వర్శిటీల్లో గైడ్ల కొరత

తిరుపతి ముచ్చట్లు:

గైడ్ల కొరతతో పిహెచ్‌డి విద్యనభ్యసించే అవకాశం విద్యార్థులకు దక్కని పరిస్థితి రాష్ట్రంలో ఉంది. అధ్యాపకుల పోస్టులు ఖాళీగా ఉండడమే ఇందుకు ప్రధాన కారణం. పిహెచ్‌డి కోసం రాష్ట్ర స్థాయిలో ఉమ్మడి నోటిఫికేషన్‌ ఎపిఆర్‌సిఇటి-2022ను ప్రభుత్వం జారీ చేసింది. ఇందులో 62 కోర్సుల్లో పిహెచ్‌డి ప్రవేశానికి పరీక్షను నిర్వహించనున్నట్లు పేర్కొంది. అయితే, ఈ నోటిఫికేషన్లో కొన్ని సబ్జెక్టులకు చోటు దక్కలేదు. వాటిలో ఉర్దూ కూడా ఉంది. పిహెచ్‌డి చేసే విద్యార్థులకు ఆ సబ్జెక్టులకు సంబంధించి అధ్యాపకులు గైడ్‌లుగా ఉంటారు. ఒక్కో అధ్యాపకుడు ఆరుగురికి మాత్రమే గైడ్‌గా చేయాలనే నిబంధన ఉంది. ఆ గైడ్‌ ఆధ్వర్యాన విద్యార్థులు కోర్సు పూర్తి చేయాల్సి ఉంటుంది. విశ్వవిద్యాలయాల్లో తగినంత మంది అధ్యాపకులు లేరు. చాలా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో పిహెచ్‌డి సీట్లు, కోర్సుల్లో కోతలు పెట్టినట్టు సమాచారం.రాష్ట్రంలో పిజి చేసిన విద్యార్థులు కొందరు పిహెచ్‌డి చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. వారికి సంబంధించిన సబ్జెక్టు ప్రభుత్వ నోటిఫికేషన్లో లేకపోవడంతో నిరాశకు గురయ్యారు. ఉర్దూ సబ్జెక్టులో ఏటా పోస్టుగ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసే విద్యార్థులు వందమంది వరకూ ఉంటున్నారు. వారిలో కొంతమంది పిహెచ్‌డి చేయాలనే యోచనలో ఉన్నారు. అయితే, ఇందుకు సంబంధించి గైడ్లు అందుబాటులో లేడు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క ఎస్‌వి యూనివర్సిటీ పరిధిలో మాత్రమే ఇద్దరు ఉర్దూ అధ్యాపకులు ఉన్నారు. వీరికి గతేడాది ఆరుగురు చొప్పున 12 మందిని కేటాయించారు.

 

 

పిహెచ్‌డి పూర్తి కావాలంటే కనీసం మూడు సంవత్సరాలు పడుతుంది. ఈ ఏడాది పిహెచ్‌డి నోటిఫికేషన్‌ ఇవ్వాలంటే ఇప్పుడు అధ్యాపకుల కొరత వేధిస్తోంది. కర్నూలులోని ఉర్దూ విశ్వవిద్యాలయంలోనూ ఉర్దూకు అధ్యాపకులు లేరు. అక్కడ ఇంతవరకు రెగ్యులర్‌ అధ్యాపకుల నియామకం జరగలేదు. దీంతో, ఉర్దూ సబ్జెక్టులో పిహెచ్‌డిపై నోటిఫికేషన్‌ ఇవ్వలేదు. మైక్రోబయోలజీ పాలిమర్‌కు అధ్యాపకుల్లేక విద్యార్థులు ఆ విభాగంలో పిహెచ్‌డి కూడా చేయలేని పరిస్థితి ఉంది.   విశ్వవిద్యాలయాల్లో దాదాపు మూడు వేల వరకూ అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నట్టు సమాచారం. ప్రభుత్వం వీటిని భర్తీ చేస్తామని ప్రకటించినా, న్యాయపరమైన చిక్కుల పేరుతో కాలయాపన సాగుతూనే ఉంది. కొన్ని విశ్వవిద్యాలయాల్లోని విభాగాల్లో అధ్యాపకుల కొరతతో పిజి కోర్సులు సైతం ముందుకు వెళ్లడం లేదు. శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో మొత్తం 32 విభాగాలు ఉన్నాయి. చరిత్ర, పొలిటికల్‌ సైన్సు, ఇంగ్లీషు, జువాలజీ, పాలిమర్‌ సైన్సు, సెరీకల్చర్‌, అడల్డ్‌ ఎడ్యుకేషన్‌… ఈ ఆరు విభాగాల్లో ఒక్క రెగ్యులర్‌ అధ్యాపకుడూ లేరు. మరో 12 విభాగాలకు సంబంధించి ఒక్కరు చొప్పున మాత్రమే ఉన్నారు. అన్ని విభాగాల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలని, పిహెచ్‌డి చేసే అవకాశం క్లల్పించాలని విద్యార్థులు కోరుతున్నారు.

 

Tags: Lack of guides in universities

Leave A Reply

Your email address will not be published.