Natyam ad

కరువు తీరేలా కృష్ణా జలాలు

-పుంగనూరు ఉపకాలువ విస్తరణ పనులకు టెండర్లు పూర్తి
-రూ.1,217,49,40,146.53తో టెండర్‌దాఖలు చేసిన ఎన్‌సీసీ
-1,180 క్యూసెక్కులకు పెరగనున్న కాలువ సామర్థ్యం
-అన్నమయ్య-చిత్తూరుజిల్లాల్లో 140.75 కిలోమీటర్ల పనులు

 

పుంగనూరు ముచ్చట్లు:

Post Midle

హంద్రీనీవా సాగు, తాగునీటి ప్రాజెక్టు రెండోదశలో భాగమైన పుంగనూరు ఉపకాలువ విస్తరణ పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. అన్నమయ్య, చిత్తూరుజిల్లా రైతాంగానికి ప్రయోజనం కలిగించే ఈ పనులతో కృష్ణా జలాలు పుష్కలంగా అందుతాయి. విస్తరణ పనులను కాంట్రాక్టు సంస్థలకు అప్పగించడం కోసం గతనెలలో ప్రభుత్వం రూ.1,219,93,02,150 అంచనాతో టెండర్లను ఆహ్వనించింది. ఈ పనులు దక్కించుకునేందుకు నాగార్జున కన్‌స్ట్రక్షన్స్ కంపెనీ లిమిటెడ్‌, మేఘా ఇంజనీరింగ్‌ ఇన్‌ఫాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ టెండర్లను దాఖలు చే యగా, రివర్స్ టెండరింగ్‌లో నాగార్జున కన్‌స్ట్రక్షన్స్ కంపెనీ ప్రభుత్వ అంచనా విలువకంటే 0.1997 శాతం తక్కువకు రూ.1,217,49,40,146.53తో టెండర్‌ దాఖలు చేయడంతో ఎల్‌-1గా నిలిచింది. ఈ కంపెనీకి పనులు అప్పగించేందుకు ప్రాజెక్టు ఉన్నతాధికారులు ప్రభుత్వానికి నివేదించారు. అనుమతి రాగానే పనులు వెహోదలవుతాయి. జిల్లాలోని పుంగనూరు, పలమనేరు నియోజకవర్గాలకు కృష్ణా జలాలు పుష్కలంగా అందుతాయి. కుప్పం నియోజకవర్గానికి కృష్ణా జలాల తరలింపుకు ఇబ్బందులు తీరుతాయి.

10.8 మీటర్లకు విస్తరణ …

అన్నమయ్యజిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలోని పెద్దతిప్పసముద్రం మండలం మీదుగా చిత్తూరుజిల్లా పుంగనూరు నియోజకవర్గంలోకి హంద్రీనీవా ప్రాజెక్టు పుంగనూరు ఉపకాలువ ప్రవేశిస్తుంది. పెద్దతిప్పసముద్రం మండలంలోని కిలోమీటర్‌ 79 నుంచి చిత్తూరుజిల్లా పలమనేరు నియోజకవర్గం గంగవరం మండలం తిమ్మిరెడ్డిపల్లె సమీపంలోని 220.350 కిలోమీటర్‌ వరకు ఈ ఉపకాలువ సాగుతుంది. రెండుజిల్లాల్లో కాలువ 140.75 కిలోమీటర్లు సాగుతుంది. ప్రస్తుతం కాలువ వెడల్పు ఆరుమీటర్లు, దీనికి అదనంగా కాలువ కుడివైపున 4.8 మీటర్లను వెడల్పు చేస్తారు. కాలువమధ్యలో ఉన్న ఆరు ఎత్తిపోతల పథకాలను విస్తరిస్తారు. ఇప్పుడు ఒక్కో ఎత్తిపోతల పథకంలో నాలుగేసి పంపులున్నాయి. 50 మీటర్ల దూరంలో అదనంగా మరో నాలుగేసి పంపులను నిర్మిస్తారు. ప్రస్తుతం 380 క్యూసెక్కుల నీటి ప్రవాహ సామర్థ్యం కలిగిన కాలువను వెడల్పు చేశాక 1,180 క్యూసెక్కుల సామర్థ్యానికి పెరుగుతుంది.

