శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
తిరుపతి ముచ్చట్లు:
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం శాస్త్రోక్తంగా జరిగింది. ఈ కార్యక్రమంలో టిటిడి ఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్‌రెడ్డి, అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డి పాల్గొన్నారు. అనంతరం అదనపు ఈవో ఎవి. ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం ఉదయం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించినట్లు చెప్పారు. సాధారణంగా సంవత్సరంలో నాలుగుసార్లు ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఆలయంలోని ఆనందనిలయం మొదలుకొని బంగారువాకిలి వరకు, శ్రీవారి ఆలయం లోపల ఉప దేవాలయాలు, ప్రసాదాల పోటు, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పుతోపాటు పూజాసామగ్రిని శుద్ధి చేసినట్టు తెలిపారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, వైకుంఠ ఏకాదశి దర్శనానికి వచ్చే భక్తులకు దర్శనం, వసతి సౌకర్యావంతంగా కల్పించేందుకు మంగళవారం (నేడు) గదులను కేటాయించడం లేదని చెప్పారు. భక్తులు కోవిడ్ నిబంధనలను పాటిస్తూ వైకుంఠ ద్వారా దర్శనం చేసుకుని టిటిడికి సహకరించాలని ఆయన పునరుద్ఘాటించారు.
కాగా, ఆలయంలో ఉదయం 6 నుండి ఉదయం 11 గంటల వరకు శుద్ధి కార్యక్రమాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహించారు. ఈ సమయంలో స్వామివారి మూలవిరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పి వేశారు. శుద్ధి పూర్తి అయిన అనంతరం నామకోపు, శ్రీ చూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం స్వామివారి మూలవిరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ, నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆ తరువాత భక్తులను దర్శనానికి అనుమతించారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Koil Alwar Thirumanjanam scientifically at the Srivari Temple