Natyam ad

బాల్య వివాహాలను అడ్డుకుందాం

వరంగల్  ముచ్చట్లు

బాల్య వివాహాల నిర్మూలన పై మహబూబాబాద్ జిల్లా ఐసీడీఎస్ అధ్వర్యంలో పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు నిర్వహించిన సదస్సుకు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ముఖ్య అతిథిగా హాజరై, జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ వెనుకటికి…బంధుత్వాలను  పోగొట్టుకో వద్దని… ఆడపిల్ల పుట్టగానే పలానావాడికి భార్య పుట్టిందని ఇరువర్గాలవారు నిర్ణయించేసుకొని పిల్లలు కొంచెం పెద్దవారవ్వగానే పెండ్లి చేసేవారు.వృద్ధుల కోరిక మేరకు వారు చనిపోయేలోపు తమ వారసుల పెళ్ళిళ్ళు చూడాలనే కోరికను తీర్చడానికి కూడా బాల్యవివాహాలు జరిపించేవారని అన్నారు.
పిల్లలు యుక్త వయసు (Teenage) కు వచ్చిన తర్వాత వక్ర మార్గాల్లో ప్రయాణిస్తారనే భావనతో ముందు జాగ్రత్తగా బాల్యవివాహాలు జరిపించేవారు. అయితే, బాల్య వివాహం చేసినప్పటికీ అమ్మాయి యుక్త వయసుకు వచ్చిన తర్వాత మాత్రమే కాపురానికి పంపించేవారు.  ఇలా చేయడం వల్ల అమ్మాయికి అబ్బాయికి ఒకరిపై ఒకరు ఇష్టం ఉన్నా లేకపోయినా కలిసి జీవితం గడపాల్సివచ్చేది.  అమ్మాయికి ఊహ తెలిసినా తెలియకపోయినా వయసులో ఎక్కువ తేడా ఉన్న వ్యక్తులతో కూడా ఈ వివాహాలు జరిపించేవారు.  ఒక వేళ వయసులో ఎక్కువ తేడా వల్ల పురుషుడు ముందుగా చనిపోయినప్పటికీ మళ్ళీ పెండ్లి ల్లు ఉండేవి కావు. అందువల్ల అమ్మాయి చిన్నవయసులోనే బాల వితంతువుగా మారి జీవితాంతం అలాగే ఉండాల్సివచ్చేది. రాజా రామ్మోహన్ రాయ్, కందుకూరి వీరేశలింగం పంతులు వంటి సంఘ సంస్కర్తల కృషి వల్ల బాల్య వివాహాలు తగ్గి, వితంతు వివాహాలు పెరిగాయి. గ్రామీణ ప్రాంతాల్లో, చదువు అంతగా లేని వాళ్ళల్లో ఇప్పటికీ బాల్య వివాహాలు జరుగుతూనే ఉన్నాయి. 2006లో  బాల్య వివాహాల నిరోధక చట్టం వచ్చింది. 18 ఏ0డ్లు దాటిన ఆడపిల్లలు, 21 ఏ0డ్లు దాటిన మగపిల్లలకు మాత్రమే పెండ్లి లు చేయాలి. అలా చేయకపోతే, చట్టరీత్యా నేరమని అన్నారు.
అయినా ఎవరైనా అలా పెండ్లిల్లు చేస్తే, జరిమానా, శిక్షలు పడతాయి. బాల్య వివాహం గురించి సమాచారం తెలిసిన ఎవ్వరైనా ఫిర్యాదు చేయవచ్చు.  జిల్లా కలెక్టర్ నుంచి కింది స్థాయి అధికారుల దాకా ఎవ్వరికైనా ఫిర్యాదు చేయవచ్చు రాతపూర్వకంగా, నోటిమాటగా, ఉత్తరం, ఈ మెయిల్ ద్వారా చేయవచ్చు. వంద అబద్ధాలు ఆడైనా ఒక పెండ్లి చేయమన్నార ని చెప్పకుండా ఉండవద్దు. తల్లిదండ్రులు, సంరక్షుకులు, పురోహితులు, స్నేహితులు, ఇరుగుపొరుగువారు, బాల్య వివాహానికి అనుమతించిన కులపెద్దలు, వివాహ ఏర్పాట్లకు సహకరించిన వారందరూ నేరస్థులే.. పెళ్లికి హాజరైనవారుకూడా నేరస్థులవుతారు. నేరస్థులకు రెండేళ్ల వరకు కఠిన కారాగార శిక్ష పడవచ్చు. లక్షరూపాయల వరకు జరిమానా విధించవచ్చు.  ఈ నేరాలకు బెయిల్ కూడా ఉండదని అన్నారు.
జిల్లా స్థాయిలో కలెక్టర్, డివిజన్ స్ధాయిలో ఆర్డీవో, ప్రాజెక్ట్ స్థాయిలో (మూడు నుంచి ఐదు మండలాలు) సీడీపీవోలు ఉన్నా రు.  మండల స్థాయిలో తహసీల్దార్లు, గ్రామస్ధాయిలో ఐసీడీఎస్ సూపర్వైజర్లు, పంచాయతీ కార్యదర్శులు, వీఏవోలు, బాధ్యులు.  గ్రామ స్ధాయిలో బాల్య వివాహలను అడ్డుకునేందుకు విలేజ్ మానిటరింగ్ కమిటీ ఉంది.  కమిటీ ఛైర్మన్గా సర్పంచ్, కన్వీనర్గా అంగన్వాడీ వర్కర్, సభ్యులుగా పంచాయతీ కార్యదర్శి, వీఏవో, పాఠశాల ఉపాధ్యాయుడు, ఏఎన్ఎం, వార్డు మెంబరు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు ఉంటారు.  2009 యునిసెఫ్ నివేదిక ప్రకారం ప్రపంచం మొత్తం మీద జరిగే బాల్య వివాహాలలో 40 శాతం వివాహాలు భారతదేశంలోనే జరుగుతున్నాయని అన్నారు.

Tags: Let’s stop child marriage…