గండికోట జలాల కోసమే…

ఉమ్మడిచిత్తూరుజిల్లాకు కృష్ణా జలాలను తరలించాలంటే అనంతపురంజిల్లా జీడిపల్లె రిజర్వాయర్‌ నుంచి కదిరి సమీపంలోని చెర్లోపల్లె రిజర్వాయర్‌కు తరలించాలి. ఇక్కడినుంచి ప్రస్తుత అన్నమయ్యజిల్లా దాటుకొని జిల్లాలోకి నీటిని తరలించాలి. ఎగువ ప్రాంతాల నుంచి నీటి తరలింపు కొన్నిసార్లు అడ్డంకులు ఎదురవుతుంటాయి. దీన్ని అధిగమించేందుకు ప్రభుత్వం గాలేరు-నగరి, హంద్రీనీవా ప్రాజెక్టుల అనుసంధాన పనులను రూ.4,373.23 కోట్లతో చేపట్టింది. వైఎస్సార్‌జిల్లాలోని గండికోట రిజర్వాయర్‌ నుంచి నీటిని అన్నమయ్యజిల్లాలోని వెలిగల్లు రిజర్వాయర్‌కు అక్కడినుంచి తంబళ్లపల్లె సమీపంలోని పెద్దేరు ప్రాజెక్టుకు తరలించాక ఎత్తిపోతల ద్వారా పెద్దతిప్పసముద్రం మండలంలో పుంగనూరు ఉపకాలువలోకి నీటిని తరలిస్తారు. ఈ జలాలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలంటే పుంగనూరు ఉపకాలువ విస్తరణ తప్పనిసరి. దీనితో ప్రభుత్వం పనులకు చర్యలు చేపట్టింది. గండికోట రిజర్వాయర్‌ నుంచి అన్నమయ్య, చిత్తూరుజిల్లాలకు 1,550 క్యూసెక్కుల నీటిని తరలిస్తారు. గండికోట రిజర్వాయర్‌ నుంచి చక్రాయపేట మీదుగా జిల్లాలోని పెద్దతిప్పసముద్రం మండలం సీవీరామన్నగారిపల్లె వద్ద పుంగనూరు ఉపకాలువ కిలోమీటర్‌ 79 వద్ద కాలువలోకి 800 క్యూసెక్కుల నీటిని, 750 క్యూసెక్కుల నీటిని అన్నమయ్యజిల్లా పెద్దమండ్యం మండలం మీదుగా సాగే హంద్రీ-నీవా ప్రధానకాలువకు తరలిస్తారు.

కొత్త రిజర్వాయర్లకు నీళ్లు…

జిల్లాలోని పుంగనూరు నియోజకవర్గంలో అవులపల్లె, నేతికుంటపల్లె, అన్నమయ్యజిల్లాలో ముదివేడు రిజర్వాయర్ల నిర్మాణాలను ప్రభుత్వం చేపట్టింది. పుంగనూరు ఉపకాలువ ద్వారా వచ్చే కృష్ణా జలాల్లో ముదివేడు రిజర్వాయర్‌ కు 200 క్యూసెక్కులు, నేతికుం• పల్లె రిజర్వాయర్‌కు 100, ఆవులపల్లె రిజర్వాయర్‌కు 350 క్యూసెక్కుల నీటిని తరలిస్తారు. కృష్ణా నదికి వరదలు వచ్చే 120 రోజుల్లో వరద నీటిని తరలించి 8 టీఎంసీలను సద్వినియోగం చేసుకోవాలన్నది కాలువ విస్తరణ ప్రణాళిక లక్ష్యం.

రైతాంగ సంక్షేమమే లక్ష్యం…

రైతాంగం సంక్షేమమే సీఎం వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యం. కరువు ప్రాంతాలను సస్యశ్యామలం చేసేందుకు ప్రాజెక్టుల పనులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. పుంగనూరు ఉపకాలువ విస్తరణ పూర్తయ్యాక రెండుజిల్లాల్లో సాగు, తాగునీటికి కష్టాలు పూర్తిగా తీరిపోతాయి. రిజర్వాయర్లకు, చెరువులకు నీళ్లు చేరుతాయి. కుప్పం ఉపకాలువ ద్వారా కుప్పం నియోజకవర్గానికి నీటిని తరలించేందుకు చర్యలు తీసుకొంటాం. కుప్పంలో కొత్తగా రెండు రిజర్వాయర్ల నిర్మాణాలకు ప్రభుత్వం పరిశీలిస్తోంది.

-పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాష్ట్రమంత్రి

Tags: Krishna waters to relieve drought

Post Midle