7న కోమటిరెడ్డి రాజీనామా..?
నల్గొండ ముచ్చట్లు:
మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాకు ముహూర్తం ఖరారైంది. ఆగష్టు 7 వ తేదీన, ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాలనే నిర్ణయానికి వచ్చారు. అయితే, అదే రోజున శాసన సభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తారా, అంటే, ఆ నిర్ణయం ఇంకా జరగలేదని అంటున్నారు. నిజానికి, రాజగోపాల రెడ్డి బీజేపీలో చేరాలనే నిర్ణయం, ఆయన కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసిన రోజునే ఖరారైందని, అయితే, అనుచరులతో చర్చించేందుకే, ఆయన కొంత సమయం తీసుకున్నారని అంటున్నారు.ఇదలాఉంటే, మరోవంక రాజగోపాల రెడ్డి చేయివదలి పోకుండా చూసేందుకు కాంగ్రెస్ నాయకత్వం అన్ని ప్రయత్నాలు చేసింది. నల్గొండ జిల్లాకే చెందిన మాజీ పీసీసీ అధ్యక్షుడు ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఏఐసీసీ సెక్రటరీ వంశీచంద్ రెడ్డి కాంగ్రెస్ కేంద్ర నాయకత్వం ప్రత్యేక దూతలుగా రాజగోపాల రెడ్డి ఇంటికి వెళ్లి మరీ బుజ్జగింపు చర్చలు జరిపారు. అయినా రాజగోపాల రెడ్డి, నో’ అన్నారు. కాంగ్రస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్, రంగంలోకి దిగారు. మాట్లాడుకుందాం ఢిల్లీకి రమ్మని పిలిచారు.అయినా, రాజగోపాల రెడ్డి ఢిల్లీ వెళ్ళలేదు. ఇలా బుజ్జగింపుల మొదలు పదవుల బేరసారాలవరకు ఎన్ని ప్రయత్నాలు చేసినా అప్పటికే బీజేపీ రాజకీయ,వ్యాపార చక్రబంధంలో చిక్కుకు పోయిన రాజగోపాల రెడ్డి ససేమిరా అన్నారు. పార్టీని వీడేందుకే మొగ్గు చూపారు.
ఉపఎన్నికతో కేసీఆర్‌కు గుణపాఠం చెప్పడమే తన ఎజెండా అంటున్నారు.దీంతో కాంగ్రెస్ అధిష్టానం కూడా ఇక లాభం లేదని నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. నిజానికి, మునుగోడు ఉపఎన్నిక తెరాస, బీజేపీల కంటే కాంగ్రెస్ పార్టీకే కీలకమని కాంగ్రెస్ ముఖ్యనాయకులు భావిస్తున్నారు. ఇప్పటికే, హుజూర్ నగర్, నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో ఓడి పోవడంతో ఈ ఉప ఎన్నికల్లొనూ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే మరో సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకోలేక పోయిందనే ప్రచారంతో కాంగ్రెస్ పార్టీ ఇమేజ్ మరింత దెబ్బ తింటుందని అంటున్నారు.అలాగే, టీపీసీసీ అధ్యక్షుడు, రేవంత్ రెడ్డి ఇమేజ్ ని దెబ్బ తీయడమే కాకుండా పార్టీలో ఆయన వ్యతిరేక వర్గం పై చేయి సాధిస్తుందని అంటున్నారు. అందుకే, కాంగ్రెస్ అధిష్టానం కాంగ్రెస్ ముఖ్యనాయకులతో సోమవారం ఢిల్లీలో సమావేశమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో కోమటిరెడ్డి రాజగోపాల రెడ్డిపై సస్పెన్షన్ వేటువేసే విషయంతో పాటుగా, ఉప ఎన్నిక అనివార్యమైతే ఎవరిని బరిలో దించాలనే అంశం సహా సంబంధిత అంశాలపైనే చర్చ ఉంటుంది అంటున్నారు. హుజురాబాద్ విషయంలో చివరి వరకు అభ్యర్ధిని ఖరారు చేయక పోవడం వలన ఘోరాతి ఘోరంగా ఓడి పోయామనే భావనలో ఉన్న కాంగ్రెస్ నాయకత్వం మునుగోడు విషయంలో ముందు చూపుతో అడుగు వేస్తోందని అంటున్నారు. అయితే, మునుగోదు కాంగ్రెస్ కు పట్టున్న నియోజక వర్గమే అయినా, ఉప ఎన్నికల్లో విజయం అంత ఈజీ కాదనీ అంటున్నారు.

Tags: Komatireddy’s resignation on 7..?
