పదేళ్ల రచ్చకు నేతలు తెర

అదిలాబాద్ ముచ్చట్లు:

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఒకరేమో తూర్పు ప్రాంతంలో పూర్తి ప్రాబల్యం ఉన్న నేత.. మరొకరేమో పశ్చిమ ప్రాంతంలో పట్టున్న కీలక నాయకుడు.. ఇద్దరు కూడా హేమాహేమీ నేతలే.. దశాబ్ధకాలంగా ఇద్దరు కీలక నాయకులు తూర్పు, పశ్చిమ దిక్కుల వలె కలవని దిక్కుల్లా మారిపోయారు.. పదేళ్లుగా ఇద్దరి మధ్య వర్గపోరు, పార్టీలో పంచాయతీ నడుస్తోంది.. అలాంటిది ఇటీవల కాలంలో వారు చేస్తున్న వ్యాఖ్యలతో ఇద్దరు నేతలు ఏకతాటిపైకి వచ్చినట్లు తెలుస్తోంది.. కల్లోల కాంగ్రెసులో గ్రూపు రాజకీయాలు వీడి.. ఇద్దరి మధ్య సయోధ్య కుదిరి ఒక్కటైనట్లు తాజా పరిణామాలతో స్పష్టమవుతోంది. దోస్త్ మేరా దోస్త్ అంటూ స్నేహగీతం ఆలపించటంతో.. తమ పార్టీకి తిరుగు లేదని పార్టీ శ్రేణుల్లో నయా జోష్ కనిపిస్తోంది.ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇద్దరు కీలక నేతల మధ్య పదేళ్లుగా గ్రూపు రాజకీయాలు నడుస్తున్నాయి. ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్, మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఏఐసీసీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేం సాగర్ రావు మధ్య వర్గ పోరు ఉంది. రెండు సార్లు అధికారం కోల్పోయినా.. వరుస ఓటములు చవి చూసినా.. కాంగ్రెసు పార్టీలో ఆ నేతల మనుసులు కలవటం లేదు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా సాగటంతో పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లింది. జిల్లాలో క్యాడర్ బలంగా ఉన్నా.. లీడర్ల మధ్య సఖ్యత లేకపోవటంతో.. రెండు గ్రూపులుగా విడిపోయారు. దీంతో ఒకరి వర్గానికి మరొకరు పార్టీ పదవులు, టికెట్లు రాకుండా.. ఎన్నికల్లో చెక్ పెడుతూ వస్తున్నారు. ఒకరి ఆధిపత్యానికి మరొకరు గండి కొట్టగా.. ఒకరికి పట్టు దొరకకుండా మరొకరు తీవ్రంగా ప్రయత్నించారు. దీంతో పార్టీ తీవ్రంగా నష్టపోయింది.ఇంతకాలం ఇద్దరు నేతలు ఎవరికి వారే అన్నట్టుగా గ్రూపు రాజకీయాలు నడుపగా.. తాజాగా వీరిద్దరు ఐక్యతారాగం ఆలపించటం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అధిష్టానం ఒత్తిడో.. స్థానిక పరిస్థితులో.. తెలియదు కానీ.. ఇలాంటి సమయంలో కొక్కిరాల చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇకపై గ్రూపులు ఉండవని.. ఉమ్మడి జిల్లాలో 10 నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా పని చేస్తామని చెప్పటం విశేషం. మంచిర్యాల నియోజకవర్గం దండేపల్లి మండలం కోయపోచగూడెంకు చెందిన ఆదివాసీలను పోడు భూముల్లో సాగు చేస్తున్నారని అధికారులు అరెస్టు చేయగా.. ఆదిలాబాద్ జిల్లా జైలులో ఉన్నారు.

 

 

వీరిని పరామర్శించేందుకు ములుగు ఎమ్మెల్యే సీతక్క, కేంద్ర మాజీమంత్రి బలరాం నాయక్ తోపాటు ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి, కొక్కిరాల వర్గీయులు కలిసి వెళ్లటం కొత్త పరిణామంగా చెప్పవచ్చు. మంచిర్యాల నియోజకవర్గంలోని ఆదివాసీలకు జరిగిన అన్యాయంపై ఏలేటి నిర్మల్ కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టడం కొసమెరుపు. ఒకప్పుడు ఒకరి పేరు ఒకరు పలికేందుకు.. ఎదురుపడేందుకు.. పలకరించుకునేందుకు ఇష్ట పడని నాయకులు.. ఇప్పుడు దోస్త్ మేరా దోస్త్ అంటూ స్నేహగీతం ఆలపిస్తున్నారు.ఇటీవల హైదరాబాదులో జరిగిన కాంగ్రెస్ సంకల్ప సమావేశాల్లో ఏలేటి, కొక్కిరాల మధ్య సంకల్పం కుదిరినట్లు తెలుస్తోంది. ఈ సమావేశం తర్వాత ఇద్దరు కలిసి ఉన్న ఫోటోలు వైరల్ అవగా.. కలహాలు వీడి కలిసి నడవాలనే ఆలోచనకు వచ్చినట్లు తెలిసింది. ఈ సయోధ్యకు రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్యం ఠాకూర్, ఏఐసీసీ కార్యదర్శి శ్రీనివాస కృష్ణన్ చొరవ తీసుకున్నట్లు సమాచారం. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని ఏలేటి ప్రకటన.. కొక్కిరాల వ్యాఖ్యలు ఒకేలా ఉండటం వీరిద్దరి సయోధ్య కుదిరిందనేందుకు సాక్షంగా నిలుస్తోంది. మరోవైపు ఇద్దరు నేతలకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో గ్యాప్ పెరిగింది. శత్రువు శత్రువు మిత్రుడు అన్నట్లుగా.. ఇద్దరు ఏకమైనట్లు చర్చ సాగుతోంది. ఉమ్మడి జిల్లాలో ఇద్దరు కలిస్తే.. ఇక తమకు, పార్టీకి ఎదురుండదనే భావనకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇద్దరూ కలిసి మీడియా ముందుకు కూడా వస్తారనే చర్చ ఉంది. ఈ దృశ్యం ఎప్పుడు ఆవిష్కృతమవుతుందా.. అని కార్యకర్తలు ఎదురు చూస్తున్నారు. ఇదే జరిగితే ఇక ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ దూకుడు పగ్గాలుండవని.. ఈ పరిణామాలు పార్టీ శ్రేణుల్లో నయా జోష్ నింపుతున్నాయి. ఈ సయోధ్య ఎన్నికల వరకు కొనసాగుతుందా.. ఇద్దరూ కలిసి పార్టీని విజయతీరాలకు చేరుస్తారా.. లేదో చూడాలి.

 

Tags: Leaders screen for ten years of hustle and bustle

Leave A Reply

Your email address will not be published.