జూన్ 30న శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
తిరుపతి ముచ్చట్లు:
శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జూన్ 30వ తేదీ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. శ్రీవారి సాలకట్ల సాక్షాత్కార వైభవోత్సవాలు జులై 3 నుండి 5వ తేదీ వరకు జరుగనున్నాయి.
ఈ ఉత్సవానికి ముందు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ.ఈ సందర్భంగా గురువారం తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, కొలువు, పంచాంగశ్రవణం నిర్వహిస్తారు. ఉదయం 7.30 నుండి 11.30 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగనుంది. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేస్తారు. అనంతరం సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. మధ్యాహ్నం 12.30 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు.
Tags:Koil Alwar Thirumanjanam on June 30 at Sri Kalyana Venkateswaraswamy Temple