నిండా మునిగిన కొత్తపేట

కోనసీమ ముచ్చట్లు:


కొత్తపేట నియోజకవర్గ పరిధిలోని లంక గ్రామాల్లో.. పంట పొలాలు పూర్తిగా నీటి మునిగాయి. ఆత్రేయపురం, రావులపాలెం, కొత్తపేట మండలాల్లోని లంక గ్రామాల్లో కూరగాయలు, అరటి, కంద పంటలు నాలుగు రోజులుగా నీటిలోనే నానుతున్నాయి. కూరగాయల పంటలు పూర్తిగా పాడైపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బడుగువాని లంక దాదాపు వరద నీటిలో మునిగిపోగా..అక్కడ ప్రజల పడవల ద్వారా బయటపడ్డారు.కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజవర్గం కాట్రేనికోన, ఐ. పోలవరం, తాళ్లరేవు మండలాల్లోని లంక గ్రామాలు ముంపునకు గురయ్యాయి. ఇంటిలోని వస్తువులను వరద నీటి నుంచి కాపాడుకునేందుకు నానాయతన పడుతున్నారు. పాడి పశువుల్ని ప్రాణాలతో దక్కించుకునేందుకు తీవ్ర కష్టాలు పడుతున్నారు. గూడుచెదిన వారంతా గుడారాల్లోనూ… కింది అంతస్తు మునిగిన వారంతా.. డాబాల మీదకు చేరి సహాయం కోసం ఎదురు చూస్తున్నారు.

 

 

మంత్రి పినిపే విశ్వరూప్ పై వరద బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు ఉన్న శ్రద్ధ వరద సమయంలో కనబడదా అని నిలదీశారు. కోనసీమ జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతమైన లంకల గన్నవరంకు వెళ్లిన మంత్రి బాధితుల నుంచి ఆగ్రహావేశాలు ఎదుర్కొన్నారు. మూడు రోజులుగా వరద నీటిలో నానుతున్నామని కనీసం మంచినీళ్లు అయిన సక్రమంగా పంపిణీ చేయలేదన్నారు. పాలు లేక పిల్లలు అల్లాడిపోతున్నారని ఆవేదన చెందారు .దీంతో తక్షణమే ఆహార పొట్లాలు అందించాలని మంత్రి అధికారులను ఆదేశించారు .ఎగువ రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలకు ఏపీలోని 5 జిల్లాల్లోని 42 మండలాలపై వరద ప్రభావం పడిందని హోమంత్రి తానేటి వనిత వెల్లడించారు. 554 గ్రామాలు ముంపు బారిన పడినట్లు తెలిపారు. కోనసీమ జిల్లా అయినవిల్లి మండలంలోని ముక్తేశ్వరం తొగరపాయ కాజ్ వే వద్ద వరద పరిస్థితిని ఆమె పరిశీలించారు. వరద బాధితులకు అన్ని రకాల సహయక చర్యలను చేపట్టామన్నారు.

 

 

కోనసీమ జిల్లా రాజోలులో ఏటి గట్టుపై నుంచి వరద పొంగి ప్రవహించింది. రాజోలులోని నున్నవారిబాడవ వద్ద.. గట్టుపై 3 అడుగులు ఎత్తు నీరు ప్రవహిస్తోంది. గట్టు వెంట ఉన్న 200 ఇళ్లు మునిగిపోయాయి. ఆయా నివాసాల ప్రజలు గట్టుపై గుడారాలు వేసుకుని కాలం వెళ్లదీస్తున్నారు. రాజోలు, సోంపల్లి, శివకోటి గ్రామాల ప్రజలతో పాటు.. అధికారులు ఇసుక బస్తాలతో వరద అడ్డుకట్ట వేశారు. పి గన్నవరం అక్విడెక్టులోకి వరద నీరు పోటెత్తగా.. గంటి నుంచి చాకలి పాలెం వరకు ప్రధాన రహదారి పై వరదపారుతోంది. వరద ఉద్ధృతికి లంకల గన్నవరం వద్ద రహదారి కోతకు గురైన పక్కనే ఉన్న భారీ వృక్షం అడ్డంగా పడిపోయింది .రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.గోదావరి వరద కేంద్ర పాలితప్రాంతం యానాం పట్టణాన్ని ముంచెత్తింది. గౌతమి గోదావరి ఉద్ధృతితో మునుపెన్నడూ లేని విధంగా పట్టణం ముంపు బారిన పడింది. బ్రిటిష్ వారి కాలంలో వరద నీరు రాకుండా గోడను నిర్మించారు. 30 ఏళ్ల క్రితం వచ్చిన వరద గోడను తాకిందే తప్ప ఊరిలోకి ప్రవేశించ లేదు. కానీ ఈసారి వరద ఒక్కసారిగా పోటెత్తి గోడలను దాటి పట్టణంలోకి ప్రవేశించింది. వరద ఉద్ధృతి వల్ల యానాం చుట్టుపక్కల ఉన్న 8 గ్రామాలు పూర్తిగా ముంపునకు గురయ్యాయి. కాలనీల్లో నడుము లోతు వరకు వరద ప్రవహిస్తోంది. కొన్నిచోట్ల మొదటి అంతస్తు వరకు నీరు చేరడంతో ఇంట్లో ఉన్న సామాగ్రిని వదిలేసి కట్టుబట్లతో జనం డాబాల మీదకు చేరారు. విలువైన సామాగ్రి దొంగల పాలవుతుందని ఎవరు బయటకి రావడం లేదు.

 

Tags: Kothapeta is full

Leave A Reply

Your email address will not be published.