సంతపైకన్ను వేసిన నేతలు

ఖమ్మం  ముచ్చట్లు:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గంలో అధికార పార్టీ ద్వితీయ స్థాయి నాయకులదే హవా నడుస్తోంది. భూదందాలు, సెటిల్మెంట్లు, ప్రైవేట్ పంచాయతీలతో మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతున్నారు. కొంతమంది ప్రజాప్రతినిధులు అక్రమ వ్యాపారాలకు, అడ్డగోలు దందాలకు కొమ్ము కాస్తుంటే మరికొంతమంది భూ దందాలు, ఆక్రమణలు చేస్తూ ఖద్దరు చొక్కా మాటున రూ. కోట్లు గడిస్తున్నారు. ప్రజా సమస్యలను పరిష్కరిస్తారని నాయకులుగా ఎన్నుకుంటే ప్రజల ధనాన్ని దర్జాగా దోచుకుంటున్నారు. ఇల్లు కట్టాలన్నా ఇంటి పట్టా పొందాలన్నా ఈ ద్వితీయ స్థాయి ప్రజాప్రతినిధులకు ఎంతోకొంత ముట్టజెప్పితే గానీ పనులు కానీ పరిస్థితి నెలకొంది. రూ. లక్షలు ఖర్చుపెట్టి ప్రజాప్రతినిధులుగా గెలిచామని డబ్బు సంపాదించడానికి అవకాశం ఉన్న ప్రతి ఒక్కదారిని వారికి అనుకువగా మలుచుకుంటున్నారు. ప్రస్తుతం వారాంతపు సంతపై వారి కన్ను పడింది.కొత్తగూడెం మున్సిపాలిటీకి ప్రధాన ఆదాయ వనరు అయిన వారాంతపు సంత అతి తక్కువ ధరకు కొట్టేయడానికి కొంతమంది ప్రజాప్రతినిధులు పావులు కదుపుతున్నారు. కరోనా కారణంగా గత రెండు సంవత్సరాలుగా వారాంతపు సంత వేలంపాట జరగలేదు. దీంతో కొత్తగూడెం మున్సిపాలిటీకి ఆదాయం దాదాపు తగ్గిపోయింది.

 

 

 

ఎలాగో సంత వేలంపాట లేదు కదా అనుకున్న మరో కొంతమంది ప్రజాప్రతినిధులు సంతలో చిరు వ్యాపారాలు చేసుకునేవారికి రూ. 1000, రూ. 1500 చొప్పున డబ్బు తీసుకుని వారికి స్థలాలు కేటాయించారు. కానీ తాజాగా సంత వేలంపాట పెడతామన్న నిర్ణయంతో ఎలాగైనా సంతను దక్కించుకోవాలన్న ఆలోచనతో సిండికేట్ రూపకల్పన చేశారని పట్టణంలో జోరుగా ప్రచారం సాగుతోంది.వారాంతపు సంతలో వచ్చే ఆదాయాన్ని ముందుగానే ఊహించిన కొందరు సంతను దక్కించుకోవడానికి సామ, వేద, దండోపాయాలు ఉపయోగిస్తున్నారు. ప్రతిసారి సంత వేలంపాట ప్రక్రియలో భాగంగా సీక్రెట్ టెండర్ కి ఆహ్వానిస్తారు. అనంతరం బహిరంగ వేలం నిర్వహిస్తారు. బహిరంగ వేలం పూర్తయిన తర్వాత సీక్రెట్ టెండర్ ఒక్కొక్కటిగా ఓపెన్ చేసి చూస్తారు. బహిరంగ వేలం పాట కన్నా సీక్రెట్ టెండర్ లో తక్కువ కోడ్ చేసినట్లయితే బహిరంగ వేలం పాట ఎవరైతే అధిక ధరకు పాడుకుంటారో వారికే సంత ఖరారు చేస్తారు.ఒకవేళ బహిరంగ వేలం పాట కన్నా సీక్రెట్ టెండర్ లో అధిక ధరకు కోడ్ చేసినట్లయితే బహిరంగ వేలం పాటని రద్దు చేసి సీక్రెట్ టెండర్ లో అధిక ధరకు కోడ్ చేసిన వ్యక్తికి టెండరు ఖరారు చేస్తారు.

 

 

 

 

కానీ ఈసారి ప్రక్రియ అలా జరగడం లేదు. సీక్రెట్ టెండర్లు ఆహ్వానించకుండా బహిరంగ వేలం పాట నిర్వహిస్తున్నారు. సంతను దక్కించుకోవడానికి కొంతమంది సిండికేట్ గా ఏర్పడి రాజకీయ పలుకుబడిని ఉపయోగించి సీక్రెట్ టెండర్ లేకుండా బహిరంగ వేలంలో సంత చేజిక్కించుకుందామనే ప్రయత్నం చేస్తున్నట్లు కొత్తగూడెం పట్టణంలో జోరుగా ప్రచారం సాగుతోంది. బహిరంగ వేలంలో పాల్గొనే అభ్యర్థులు మొత్తం వారి మనుషులే కావడంతో సంత పాట అధిక ధరకు పోకుండా చేసి తక్కువ ధరకు కొట్టేద్దామని ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా చేయడం ద్వారా కొత్తగూడెం మున్సిపాలిటీ ఆదాయానికి గండి పడుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.ఈ సంత వ్యవహారమంతా అధికార పార్టీ రాష్ట్ర నాయకుడిని అని చెప్పుకు తిరిగే అజ్ఞాతంలో ఉన్న ఒక వ్యక్తి ఈ సిండికేట్ కి రూపకర్త అయినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. అజ్ఞాతంలో ఉన్న ఆ రాష్ట్ర నాయకుడు అధికారులను మభ్యపెట్టి సంత వేలం తన మనుషులకు దక్కేటట్లు స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. సంత వేలం పాటకు ప్రత్యర్థులు ఎవరు రాకూడదంటూ హుకుం జారీ చేసినట్లు తెలుస్తోంది. అజ్ఞాతంలో ఉన్న ఆ రాష్ట్ర నాయకుడు బయటకి కనబడకుండా చేయవలసిన కార్యక్రమాలన్నీ సైలెంట్ గా చేస్తున్నట్లు పట్టణ ప్రజలు తమ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఈ సంత వ్యవహారంలో జిల్లా కలెక్టర్ దృష్టి సారిస్తే తప్ప మున్సిపాలిటీకి ఆదాయం సమకూరే పరిస్థితులు కనపడటం లేదు.

 

Tags: Leaders who looked at Santapai

Leave A Reply

Your email address will not be published.