ప్రాచీన సంపదను కాపాడుకుందాం

కడప ముచ్చట్లు:

 

ప్రాచీన సంపదను కాపాడు కొంటూ రాయలసీమ స్థాయిలో పర్యాటకరంగాన్ని అభివృద్ధి చేద్దామని డా. కోట మృత్యుంజయరావు అన్నారు.  రాయలసీమ దేవాలయాలు, శిల్పసంపదపై ఇటీవల పరిశోధనలు నిర్వహించి డాక్టరేట్‌ సాధించిన ఆయనకు ఆదివారం రాయలసీమ టూరిజం అండ్‌ కల్యరల్‌ సొసైటి కార్యాలయంలో ఆయనతోపాటు సౌత్‌ ఇండియా ఫోటో అండ్‌ వీడియో ఎక్సలెన్స్‌ అవార్డు సాధించిన సంస్థ ప్యాట్రన్‌ కె. చంద్రారెడ్డిని ఘనంగా సత్కరించారు.  ఈ సందర్భంగా కోట మృత్యుంజయరావు మాట్లాడుతూ తనకిష్టమైన కళారంగంలో ముఖ్యంగా పర్యాటకానికి దోహదపడే దేవాలయాలు, శిల్పకళపై పరిశోధన చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు.  పెద్దలు, హితుల సలహాలు, ప్రోత్సాహంతోనే తాను డాక్టరేట్‌తో పాటు ప్రత్యేకంగా శిల్పకళపై చేసిన పరిశోధనకు బంగారు పతకం సాధించగలిగామన్నారు.  పద్మప్రియ చంద్రారెడ్డి మాట్లాడుతూ పర్యాటకానికి ఫోటో అండ్‌ వీడియోగ్రఫీ ప్రాణం లాంటిదని సంస్థ ప్యాట్రన్‌గా తాను రాయలసీమస్థాయిలో పర్యాటకరంగం అభివృద్ధికి కృషిచేస్తున్నామన్నారు.  రాష్ట్రస్థాయిలో ఫోటో అండ్‌ వీడియోగ్రాఫర్ల సంక్షేమానికి అందించిన కృషికి ఈ అవార్డు లభించడం సంతోషంగా ఉందన్నారు.  మరికొందరు ఫోటో అండ్‌ వీడియోగ్రాఫర్లను పర్యాటకరంగం వైపు వచ్చేలా చూస్తామన్నారు.

 

 

యువసాహితీవేత్త డా. జి.వి. సాయిప్రసాద్‌ అధ్యక్షత వహిస్తూ ముఖ్యంగా వై.ఎస్‌.ఆర్‌. జిల్లాలో అపురూపమైన చారిత్రక, వారసత్వ పర్యాటక సంపద ఉందని, ఇప్పటికే జిల్లా పర్యాటకంపై రాయలసీమ టూరిజం అండ్‌ కల్చరల్‌ సొసైటి పుస్తకాలు ప్రచురిస్తూ ఈ రంగం అభివృద్ధికి తోడ్పడుతుండడం సంతోషదాయకమన్నారు.  సంస్థ ప్రధాన కార్యదర్శి కొండూరు జనార్దన రాజు మాట్లాడుతూ తమ సంస్థ సహాయ కార్యదర్శి కోట మృత్యుంజయరావు సీమ శిల్పకళపై పరిశోధనచేసి డాక్టరేట్‌తో పాటు పొట్టిశ్రీరాములు విశ్వవిద్యాలయం స్థాయిలో బంగారు పతకం పొందడం, సంస్థ ప్యాట్రన్‌ పద్మప్రియ చంద్రారెడ్డి ఫోటో అండ్‌ వీడియోగ్రఫీలో రాష్ట్రస్థాయి ప్రతిష్ఠాత్మక అవార్డు పొందడం సంస్థకు గర్వకారణమన్నారు.  ఈ సందర్భంగా సత్కారగ్రహీతలు నిర్వాహకులకు ధన్యవాదాలు తెలిపారు.  ఈ కార్యక్రమంలో చిత్రకారుడు వెంకటేష్‌, గొబ్బూరి కోటేశ్వరరావు, జ్యోతి జార్జి, డేవిడ్‌, సతీష్‌, తదితరులు పాల్గొన్నారు.

 

Tags: Let’s preserve the ancient wealth

Leave A Reply

Your email address will not be published.