వరంగల్ లో కాషాయ కమలం గ్రూపులుకు విడిపోయిన నేతలు

Saffron lotus in warangal

Saffron lotus in warangal

Date:10/10/2018
వరంగల్  ముచ్చట్లు:
ఎన్నికల వేళ కమలం పార్టీలో కలహాల కుంపటి రగులుకుంది. క్రమశిక్షణ కలిగిన పార్టీగా చెప్పుకునే బీజేపీ అంతర్గత కుమ్ములాటలతో సతమతమవుతోంది. అర్బన్ జిల్లా బీజేపీలో రెండు వర్గాలు ఏర్పడ్డాయి. నాయకులు రెండు గ్రూపులుగా విడిపోయి ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. రాష్ట్ర నాయకత్వం రెండ్రోజుల క్రితం నియోజకవర్గాల వారీగా ముఖ్య కార్యకర్తల అభిప్రాయాల సేకరణ చేపట్టింది. అర్బన్ జిల్లా నాయకులు ప్రవర్తించిన తీరుపై రాష్ట్ర నాయకత్వం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు సమాచారం.
సమర్థులను ఎన్నికల బరిలో నిలిపి గెలుపు తీరాలకు చేరాలని జాతీయ నాయకత్వం వ్యూహాలు రచిస్తున్నదని, జిల్లాస్థాయిలో ఈ గ్రూపు రాజకీయాలు ఏమిటని మందలించినట్లు తెలిసింది. వరంగల్ అర్బన్ జిల్లాలో సీనియర్ నాయకులు వర్గాలు నడుపుతుండడంతో వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీపై ప్రభావం చూపుతుందని బీజేపీ శ్రేణులు మధన పడుతున్నారు.తూర్పులో బీజేపీలో స్థానిక నినాదం తెరపైకి వచ్చింది.
గత ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకొని ప్రస్తుత అర్బన్ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ తూర్పు నుంచి బరిలోకి దిగారు. ప్రస్తుతం బీజేపీ ఒంటరిగా బరిలోకి దిగుతున్న తరుణంలో ఆమె పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తూర్పు నియోజకవర్గం నుంచి స్థానిక నాయకులకు టికెట్ కేటాయించాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది. ఇతర ప్రాంతాల నుంచి నేతలను పోటీకి పెడితే సహకరించేది లేదని స్థానిక నాయకత్వం రాష్ట్ర పార్టీకి అల్టీమేటం ఇస్తోంది. రెండు రోజుల క్రితం రాష్ట్ర కోర్ కమిటీ చేపట్టిన కార్యకర్తల అభిప్రాయ సేకరణలో తూర్పుకు చెందిన నాయకులు, కార్యకర్తలు స్థానిక అంశాన్ని గట్టిగా చెప్పినట్లు తెలిసింది. స్థానిక నాయకత్వానికి టికెట్ కేటాయించాలని తూర్పు నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
తూర్పులో పోటీ చేయాలన్న ఆలోచనలో ఉన్న నాయకుల్లో ఓ వర్గం స్థానికేతరులకు మద్దతు తెలుపుతుండగా మరో వర్గం స్థానిక నేతలకు అండగా నిలుస్తోంది. ఎన్నికల సమయంలో కమల పార్టీలో కలహాల కుంపటి రాజుకోవడంతో రాష్ట్ర నాయకత్వం కలవరపడుతోంది. వచ్చే ఎన్నికల్లో పశ్చిమ టికెట్ శిస్తున్న మార్తినేని ధర్మారావు, అర్బన్ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ అనుచరగణం రాష్ట్ర పార్టీ కార్యాలయంలో గలాట చేసినట్లు సమాచారం. అర్బన్ జిల్లా నేతల అనుచరుల లొల్లిపై కోర్ కమిటీ సీరియస్ అయినట్లు తెలిసింది.
క్రమశిక్షణ ఉన్న పార్టీగా చెప్పుకునే బీజేపీ రెండు వర్గాలుగా విడిపోయి అనుచరులతో రాష్ట్ర నాయకత్వం ముందు లొల్లికి దిగడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మొన్నటి వరకు అంతర్గతంగా ఉన్న గ్రూపు తగాదాలు ఎన్నికలు రావడంతో టికెట్ల సమయంలో బహిర్గతం అయ్యాయి. పశ్చిమ నియోజకవర్గంపై కన్నేసిన రావు పద్మ, మార్తినేని ధర్మారావుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఈ పరిస్థితిలో ఇద్దరిలో ఒకరికి టికెట్ ఇస్తే మరొకరు సహకరిస్తారా?, లేదా అనే అనుమానాలు శ్రేణుల్లో వ్యక్తమవుతున్నాయి.
Tags:Leaders who split into the saffron lotus groups in Warangal

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *