌ ల్యాబ్‌) కిట్లను రాష్ట్ర వ్యవసాయ శాఖ మండల వ్యవసాయాధికారులకు ఎనిమిది నెలల కిందట అందజేసింది. వీటి ద్వారా ఎరువుల వినియోగంలో సమతుల్యత, పంటల సాగు,  నాణ్యమైన అధిగ దిగుబడులు సాధ్యమవుతాయని గుర్తించి మినీ భూసార  పరీక్షలు చేయాలని తలచారు.
మట్టి నమూనాలను సేకరించి, అరగంటలో భూసార పరీక్షల ఫలితాలను వెల్లడించేందుకు వీలుగా ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ రీసెర్చి(ఐసీఏఆర్‌) శాస్త్రవేత్తలు మినీ భూసార పరీక్ష కిట్లు తయారుచేశారు. ఇందులో అధునాతన పరికరాలు, పరీక్షలకు అవసరమైన రసాయనిక మందులు ఉన్నాయి. వీటిని రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ శాఖ ద్వారా మండల కేంద్రాలకు అందజేశారు. ఇందులో ఒక కిట్‌ తయారీ కోసం రూ.68,500 చొప్పున ప్రభుత్వం వ్యయం చేసింది.
జిల్లాలో పరిస్థితి.. జిల్లాలోని 46 మండలాలకు కొన్ని నెలల కిందట మినీ భూసార పరీక్ష కిట్లను అందజేశారు. ఒక్కొక్క మండలానికి రెండు చొప్పున మండల వ్యవసాయ శాఖ అధికారులకు పంపిణీ చేయడం జరిగింది.  జిల్లా వ్యాప్తంగా 92 మినీ భూసార పరీక్ష కిట్లను అందజేసినట్లు తెలుస్తోంది. వీటి విలువ రూ.63,02,000 వరకు ఉంది. రూ.లక్షలు వ్యయం చేసి కొనుగోలు చేసిన ఈ కిట్లను అధికారులు తమ కార్యాలయాల్లో ఓ మూల భద్రంగా పడేశారు.
జిల్లాలోని పలు మండలాల్లో అయితే ఈ కిట్లను అసలు వ్యవసాయాధికారులు తెరచి చూసిన దాఖలాలు సైతం లేదు. మరికొందరు వ్యవసాయాధికారులు కిట్లను కార్యాలయాల్లోని అటకబండలపై భద్రపరిచారు. ప్రభుత్వం ఎంతో ఉన్నతాశయంతో ఇచ్చిన ఈ కిట్లను కాస్తా పరిశీలించి, వాటి వినియోగం ఎలా ఉంటుందో తెలుసుకోవాల్సింది పోయి అసలు వాటి గురించి పట్టించుకోకపోవడం శోచనీయం.
ఉన్నతాధికారులు సైతం మినీ భూసారీ పరీక్ష కిట్లు ఎలా ఉన్నాయి.. వాటి పనితీరు ఏమైనా బాగుందా.. వాటి వల్ల ఉపయోగం ఉందా.. ఫలితాలు బాగా వస్తున్నాయా.. అని అడగాల్సింది పోయి.. అసలు వాటి గురించే మండల వ్యవసాయాధికారులను ప్రశ్నించిన దాఖలాలు లేవు.
Tags:Kits Kannikattu (Nellore district)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *