కృష్ణా..కృష్ణా…ఇసుకాసురులు

మహబూబ్ నగర్ ముచ్చట్లు:

ధారణంగా ఇళ్లలో, దుకాణాల్లో, ఇతర వాణిజ్య సంస్థల్లో దొంగలు పడుతుంటారు. దాచుకున్న సొమ్మును ఎత్తుకెళ్తుంటారు. ఇదే తరహాలో ఇసుకాసురులు పుట్టుకొచ్చారు. వీరు వాగు వంకల్లో, దొంగాట ఆడుతుంటారు. రాత్రి, పగలనే తేడా లేకుండా ప్రభుత్వ పథకం పేరిట ‘గప్..చుప్’గా ఇసుకను లూటీ చేస్తుంటారు. లూటీ చేసిన ఇసుకను తరలించడంలో పరుగులు తీస్తూ పోటీ పడుతుంటారు. ఇసుక నుంచి తైలం తీయొచ్చో లేదో గానీ పైసలు మాత్రం మస్తు పిండొచ్చని కల్వకుర్తి డివిజన్ సాండ్ మాఫియాదార్లు రుజువు చేస్తున్నారు. దొరికితే దొంగ ..లేకపోతె దోర అన్న చందంగా కొనసాగుతుంది. ఇక్కడ ఎవరికీ ఏ మాత్రం భయం లేదు. జంకుగొంకూ అసలే లేదు. గతంలో ఏ అర్థరాత్రి పూటో జరిగిన ఇసుక అక్రమ రవాణా, ఇప్పుడు మాత్రం పట్టపగలు యథేచ్ఛగా సాగుతోంది.కల్వకుర్తి డివిజన్ పరిధిలోని వంగూర్ మండలం చింతపల్లివాగు, సదగోడు వాగు, సుద్దకల్ వాగు ప్రాంతాల నుంచి టిప్పర్లు, ట్రాక్టర్‌ ద్వారా టన్నుల కొద్ది ఇసుకను తోడేస్తున్నారు. దోచుకున్నోడికి దోచుకున్నంత అన్నట్లు చీకటి పడగానే టిప్పర్లు, ట్రాక్టర్ అలజడిని మొదలెడుతారు. కాసులకు మరిగిన ఇసుక మాఫియా అక్రమ రవాణాకు కొత్తదారులు వెతుకుతోంది. ఇసుకను తరలించడంలో ఎల్లికల్, సదగోడు, చింతపల్లి, సుద్దకల్ నుంచి వందల కొద్దీ ట్రాక్టర్లు పగలు, రాత్రి అనే తేడా లేకుండా ఇసుక రవాణాకు తెరలేపారనే వదంతులు వినిపిస్తున్నాయి.

 

 

ప్రభుత్వ పథకం అయినా మన ఇసుక వాహనం పేరిట ఆన్ లైన్ లో ప్రభుత్వానికి ఎలాంటి రుసుము చెల్లించకుండ వందల సంఖ్యలో కల్వకుర్తి పట్టణానికి ట్రాక్టర్ల ద్వారా ఇసుక అక్రమంగా తరలిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టి ధనార్జనే ధ్యేయంగా సొమ్ము చేసుకుంటున్నారు. అక్రమార్కులు రెవెన్యూ, పోలీసులకు డబ్బులు ముట్టజెప్పి తమ పని కానిచ్చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఇసుకను ట్రాక్టర్లలో, టిప్పర్లలో అక్రమంగా రవాణా చేసినా అధికారులు చూసీ చూడనట్లు వదిలేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి..మన ఇసుక వాహనం అనే ప్రభుత్య పథకం ద్వారా ఇసుకను తప్పుదోవ పట్టిస్తూ అక్రమార్కులు యథేచ్ఛగా తవ్వకాలు చేపడుతున్నారు. మన ఇసుక వాహనం పథకంపై ట్రాక్టర్లో ఇసుకను తరలించాలంటే ముందుగా ట్రాక్టర్ రిజిస్ట్రేషన్(ఆర్సీ, ఫిట్నెస్, ఇన్స్యూరెన్స్) కలిగి ఉన్నా వాహనాలు ప్రభుత్వ వెబ్ సైట్ ఆన్ లైన్ లో ఎంట్రీ అవుతాయి. అనంతరం లబ్ధిదారుడు ఆన్ లైన్ బుక్ చేసుకుని డబ్బులు కట్టాలి. అదే క్రమంలో ట్రాక్టర్ యజమాని మొబైల్ కి ఓటీపీ మరియు ఇసుక బుకింగ్ చేసుకున్న వ్యక్తి మొబైల్ నెంబర్ చిరునామా సమాచారం అందుతుంది. అందిన చిరునామాలో ఇసుకను అన్ లోడ్ చేయాలి. అనంతరం ట్రాక్టర్ యజమానికి తన అకౌంట్ లో ప్రభుత్వ చలాన్ అమౌంట్ కట్ చేసి జమచేస్తారు. దీని ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వస్తుందనే ఆలోచనతో ఈ మన ఇసుక వాహనానికి శ్రీకారం చుట్టింది .

 

 

తెలంగాణ సర్కారు.ప్రభుత్వ అనుమతి పొందిన ఇసుక రీచ్ లో ఇసుక తవ్వకాలు జరపడానికి ఎలాంటి వాహనాలు ఉపయోగించరాదని తెలంగాణ సర్కారు ఆదేశాలిచ్చింది. ప్రభుత్వ అనుమతుల ప్రకారం 6 నుంచి 7 అడుగుల వరకు మాత్రమే అనుమతి ఇచ్చింది.నిబంధనలను తుంగలోకి తొక్కి ఎవరి ఇష్టనుసారంగా వాగులో జేసీబీల సహాయంతో పరిమితికి మించి యథేచ్ఛగా 12 నుంచి 15 అడుగుల వరకు తవ్వకాలు చేస్తున్నారు. ఇలా త్రవ్వకాలు జరిపి ట్రాక్టర్ల, టిప్పర్ల ద్వారా అక్రమంగా ఇసుకను తరలించి భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. సర్కారు ఆదాయానికి గండికొడుతున్నా సంబంధిత శాఖ అధికారులు మాత్రం నిద్దరోతున్నారు. అయితే పరిమితికి మించి తవ్వకాల వల్ల చుట్టూ ఉన్న పండ్ల తోటలు, వరి పొలాల్లోని బోరుబావులకు భూగర్భజలాలు తగ్గిపోయే అవకాశం ఉంది. ఇసుక వాహనం తప్పుదోవ పడుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. అక్రమ ఇసుక తవ్వకాలపై ఉక్కు పాదం మోపాల్సిన అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదు. అడపాదడపా ట్రాక్టర్లను పట్టుకుని నామమాత్రపు జరిమానాలు వేసి వదిలేస్తున్నారు. కానీ ఇసుక తవ్వుతున్న ప్రదేశాలకు వెళ్లి ఎంత మేరకు తవ్వకాలు జరిగాయి.. ఎంత పరిమాణంలో ఇసుకను తరలిస్తున్నారో.. వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని తగిన జరిమానాలు విధించాల్సి ఉంది.ఇప్పటికైనా జిల్లా ఎస్పీ, కలెక్టర్ లు స్పందించి దీనిపై సమగ్ర విచారణ జరిపి సర్కారు ఆదాయానికి గండి పడకుండా చేయాలని, అక్రమార్కులపై, వారికి వత్తాసు పలుకుతున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని కల్వకుర్తి ప్రజలు కోరుకుంటున్నారు.

 

Tags: Krishna..Krishna … Isukasurulu

Leave A Reply

Your email address will not be published.