టూ లెట్ కనిపించిదో రెక్కి…

Date;28/02/2020

టూ లెట్ కనిపించిదో రెక్కి…

నిజామాబాద్ముచ్చట్లు:

ఇల్లు అద్దెకు ఇస్తున్నారా..? అయితే తప్పకుండా జాగ్రత్తలు పాటించాలని పోలీసులు ప్రజలను హెచ్చరిస్తున్నారు. ఇల్లు అద్దె కోసం వచ్చేవారి నుంచి సరైన ఆధారాలు, పూర్తి వివరాలు  తెలుసుకోవాలని, ఆపైనే అద్దెకు ఇవ్వాలని అంటున్నారు. నేరస్తులు ఇల్లు అద్దె పేరుతో నేరాలకు పాల్పడుతున్నారు. ప్రతిరోజూ నగరంలో ప్రతి కాలనీలో సంచరిస్తూ టులెట్‌ బోర్డుల కోసం  వెతుకుతున్నారు. బోర్డు కనిపిస్తే చాలు వెంటనే ఇల్లు అద్దెకు కావాలని యజమానిని కలిసి అద్దెకు తీసుకుంటున్నారు. ఫ్యామిలీగా ఇంట్లోకి అద్దెకు తీసుకొని నేరాలకు పాల్పడుతున్నారు.  ప్రతిరోజూ ఇంట్లో ఉన్న వారిని గమనిస్తుంటారు. ఇంట్లో ఎవరు ఉంటున్నారు? ఏ సమయంలో ఉంటున్నారు? తదితర విషయాలు తెలుసుకుంటున్నారు.ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే  వెంటనే పోలీసులకు లేదా డయల్‌ 100కు సమాచారం ఇవ్వాలని ఇంటి యజమానులకు పోలీసులు సూచిస్తున్నారు. గుర్తుతెలియని వ్యక్తులకు, ఎలాంటి ఆధారాలు లేని వారికి ఇల్లు అద్దెకు ఇవ్వడంతో పలు నేరాలు జరుగుతున్నాయి. దొంగతనాలు, హత్యలు, దాడులు, అసాంఘిక కార్యక్రమాలు తదితర ఘటనలు జరిగే అవకాశం ఉంది. ఇలాంటి సంఘటనే ఇటీవల
నిజామాబాద్‌ నగరంలో చోటుచేసుకుంది. గుర్తుతెలియని వ్యక్తులకు ప్రభావతి ఇల్లు అద్దెకిచ్చి తన ప్రాణాలు పోగొట్టుకుంది. మరోసారి ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా ప్రజలు
అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.  సరైన సమయం చూసుకొని ఇంటికి తాళం వేస్తే దొంగతనం లేదా ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళలను టార్గెట్‌ చేస్తున్నారు. వారిపై
దాడులు చేయడం, తిరగబడితే హత్యలకు పాల్పడుతున్నారు. ఇలాంటి సంఘటనలు తరుచూ జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా శివారు కాలనీలు, జనసంచారం లేని కాలనీలను  నేరస్తులు టార్గెట్‌ చేస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కాలనీలో టులెట్‌ బోర్డులను చూసి ఫోన్‌ చేయడం లేదా ఇంట్లో వారిని సంప్రదించి అద్దెకు సంబంధించి పూర్తి వివరాలు  సేకరించడం వంటివి చేస్తున్నారు. ఒక్కోసారి ఇంట్లో మహిళలు ఒంటరిగా ఉంటే చాలు.. వారిపై దాడిచేసి ఇంట్లో ఉన్న బంగారం, నగదు అపహరించి పారిపోతున్నారు. లేదంటే రాత్రి వేళ్లలో  దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఇలా వివిధ మాస్టర్‌ ప్లాన్లు వేసుకొని పలు నేరాలు చేస్తున్నారు. పోలీసులు ఎప్పటికప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నా ఎక్కడో ఒకచోట  ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి

 

Tags;Let us see what you want …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *