శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

తిరుమల ముచ్చట్లు:

తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం శాస్త్రోక్తంగా జరిగింది. ఈ కార్య‌క్ర‌మంలో టీటీడీ ఈవో   ఎవి.ధ‌ర్మారెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఈవో మీడియాతో మాట్లాడుతూ సెప్టెంబరు 27 నుండి అక్టోబ‌రు 5వ తేదీ వ‌ర‌కు శ్రీ‌వారి వార్షిక సాల‌క‌ట్ల‌ బ్ర‌హ్మోత్స‌వాలను పుర‌స్క‌రించుకుని మంగ‌ళ‌వారం ఉద‌యం కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం నిర్వ‌హించిన‌ట్లు చెప్పారు. సాధార‌ణంగా సంవత్సరంలో నాలుగుసార్లు ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వ‌స్తోంద‌న్నారు. ఆలయంలోని ఆనందనిలయం మొదలుకొని బంగారువాకిలి వరకు, శ్రీవారి ఆలయం లోపల ఉప దేవాలయాలు, ప్రసాదాల పోటు, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పుతోపాటు పూజాసామగ్రిని శుద్ధి చేసినట్టు తెలిపారు.కాగా, ఆలయంలో ఉదయం 6 నుండి 11 గంటల వరకు శుద్ధి కార్యక్రమాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహించారు.

 

 

ఈ సమయంలో స్వామివారి మూలవిరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పి వేశారు. శుద్ధి పూర్తి అయిన అనంతరం నామకోపు, శ్రీ చూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం స్వామివారి మూలవిరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ, నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆ తరువాత భక్తులను దర్శనానికి అనుమతించారు.ఈ కార్యక్రమంలో ఢిల్లీ స్థానిక స‌ల‌హామండ‌లి అధ్య‌క్షురాలు  వేమిరెడ్డి ప్ర‌శాంతిరెడ్డి, సివిఎస్వో  న‌ర‌సింహ కిషోర్‌, ఎస్వీబిసి సిఈవో  ష‌ణ్ముఖ కుమార్‌, ఆలయ డెప్యూటీ ఈవో  ర‌మేష్‌బాబు, విజివో  బాలిరెడ్డి, పేష్కార్  శ్రీహరి, పార్‌ప‌త్తేదార్  ఉమామ‌హేశ్వ‌ర్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

 

Tags:Koil Alwar Thirumanjanam in Srivari Temple

Leave A Reply

Your email address will not be published.